పట్టుకోసం భూమా, శిల్పా వారసులు అమీతుమి

పట్టుకోసం భూమా, శిల్పా వారసులు అమీతుమి
x
Highlights

కర్నూలు జిల్లా నంద్యాల గడ్డపై భూమా, శిల్పా కుటుంబాల మద్య పొలిటికల్ వార్ మళ్లీ మొదలైంది. భూమా, శిల్పా కుటుంబాల మధ్య రాజకీయ వైరం మళ్లీ భగ్గుమంటోంది....

కర్నూలు జిల్లా నంద్యాల గడ్డపై భూమా, శిల్పా కుటుంబాల మద్య పొలిటికల్ వార్ మళ్లీ మొదలైంది. భూమా, శిల్పా కుటుంబాల మధ్య రాజకీయ వైరం మళ్లీ భగ్గుమంటోంది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మళ్లీ విచ్చు కత్తులను పదును పెట్టుకుంటున్నాయి. నేతల నోట మాటల తూటాలు పేలుతున్నాయి. సై అంటే సై అంటూ కళ్లతోనే కత్తులు దూసే ప్రయత్నం చేస్తున్నారు. కాలగర్భంలో కలిసిపోయిన ఫ్యాక్షన్ చరిత్రను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతుందా అని జిల్లా వాసులు ఉలిక్కి పడుతున్నారు.

కర్నూలు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ పగలతో రగిలిన జిల్లా ప్రధానంగా నంద్యాల లోక్ సభ నియోజవర్గంలో రాజకీయ ప్రాధాన్యత. ఆధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్ చాలా కాలం కొనసాగింది. కొంత కాలంగా పగలు, కక్షలకు దూరం పెట్టి ప్రశాంతంగా ఉంటూ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మొదటికి వచ్చింది. ప్రస్తుతం రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రగిలిన సెగ పొలిటికల్ హీట్ పెంచింది. భూమా, శిల్పా వారసులు పట్టుకోసం అమీతుమికి దిగుతున్నారు.

శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత వారి వారసులుగా భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి రంగంలోకి దిగారు. అటు శిల్పా వారసుడుగా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.

2019 ఎన్నికల సందర్భంలో జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలంతా ఫ్యాక్షన్ పగలు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ పరాజయం పాలు కావడం వైసీపీ అధికారం చేపట్టడం జరిగింది. భూమా కుటుంబానికి పెట్టని కోటగా నిలిచిన ఆళ్లగడ్డతో పాటు మంచి పట్టు ఉన్ననంద్యాల వైసీపీ చేతిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ రాజకీయ వర్గపోరు పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో కొనసాగుతూ వస్తుంది.

ఓ వైపు రాజకీయ ప్రతీకారాలు మరో వైపు పట్టుకోసం పాకులాటలు అంతకంతకు పెరిగాయి. నంద్యాలలోని పొన్నాపురం మున్సిపల్ ఎన్నికలు ఈ రాజకీయ పోరును మరింత పెంచాయి. ఇటీవల వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. హత్యా ఘటనలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న మనోహర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నంద్యాల వాతావరణం మరో సారి అగ్నిగుండంగా మారింది. టీడీపీ నేతలే హత్య చేయించారంటూ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆరోపించారు. సుబ్బారాయుడు హత్య వెనుక భూమా ఫ్యామిలి ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ఆరోపణలకు భూమా అఖిలప్రియ అంతే ఘాటుగా సమాధానం ఇచ్చారు. సుబ్బారాయుడు హత్యతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని ఓ వైపు ఆసక్తికర చర్చ జరుగుతుండగా, సవాళ్లు, ప్రతి సవాళ్లతో మళ్లీ ఆనాటి పగలు రగులుతాయా అనే భయం ప్రజల్లో మొదలయ్యింది.


Show Full Article
Print Article
Next Story
More Stories