విశాఖ గ్యాస్‌ లీక్‌: ప్రాణాలను కాపాడిన పబ్‌జీ

విశాఖ గ్యాస్‌ లీక్‌: ప్రాణాలను కాపాడిన పబ్‌జీ
x
Highlights

పబ్‌జీ గేమ్.. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న డేంజర్‌ వీడియో గేమ్ ఇది. యువత మానసిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం చూపే ఈ గేమ్‌ ఎంతో మంది ప్రాణాలను కూడా...

పబ్‌జీ గేమ్.. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న డేంజర్‌ వీడియో గేమ్ ఇది. యువత మానసిక పరిస్థితులపై తీవ్రంగా ప్రభావం చూపే ఈ గేమ్‌ ఎంతో మంది ప్రాణాలను కూడా బలితీసుకుంది. విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో మాత్రం ఎంతోమంది ప్రాణాలను కాపాడింది పబ్‌జీ. ప్రాణాంతక పబ్ జీ గేమ్ ఎలా సేవ్ చేసింది..గ్యాస్ లీక్ కు ఈ గేమ్ కు లింకేంటి?

ఒకప్పుడు బ్లూవేల్ గేమ్ డేంజర్. ఇప్పడు పబ్ జీ గేమ్ ..అంతకంటే డబుల్ డేంజర్. కానీ ఈ పబ్ జీ గేమే కొందరి ప్రాణాల్ని కాపాడింది. ప్రపంచంలో అతి ప్రమాదకరంగా మారిన వీడియో గేముల్లో ఒకప్పుడు బ్లూవేల్‌, ఇప్పుడు పబ్‌జీ. ఈ రెండు ఆటల్లో లీనమైన ఎంతో మంది యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. మానసిక రుగ్మతల బారిన పడ్డారు. 2017లో ప్రారంభమైన పబ్‌జీ గేమ్‌ అంటే చాలు.. కుర్రకారు పడిచస్తారు. అలాంటి ఈ గేమ్‌ను నిషేధించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా ఇప్పటికీ మక్కువ చూపే వారి సంఖ్య ఎక్కువే.

ముఖ్యంగా దేశంలో పది నుంచి 25 ఏళ్ల వయసున్న యువకులు పబ్‌జీ గేమ్‌కు బానిసలుగా మారారు. మాదక ద్రవ్యాల కంటే ఎక్కువ ప్రభావం చూపే ఈ గేమ్‌తో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిద్ర, తిండి మానుకుని మరీ గేమ్‌ను ఆడే వాళ్లు కూడా ఉన్నారు. ఇలా ప్రాణాలకే ముప్పుగా మారిన పబ్‌జీ విశాఖ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఎంతోమంది ప్రాణాలను సేవ్‌ చేసింది.

పబ్‌జీ ఆడుతున్న ఆరుగురు కుర్రాళ్లు తెల్లవారుజామున రెండుగంటలు దాటింది ఆట జోరుమీద ఉంది. వాళ్లంతా పబ్ జీ లో యమ బిజీగా ఉన్నారు. ఇంతలో గుప్పుమన్న వాసన.గేమ్ లో ఉన్నోళ్లు ఒక్కసారిగా తేరుకుని ఇళ్లంతా చూశారు..పెయింట్ వాసనేమోనని డబ్బాల్ని చూశారు..కానీ ఇంతలో ఘాటెక్కువైంది. ఆందోళనతో ఇంట్లో ఉన్నవాళ్లని లేపారు..స్టైరీన్‌ వాసనను గుర్తించి ఊళ్లో వాళ్లందరినీ అప్రమత్తం చేశారు. ముప్పును గుర్తించటంతో చాలా వరకు ప్రాణాలను కాపాడగలిగారు.

అసలే అర్ధరాత్రి.. చుట్టూ చీకటి.. అయినా ఎవరూ లెక్కచేయలేదు. ఎటు వెళ్లాలో తెలియకపోయినా ప్రాణాలు కాపాడుకోవాలన్న ఒక్క ఆలోచనతో ఇళ్లు ఖాళీ చేశారు. చిన్నా పెద్దా ముసలీ ముతకా తేడా లేకుండా కిలోమీటర్ల కొద్దీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

విశాఖ గ్యాస్‌ లీక్‌ అయిన సమయంలో పబ్‌జీ ఆడుతున్న కిరణ్.. ఊళ్లో అందరి కంటే ముందుగా కెమికల్‌ వాసనను గుర్తించాడు. ఏదో ప్రమాదం జరగబోతుందని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు.

కిరణ్‌ ఫోన్‌ చేయటంతో అప్రమత్తమైన మిగిలిన కుర్రాళ్లు కంపెనీకి ఫోన్‌ చేశారు. స్టైరీన్‌ లీక్‌ అయిందని చెప్పటంతో తమ ఫ్యామిలీలతో పాటు చుట్టుపక్కల వాళ్లను అలర్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే వెంకటాపురం గ్రామస్తులు ఊరిని ఖాళీ చేశారు. ముప్పు పొంచి ఉందన్న వార్తతో కనీసం తాళాలు వేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. కొందరైతే తమ తల్లీ పిల్లలను కూడా పట్టించుకోకుండా పరుగులు తీశారు. అర్ధరాత్రిలో ఎటు వెళ్లాలో తెలియక పొలాల గట్ల గుండా ఐదు కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కాపాడుకున్నారు.

కిరణ‌్‌ అలర్ట్ చేయటంతోనే తమ గ్రామస్తులు సురక్షితంగా ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. యువకులు ప్రాణాలకు తెగించి అందరినీ కాపాడారని లేదంటే భారీ నష‌్టం చవిచూడాల్సి వచ్చేదంటున్నారు. తమ గ్రామాన్నంతా కాపాడగలిగిన కిరణ్, విషవాయువుని ఎక్కువగా పీల్చటంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం కేజీహెచ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. తమను కాపాడిన యువకులకు ధన్యవాదాలు చెబుతున్నారు వెంకటాపురం గ్రామస్తులు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories