ముద్రగడతో వర్మ భేటీపై రాజకీయ ప్రకంపనలు.. వైసీపీలో చేరుతున్నట్టు వర్మ సంకేతాలు ఇవ్వదల్చుకున్నారా..?

ముద్రగడతో వర్మ భేటీపై రాజకీయ ప్రకంపనలు.. వైసీపీలో చేరుతున్నట్టు వర్మ సంకేతాలు ఇవ్వదల్చుకున్నారా..?
x
Highlights

Pithapuram Politics: అధికార తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ.. ప్రతిపక్ష వైసీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

Pithapuram Politics: అధికార తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ.. ప్రతిపక్ష వైసీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముద్రగడ మీద వర్మకు అభిమానం ఎందుకు పుట్టుకు వచ్చిందంటూ అటు తెలుగుదేశం, ఇటు జనసేన శ్రేణులలో పలు సందేహాలు చెక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీల పేరు ఎత్తగానే ఒంటి కాలుమీద లేసి విమర్శలు గుప్పించే ముద్రగడ పద్మనాభం మొన్నజరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని శపథం చేశారు. ఓడించకపోతే తన పేరు చివర రెడ్డి జత చేసుకుంటానని చెప్పి, అన్నంత పనిచేశారు ముద్రగడ పద్మనాభం. అలా పవన్‌ను ఓడించలేకపోయి.. పేరు మార్చుకున్న పద్మనాభంను వర్మ పరామర్శించడానికి వెళ్లడం వెనుక అసలు మర్మం ఏంటనే సందేహాలు వెల్లువెత్తతున్నాయి. ఈ విధంగా నేను అసంతృప్తితో ఉన్నాను.. త్వరలో నా అడుగులు వైసీపీ వైపు పడతాయని టీడీపీ అధిష్టానానికి.. ఇటు కూటమి నాయకులకు వర్మ ముందస్తు సంకేతాలేమైనా ఇస్తున్నారా..? అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి.

ఇక వర్మ విషయానికొస్తే 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి TDPలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019 నుంచి పిఠాపురంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టిన వర్మ.. అనూహ్యంగా కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తాననడంతో తన సీటును వదులుకున్నారు. ఆ సమయంలో వర్మ కొద్దిగా బెట్టు చేసినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీకి కట్టుబడి పవన్ కల్యాణ్‌కే ఎన్నికల్లో మద్దతు తెలియజేసి, కూటమి విజయానికి తన వంతే సహాయం చేశారు.

కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత దక్కుతుందని వర్మ ఊహించినప్పటికీ.. ఆ ఊసు ఎక్కడ కనిపించడం లేదన్న భావన వర్మలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా వర్మకు ఎటువంటి పదవి దక్కకపోవడం పిఠాపురంలో స్థానిక రాజకీయాల్లో జనసేన నాయకులతో విభేదాలు కారణంగా అధికారిక కార్యక్రమాల్లో వర్మకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం టీడీపీ అధిష్టానానికి పదేపదే పలు విషయాలపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదట. ఈ కారణాలతో వర్మ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు ఆయన అనుచరుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడకు తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నా వారెవరూ ఆయనను పరామర్శించడానికి వెళ్లలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా వర్మ మాత్రం పరామర్శించడానికి వెళ్లడం హాట్ టాపిక్‌ అయ్యింది. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితోపాటు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటపెట్టుకుని ముద్రగడ దగ్గరకు వెళ్లడం చూస్తుంటే అటు వైసీపీ అధిష్టానానికి, ఇటు కుటమి నాయకులకూ మింగుడు పడటం లేదట. అయితే తానేంటో..? తన బలమేంటో తెలుసా..? అని పరోక్షంగా టీడీపీ అధిష్టానానికి ఆయన తెలిసేటట్టు చేశారా..? అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి

మరోవైపు వర్మ లాంటి ప్యూర్ పొలిటిషియన్‌ను ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉంచడం తెలుగుదేశం పార్టీకే కాకుండా కూటమి ప్రభుత్వానికీ ఇబ్బంది కలిగించే అంశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి రాజకీయ చాణిక్యులు ఖాళీగా ఉంటే అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వచ్చు.. లేక మైనస్ కూడా అవ్వచ్చునన్న భావన వ్యక్తమవుతోంది. లేకపోతే చివరకు కూటమి ఐక్యతకే భంగం కలగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ముద్రగడతో భేటీ అయిన వర్మ.. ఏ సంకేతాలు ఇస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ చూసిచూడనట్టు వ్యవహరిస్తుందా..? లేక టీ కప్పులో తుఫానులా మారుతుందా..? కాలమే నిర్ణయిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories