AP Politics Updates: ఆర్‌.ఆర్‌.ఆర్ వర్సెస్ వి.ఎస్‌.ఆర్‌... ఏ విందు ఇరువురి నడుమ అగ్గిరాజేసింది?

AP Politics Updates: ఆర్‌.ఆర్‌.ఆర్ వర్సెస్ వి.ఎస్‌.ఆర్‌... ఏ విందు ఇరువురి నడుమ అగ్గిరాజేసింది?
x
Highlights

AP Politics Updates: ఆర్‌.ఆర్‌.ఆర్‌ వర్సెస్ వి.ఎస్‌.ఆర్ సౌండ్‌ కొత్తగా వుందా రీసౌండ్‌ ఇస్తోంది వీరి మధ్య యుద్ధం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమరం సమరం...

AP Politics Updates: ఆర్‌.ఆర్‌.ఆర్‌ వర్సెస్ వి.ఎస్‌.ఆర్ సౌండ్‌ కొత్తగా వుందా రీసౌండ్‌ ఇస్తోంది వీరి మధ్య యుద్ధం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమరం సమరం అంటూ డైలాగ్‌ వార్‌ సాగుతోంది. ఇద్దరూ ఒకే పార్టీ అయివుండి, ఇద్దరూ ఎంపీలయి వుండి అసలేంటి వీరి మధ్య గొడవ? ఎక్కడ చెడింది వీరికన్నది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఒక విందు రాజకీయమే, ఎంపీల విభేదాలను మండించిందన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా విందు....?

ఆర్‌.ఆర్.ఆర్. ఇది రాజమౌళి సినిమా టైటిల్‌ కాదు ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుబాటు అనే సినిమాను సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రెజెంట్‌ చేస్తున్న రఘురామ కృష్ణంరాజు పేరు. షార్ట్‌ ఫాంలో ఆర్.ఆర్‌.ఆర్‌. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా, ఆర్‌.ఆర్‌.ఆర్‌. అంటూ రాజుగారిని సంభోధించారు. సినిమాను ప్రేమించే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఎప్పుడు విడుదల అయ్యి సినిమా థియేటర్లను కాపాడుతుందో తనకు తెలీదు కానీ, వైఎస్సార్సీపీని కాపాడటానికి మాత్రం జగన్‌ను ప్రేమించే వ్యక్తి ఆర్ఆర్ఆర్ ఇప్పటికే వచ్చినందుకు తనకు సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి.

విఎస్‌ఆర్. విజయసాయిరెడ్డి. సింపు‌ల్‌గా విఎస్‌ఆర్. సైరా పంచ్‌లంటూ ట్వీట్లతో తెలుగుదేశాన్ని కుళ్లబొడిచే పార్లమెంట్‌ మెంబర్. జగన్‌పై ఈగవాలనివ్వని వీరవిధేయుడు. ఆర్‌ఆర్‌ఆర్‌, విఎస్‌ఆర్‌పై ఏ రేంజ్‌లో చెలరేగిపోయారో, కొన్నిరోజుల నుంచి చూస్తూనే వున్నాం. విజయసాయిపై సంచలన వ్యాఖ్యలు చేసి, కాక రేపారు రఘురామ. పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలకు పాల్పడుతున్నారని పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు విజయసాయి. ఆ షోకాజ్‌‌‌కు రిప్లై ఇస్తూ పార్టీ పేరును, మూలాలనే ప్రశ్నించిన రఘురామ, విజయసాయిరెడ్డే టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? అంటూ, విజయసాయిరెడ్డినే ఢీకొట్టారు రాజు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? మీటింగ్ ఎప్పుడు పెట్టారు? షోకాజ్ ఎవరు జారీ చెయ్యాలి? ప్రొసీజర్ తెలుసా? అంటూ, విఎస్‌ఆర్‌ను లక్ష్యంగా చేసుకుని చెలరేగారు ఆర్‌ఆర్‌ఆర్.

రఘురామ విమర్శలపై ఆలస్యంగానైనా స్పందించిన విజయసాయిరెడ్డి, ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు. ఔను...విఎస్‌ఆర్‌తోనే ఆర్‌ఆర్‌ఆర్‌ యుద్ధమని అర్థమవుతోంది. అధినేతను ఒక్క మాటా అనకుండా కేవలం విఎస్‌ఆర్‌‌ను టార్గెట్‌ చేయడంతోనే, రఘురామ సమరం ఎవరితోనో క్లియర్‌ కట్‌గా సంకేతాలిస్తోంది. మరి ఇద్దరికి ఎక్కడ చెడింది? ఏ సంఘటన సమరాగ్నికి ఆజ్యం పోసింది? దీని వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరి ఏంటి?

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌, ఢిల్లీలో ఈ కీలక బాధ్యతలను విజయసాయికి అప్పగించారు. ఢిల్లీలో ఏపీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ విజయసాయే లీడ్‌ తీసుకుంటున్నారు. రాజ్యసభలోనూ, అఖిలపక్ష సమావేశాల్లోనూ, వైసీపీ తరపున సారథ్యం వహించేది విజయసాయే. ఏపీకి నిధులు, పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల అనుమతులు మొదలు, ప్రతి అంశానికి సంబంధించి, కేంద్రమంత్రులను కలిసేది విజయసాయిరెడ్డి. సీఎం జగన్‌కు ప్రధాని సహా మినిస్టర్ల అపాయింట్లను ఫిక్స్ చేయడంలోనూ విఎస్‌ఆరే కీ రోల్. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏపీకి జగన్‌ ఎలాగో, ఏపీ సంబంధించి ఢిల్లీలో విజయసాయి అలాగన్న మాట. కానీ రఘురామ కృష్ణంరాజు ఈ విషయంలో విజయసాయి ఈగోను హర్ట్ చేశారన్న చర్చ జరుగుతోంది.

రఘురామకృష్ణంరాజుకు బీజేపీలోని కీలక నాయకులు, కేంద్రమంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటు ప్రతిపక్షం కాంగ్రెస్‌తోనూ, కొన్ని కీలక ప్రాంతీయ పార్టీల లీడర్లతోనూ ఆయనకు రిలేషన్స్ వున్నాయి. ప్రధాని మోడీ సైతం, ఆయనను రఘురామ కృష్ణంరాజు అని పేరుపెట్టి మరీ పిలుస్తారట. గతంలో బీజేపీలో పని చేసిన పరిచయాలో లేదంటే, అందరితోనూ కలివిడిగా వుండటమో కానీ, కేంద్రమంత్రులు సహా స్పీకర్‌ ఓంబిర్లా వరకు, రఘురామకు విస్తృతమైన పరిచయాలున్నాయి. అపాయింట్‌మెంట్లు అవసరం లేకుండానే, నేరుగా తలుపుతీసుకుని వెళ్లే చనువు తనకుందని, రఘురామే చాలాసార్లు చెప్పుకున్నారు. అదే విజయసాయికి అసహనం తెప్పించిందన్న మాటలు వినపడుతున్నాయి. రఘురామ దూకుడుగా, అసలు పార్టీనే లెక్క చేయకుండా అన్నట్టుగా, కేంద్ర పెద్దలను కలవడం, తాము మాత్రం అపాయింట్‌మెంట్ల కోసం వేచిచూసే పరిస్థితి వుండటం, విజయసాయి ఆగ్రహానికి కారణమైందన్న చర్చ జరుగుతోంది. పార్టీ లైన్‌‌ దాటి ప్రవర్తించొద్దని, ఏదైనా తనను అడిగి చెయ్యాలని విజయసాయి చాలాసార్లు రఘురామకు చెప్పారట. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ డోంట్‌ కేర్‌ అన్నారట. అయితే, ఒక పదవి, మరో విందు, విఎస్‌ఆర్‌ ఆగ్రహజ్వాలను పెట్రోల్ పోసి మండించిందట.

సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ చైర్మన్‌ పదవిని చాలా చాకచక్యంగా పొందగలిగారు రఘురామ. రాజు పేరును, విజయసాయి వ్యతిరేకించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయినా బీజేపీ పెద్దల ఆశీర్వాదంతో, సబార్డినేట్‌ లెజిస్లేటర్‌ కమిటీ అధ్యక్షుడు కాగలిగారు రాజు. వైసీపీ హైకమాండ్‌కు ఇష్టంలేకపోయినా, బీజేపీ పెద్దల జోక్యంతో, అయిష్టంగానే సిఫారసు లేఖ ఇవ్వాల్సి వచ్చిందన్న టాక్‌ వుంది. విజయసాయికి, రాజుకు, ఈ పదవి గ్యాప్‌ క్రియేట్ చేయగా, ఆ తర్వాత కొన్ని రోజులకు, రఘురామ ఇచ్చిన విందు, వైరాన్ని వెయ్యి రెట్లు పెంచిందట.

జనపథ్‌, లాన్స్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ కోర్టులో 2019 డిసెంబర్‌‌ రెండోవారంలో అదిరిపోయే విందిచ్చారు రఘురామ. ఈ విందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో అతిరథ మహారథులు అటెండయ్యారు. ఘుమఘుమలాడే గోదావరి వంటకాలు వడ్డించి, ఉత్తరాది వారితో వహ్వా ఏమి రుచి అనిపించుకున్న రాజు, ఈ డిన్నర్‌తో తన పరపతిని మరింత పెంచుకున్నారట. విందుకు వైసీపీ నుంచి చాలామంది ఎంపీలు హాజరయ్యారట, ఒక్క విజయసాయిరెడ్డి తప్ప.

విజయసాయి ఎందుకు రాలేదో అందరికీ తెలుసు. రారని కూడా తెలుసు. ఢిల్లీలో తన పలుకుబడిని పెంచుకునేందుకు, విందు రాజకీయాలు చేస్తున్నారని విజయసాయి రగిలిపోయారట. ఈ విందు తర్వాత, ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్‌లో వైరం పెరిగిపోయింది. షోకాజ్‌ నోటీస్‌కు రిప్లైలో, విజయసాయిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ, రాజు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అలా ఓ విందు ఇద్దరి మధ్య వివాదం రేపింది. ఇప్పుడు పార్టీలోనే యుద్ధానికి దారి తీసిందన్న చర్చ జరుగుతోంది.

విజయసాయి షోకాజ్‌పై చెలరేగిపోయిన రఘురామ, ఇప్పుడు వైసీపీ మూలాలనే ప్రశ్నించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వైఎస్‌ఆర్‌ కాం్గ్రెస్‌ అన్న పేరుపై ఏకంగా ఢిల్లీకెళ్లి ఎన్నికల కమిషన్‌ను కలిశారు. తన ప్రాణాలకు రక్షణలేదు, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌, కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌‌ రెడ్డిని సైతం కలిసి విన్నవించారని తెలుస్తోంది. రఘురామ యుద్ధం ఎందుకో, దేని కోసమో ఎవ్వరికీ అర్థంకాకపోయినా, ఢిల్లీలో పలుకుబడి రాజకీయం నేపథ్యంలోనే, విజయసాయితో గొడవ ముదిరిందని అర్థమవుతోంది. ఇద్దరి ఈగో వార్‌ చివరికి పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. సబార్డినేట్‌ పదవి, విందు రాజకీయం ఆర్‌ఆర్‌ఆర్‌-విఎస్‌ఆర్‌ నడుమ యుద్ధాన్ని రాజేసింది. పార్టీలో మంటలు రేపుతోంది. చూడాలి, రఘురామ సమరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి ఎండ్‌కార్డ్ పడుతుందో.



Show Full Article
Print Article
Next Story
More Stories