Top
logo

Proposal for New Districts in AP: ఏపీలో 25 జిల్లాలు రానున్నాయా.. పార్లమెంటు నియోజకవర్గం జిల్లాగా మారుస్తూ నిర్ణయం?

Proposal for New Districts in AP: ఏపీలో 25 జిల్లాలు రానున్నాయా.. పార్లమెంటు నియోజకవర్గం జిల్లాగా మారుస్తూ నిర్ణయం?
X
Highlights

Proposal for New Districts in AP: ఆలూలేదు చూలు లేదు అప్పుడే కొడుకు పేర్ల కోసం పేచీలు మొదలయ్యాయి. ప్రభుత్వం...

Proposal for New Districts in AP: ఆలూలేదు చూలు లేదు అప్పుడే కొడుకు పేర్ల కోసం పేచీలు మొదలయ్యాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనపై కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒక పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చడం పట్ల సీమ వాసుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక స్వరూపాలే మారిపోతాయన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటైతే రాయలసీమ అస్తిత్వమే ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు సీమ ఉద్యమకారులు. జిల్లా కేంద్రం అందరికీ అందుబాటులో ఉండాలే గానీ పార్లమెంటు కేంద్రం జిల్లాకేంద్రమైతే దూరప్రాంతాల వారి పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీ అంతటా ఎలా ఉన్నా చిత్తూరు జిల్లా మదనపల్లెలో మాత్రం అప్పుడే పోరు మొదలైంది.

పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కేంద్రాలను పెంచేందుకు ఏపీ సర్కార్‌ సమాయత్తం అవుతోంది. ఈ మేరకు 13 జిల్లాలుగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని 25జిల్లాలకు పెంచాలని నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై కూడా అధ్యయనం చేస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. పాలనా సౌలభ్యం కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయమే ఇప్పుడు ప్రజల్లో గందరగోళానికి తెరతీస్తోంది. జిల్లా సరిహద్దుల వ్యవహారంలో కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండడంతో కొందరు దీని పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలు జిల్లా కేంద్రాలుగా ప్రకటించడం భావ్యం కాదని కొందరంటున్నారు. ప్రభుత్వం ఆలోచన మంచిదే అయినా విస్తృతమైన చర్చలు చేసి నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే అయినా మూడు ప్రాంతాలుగా ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మనుగడలో ఉంది. పార్లమెంటు నియోజకవర్గాలు జిల్లా కేంద్రాలైతే వీటికి ప్రాధాన్యత ఉండదంటున్నారు ప్రాంతీయ ఉద్యమకారులు. రాయలసీమల కలగూరగంపగా మారిపోతుందని సీమ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీమ వాసి ముఖ్యమంత్రిగా ఉన్నారని, సీమ అస్తిత్వాన్ని కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కూడా కోరుతున్నారు.

కొత్త జిల్లాల సమస్య తిరుమల శ్రీవారి ఆలయానికీ తప్పట్టుగా లేదు. ఇప్పటి వరకు తిరుమల కొండ రాయలసీమ వాసుల అండగా కొండంత ధైర్యంగా ఉన్న తిరుమల శ్రీవారి ఆలయం కూడా సీమ పరిధి దాటి నెల్లూరు బార్డర్‌కు చేరుతుంది. తిరుపతి జిల్లాలో సింహభాగం నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లదే ఉండడంతో దీని రూపమే మారుతుందంటున్నారు సీమవాసులు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది కొత్త జిల్లాల ప్రతిపాదన అయ్యవారిని, అమ్మవారిని ఒక్కో జిల్లాకు పంచుకోనుంది. రాయలసీమకు ఉన్న విశేషమైన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాల ఏర్పాటుకు ముందడుగు వేయలని కోరుతున్నారు.

అటు- సరిహద్దు అంశాలపై సమగ్రమైన అధ్యయనం జరగాలని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. పార్లమెంటు హెడ్‌క్వార్టర్‌ను జిల్లా కేంద్రంగా చేస్తే ప్రజల్లో అశాంతి నెలకొనే ప్రమాదం లేకపోలేదంటున్నారు. జిల్లా కేంద్రాలు ఆ జిల్లాకు మధ్యలో కాకపోయినా అటూ ఇటూ అందరికీ సమాన దూరం ఉంటే మంచిదన్నది ఎక్కువ మంది వాదన. ఇదిలా ఉంటే జిల్లా కేంద్రం తమ ఊరికే కావాలంటూ మదనపల్లెవాసులు ఉద్యమిస్తున్నారు. ఎప్పటి నుంచో మదనపల్లె జిల్లా కేంద్రం కావాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో తమ ఆశలు అడియాశలు చేయొద్దంటున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జిల్లాల ప్రతిపాదన ఇలా వచ్చి అలా రాగానే ఉద్యమాలు, అభిప్రాయాలు, నిరసనలు అప్పుడే వ్యక్తమవుతున్నాయి.

అటు-విజయనగరం జిల్లాలోని పార్వతీపురంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సుమారు 30ఏళ్లుగా పార్వతీపురం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఉధ్యమం సాగుతుండటంతో అది ఇప్పుడు మరింత బలపడింది. ప్రస్తుతం పార్లమెంటు స్థానమైన అరకు కేంద్రంగా కోత్త జిల్లా ఏర్పాటు కానుండటం పార్వతీపురం ప్రజలు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి. మరి పార్వతీపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఎంతవరకు అనువుగా ఉంటుంది.?

పార్వతీపురం విజయనగరం జిల్లాలోని అతి పెద్ద రెండో పట్టణం. ఇది ఏజెన్సీకి ముఖద్వారం. ఏజెన్సీతో పాటు ఒడిషా రాష్ట్రం రాయఘడ్‌కు కూడా ఇదే ప్రధాన మార్గం. వాణిజ్యపరంగా, విద్యాపరంగా ఈ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతాలకు అతి దగ్గర పట్టణం. దీంతో వందలాది మంది ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థులు, యువత, దినసరి కూలీలు, చిరు వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ పార్వతీపురం రావాల్సిందే. గిరిజనులు పండించే పంటలు అమ్మకునే దగ్గర నుంచి ఏజెన్సీలో గిరిజనులకు అవసరమైన నిత్యవసరాలు కొనుగోలు వరకు పార్వతీపురమే కేంద్రం. మరోవైపు రోజు ఆంద్రా నుంచి ఒడిషాకు రాకపోకలు సాగించే భారీ వాహనాల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ పార్వతీపురం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

చారిత్రకంగా పార్వతీపురం మున్సిపాలిటీకి ఎంతో చరిత్ర ఉంది. పురాతన మున్సిపాలిటీల ఇది ఒకటి. ప్రస్తుతం ఈ పట్టణంలో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కురుపాం, సాలూరు, నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గిరిజన గ్రామాలకు కూడా పార్వతీపరం అతి సమీప పట్టణంగా ఉంది. అంతేకాకుండా అరుకు పార్లమెంటులో శ్రీకాకుళం జిల్లాలోని పాలకోండ నియోజకవర్గం ఉండటంతో పాలకొండకు కూడా పార్వతీపురం అతి సమీపంలో ఉంది. దీంతో ఆ ప్రాంత వాసులకు రాకపోకలు సాగించేందుకు అనువుగాను ఉంటుందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాగా పార్వతీపురం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ముఖ్యంగా పార్వతీపురం బ్రిటీష్ కాలం నుంచీ కూడా రెవెన్యూ కేంద్రంగా ఉందని, ఇక్కడున్న జలవనరులు, జీవనదులు మరెక్కడా లేవని అంటున్నారు ప్రజలు. జిల్లా కేంద్రంగా పార్వతీపురాన్ని ఏర్పాటు చేస్తే అబివృద్ది తక్కువ సమయంలో సాధ్యమవుతుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

అరకు పార్లమెంటు స్థానానికి అరకు పట్టణాన్నే జిల్లా కేంద్రంగా చేయాలనుకుంటే ఈ ప్రాంతాల్లోని లక్షల మంది గిరిజనులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఏ చిన్న సమస్య వచ్చిన వినతులు ఇచ్చేందుకు అరకు వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం పార్వతీపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా ప్రజలందరికీ అనుగుణంగా ఉండేలా విజయనగరంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఏపీలో జిల్లాల విభజన చేసే ప్రక్రియ వేగవంతం అయింది. అయితే కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలు ఏవిధంగా ఏర్పాటవుతాయోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న తూర్పుగోదావరి మూడు జిల్లాలు మారితే. స్వరూపం ఎలా వుంటుందోనన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలోనే అత్యధిక జనాభా, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కేంద్రాలుగా మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలలో ఏజన్సీ ప్రాంతమైన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ జిల్లాలో అరకు కేంద్రంగా వున్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వుంది. దీనికి తోడు విలీన మండలాలు కూడా రంపచోడవరం పరిధిలోనే వుండటంతో ఏజన్సీ నియోజకవర్గం మొత్తం అరకు పార్లమెంటు పరిధిలోకి వెళుతుంది. దీంతో అరకు ఒక ఏజన్సీ జిల్లాగా ఏర్పడే అవకాశాలున్నాయి. తూర్పు గోదావరి నుంచి ఒక అసెంబ్లీ రంపచోడవరం అలా వెళ్లిపోతే ఇక 18 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఇందులో కాకినాడ పార్లమెంటులో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని కేంద్రాలుగా ఏడు అసెంబ్లీ స్థానాలు వున్నాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా వున్న కాకినాడ ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానుంది. రెండోది అమలాపురం పార్లమెంటుకి వస్తే కోనసీమ ప్రాంతంలోని అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, పి.గ్నవరం కేంద్రాలుగా వున్న ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి. దీనిలో మరో రెండో గోదావరికి అవతల వున్న రామచంద్రపురం, మండపేట కేంద్రాలుగా వున్న అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి కోనసీమ జిల్లాగా ఏర్పడొచ్చు. అయితే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలని, మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపాలని అక్కడ ప్రజాప్రతినిధుల డిమాండ్.

ఇటు- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలోనూ, గోదావరి ఆదరిన వున్న కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వున్నాయి. దీంతో రాజమండ్రి జిల్లా కేంద్రంగా గోదావరి జిల్లా ఏర్పడితే అందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు చేరతాయి. దీనికి గోదావరి జిల్లా నామకరణం చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద వుంది. గోదావరికి రెండు వైపులా గోదావరి జిల్లా ఏర్పాటైతే అభివృద్దిపరంగా మంచి దిక్సూచిగా నిలబడుతుందని భావిస్తున్నారు. గతంలో ఉభయగోదావరి జిల్లాలలో కొంతప్రాంతం కలిపి రాజమండ్రి కేంద్రంగానే జిల్లా వుండేది. అప్పట్లో భద్రాచలం కూడా ఏపీలోనే వుండేది. ఆ తర్వాత జిల్లాల విభజనలో కాకినాడకు జిల్లా కేంద్రం మారింది.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా రూపాంతరం చెందనుంది. అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే ఐదు నుంచి ఆరు అసెంబ్లీ స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలోనే పెరగనున్నాయి. అదే సమయంలో ప్రతి 20 ఏళ్లకు జరిగే పార్లమెంటు నియోజకవర్గాలు పునర్విభజన జరిగితే జిల్లాలో మరో పార్లమెంటు పెరగనుంది. అప్పుడు మళ్లీ కొత్తగా ఒక జిల్లా ఏర్పాటయ్యే పరిస్థితులు వుంటాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గత స్థానిక సంస్థల రిజర్వేషన్లు మొత్తం మారిపోతాయి. ముఖ్యంగా జడ్పీ ఛైర్మన్ల పదవుల విషయంలో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. దీంతో జిల్లాల ఏర్పాటయ్యాక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలా లేదంటే పాత పద్దతి ప్రకారం నిర్వహించిన తర్వాత జడ్పీ ఛైర్మన్ల ప్రక్రియ గురించి ఆలోచించాలా అనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది.Web TitleProposal for New Districts in AP: Andhra Pradesh government's proposal to make Parliamentary constituencies as New districts
Next Story