భర్తతో గొడవపడి 65 కి.మీ. నడిచిన నిండు గర్భిణి.. రెండు రోజులు రాత్రిపగలు నడక..!

Pregnant Women: భర్త చీటికిమాటికి గొడవపడుతుండటంతో మనస్తాపం

Rama Rao
Updated on: 15 May 2022 3:50 PM IST
Pregnant Woman Walks 65 km in Andhra Pradesh | Telugu News
X

భర్తతో గొడవపడి 65 కి.మీ. నడిచిన నిండు గర్భిణి

Pregnant Women: భర్తతో గొడవపడిన గర్భిణి కోపంతో రెండు రోజులపాటు రాత్రనక, పగలనక 65 కిలోమీటర్లు నడించింది. చివరికి రోడ్డున వెళ్లే ఓ వ్యక్తి ఆమె అవస్థను గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అందులోనే ఆమెకు డెలివరీ అయింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిందీ ఘటన. మహిళది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ నగర్. కూలిపనుల కోసం భర్తతో తిరుపతి వచ్చింది. చీటికిమాటికి భర్త గొడవ పడుతుండడంతో విసుగు చెందిన ఆమె చేతిలో రూపాయి లేకున్నా తిరుపతి నుంచి కాలినడకన బయలుదేరింది.

రెండు రోజులపాటు పగలురాత్రి నడుస్తూ నాయుడుపేట చేరుకుంది. మొత్తంగా 65 కిలోమీటర్లు నడిచిన ఆమె శుక్రవారం అర్ధరాత్రి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాలేదామెకు. మరోవైపు, నిండు గర్భిణి కావడంతో పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలను ఆపినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఓ యువకుడు స్పందించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే 108కి ఫోన్ చేసి సమచారం అందించాడు. వారు సకాలంలో అక్కడికి చేరుకుని ఆమెను అంబులెన్స్‌లోకి చేర్చారు.

రెండు రోజులపాటు తిండీతిప్పలు లేకపోవడంతో ఆమె బాగా నీరసపడిపోయింది. తమ ఇళ్ల నుంచి దుస్తులు తెప్పించి తల్లీబిడ్డకు ఇచ్చారు అక్కడున్నవారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ తన భర్త పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు నిరాకరించడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story