మరో సారి రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్

మరో సారి రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్
x
Highlights

రివర్స్ టెండరింగ్‌లో ఏపీ ప్రభుత్వం మరోసారి సక్సెస్ అయ్యింది. ఇప్పటి వరకు సాగు నీటి ప్రాజెక్టుల్లో అమలు చేసిన జగన్ సర్కార్ తాజాగా వివిధ పరికరాల...

రివర్స్ టెండరింగ్‌లో ఏపీ ప్రభుత్వం మరోసారి సక్సెస్ అయ్యింది. ఇప్పటి వరకు సాగు నీటి ప్రాజెక్టుల్లో అమలు చేసిన జగన్ సర్కార్ తాజాగా వివిధ పరికరాల కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ ఆహ్వానించింది. దీంతో 66 కోట్ల రూపాయల మేర ప్రజా ధనం ఆదా అయ్యింది.

పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ అవినీతి రహిత విధానాల్లో భాగంగా ప్రజా ధనం ఆదా చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ మరోసారి గ్రాండ్ సక్కెస్ అయ్యింది. గ్రామ, వార్డు సచివాలయ కోసం కంప్యూటర్‌ పరికరాల కొనుగోళ్లలో భారీగా నిధులు ఆదా అయ్యాయి. డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, యూపీఎస్‌ల కొనుగోలు పై 51 కోట్ల 15 లక్షల రూపాయలు, ప్రింటర్ల కొనుగోలులో 14 కోట్ల 32 లక్షలు మొత్తంగా 65 కోట్ల 47 లక్షల మేర ప్రభుత్వ ఖజనాకు ఆదా అయ్యింది

ప్రజలకు తక్షణ సేవలు అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించింది. ఇందుకోసం 29 వేల 888 కంప్యూటర్లు, 14 వేల 944 యూ.పి.ఎస్‌లకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందు కోసం మూడు కంపెనీలు పోటీ పడ్డాయి.

అతి తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1 గా నిలిచిన కంపెనీ 191 కోట్ల 10 లక్షల 38 వేల 720 రూపాయల తక్కువ ధరకు కోట్‌ చేసింది. దీనిపై ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా మరో కంపెనీ 139 కోట్ల 95 లక్షల 38 వేల 720 రూపాయలకు కోట్‌ చేసి టెండర్‌ను దక్కించుకుంది. ఎల్‌–1 టెండర్‌ విలువ కన్నా 26.77 శాతం తక్కువకు ఈ కంపెనీ రివర్స్‌ టెండరింగ్‌లో కోట్‌ చేయడం వల్ల రూ. 51.15కోట్ల ప్రజా ధనం ఆదా అయ్యింది.

నిర్దేశితప్రమాణాలు కలిగిన 14 వేల 944 మల్టీ ఫంక్షన్‌ ప్రింటర్స్‌ కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా తొలుత 38 కోట్ల 92 లక్షల 76 వేల 256 రూపాయలకు కోట్‌ చేసిన కంపెనీ ఎల్‌–1 గా నిలిచింది. దీనిపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లగా 24 కోట్ల 60 లక్షల 26 వేల 256 రూపాయలకు మరో కంపెనీ కోట్‌ చేసింది. ఇది ఎల్‌–1 టెండర్‌ విలువ కన్నా 36.8 శాతం తక్కువ. దీంతో 14 కోట్ల 32 లక్షల 50 వేల రూపాయిల ప్రజా ధనం ఆదా అయింది.

తొలుత పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసిన జగన్ సర్కార్ 839 కోట్ల రూపాయల మేర ఆదా చేసింది. అనంతరం వెలిగొండ టన్నెల్‌–2 పనుల్లో కూడా 62 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని ఆదా చేసింది. ఆశించిన స్ధాయిని మించి ప్రయోజనాలు వస్తూ ఉండటంతో మరిన్ని శాఖల్లో రివర్స్ టెండరింగ్ అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయ, ప్రజా సంఘాల నుంచి ప్రశంసలతో పాటు మద్దతు లభిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories