Top
logo

జేసీ మాటలకు అర్థాలే వేరా.. ఆయన మాటల వెనక రెండంచుల వ్యూహముందా?

జేసీ మాటలకు అర్థాలే వేరా.. ఆయన మాటల వెనక రెండంచుల వ్యూహముందా?
Highlights

ఆయన మాటలకు అర్థాలే వేరు. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే అన్న అర్థాలు వచ్చేలా ఈమధ్య మాట్లాడేస్తున్నారాయన. మొన్నటి...

ఆయన మాటలకు అర్థాలే వేరు. ఔనంటే కాదనిలే కాదంటే ఔననిలే అన్న అర్థాలు వచ్చేలా ఈమధ్య మాట్లాడేస్తున్నారాయన. మొన్నటి వరకు వైఎస్ జగన్‌ పాలనపై ఇంతెత్తున లేచారు. వెంటనే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ చురకలు వేశారు. అగ్గిరాజేసే అస్త్రాలు సంధిస్తూనే, నీళ్ల బాణమూ ఆ‍యన ఎందుకు వదులుతున్నారన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. అయితే, ఆయన మాటలకు అర్థాలు పక్కనపెడితే, వ్యూహాలూ వేరంటున్నారు రాజకీయ పండితులు. ఇంతకీ ఆ మాట మాంత్రికుడు ఎవరు ఆయన మాటల వెనక స్ట్రాటజీ ఏంటి?

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. ఎప్పుడు మాట్లాడినా సెన్సేషనే అవుతోంది. తిట్టడంలో, పొగడటంలో ఆయన స్టైలే డిఫరెంట్. ఉన్నదున్నట్టు, కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడతారన్న పేరు తెచ్చుకున్న జేసీ, ఈసారి కాస్త భిన్నంగా రియాక్టయ్యి, ఇటు టీడీపీ, అటు వైసీపీ శ్రేణులను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తిరుగులేదు, జగన్‌కు జనం అసలు అవకాశమే ఇవ్వరన్నట్టుగా మాట్లాడారు జేసీ దివాకర్‌ రెడ్డి. కానీ ఈసారి ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. తన కొడుకు పవన్‌ కుమార్‌ రెడ్డిని తొలిసారి రాజకీయాల్లో దింపి, ఎంపీగా నిలబెట్టినా గెలిపించుకోలేకపోయారు. జేసీ కుటుంబానికి పెట్టని కోటలాంటి తాడిపత్రిలోనూ ఓడిపోయారు. తన తమ్ముడు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు అస్మిత్‌ రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపినా పరాజయం తప్పలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్‌గా వున్న జేసీ, తర్వాతర్వాత విమర్శల వాడి పెంచారు. జగన్‌ పాలనపై నిత్యం ఏవో ఒక కామెంట్లు చేస్తూనే వున్నారు. పొగిడినట్టే పొగిడి విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ధోరణిలోనే కామెంట్లు చేసి, వార్తల్లోకి ఎక్కారు.

మొన్నటి వరకు జగన్‌ పాలనపై ఇంతెత్తున లేచిన జేసీ దివాకర్‌ రెడ్డి, తాజాగా కాసిన్ని విమర్శలతో పాటు కూసిన్ని ప్రశంసలూ కురిపించారు. అసెంబ్లీ ఆవరణలో విలేఖరులతో చిట్‌చాట్‌గా మాట్లాడిన జేసీ, వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన చేయాలనుకున్న పనిని ధైర్యంగా చేస్తారని ఆరోగ్యశ్రీపై జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అన్నారు. చంద్రబాబు ధైర్యమున్న నాయకుడు కాదన్నారు జేసీ. జగన్ కనిపిస్తే అభినందిస్తానని ఈ విషయంపై చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదని అనేశారు జేసీ. అంతేకాదు, ఆరు నెలల జగన్‌ పాలనపై టీడీపీ విమర్శలు చేస్తుంటే, అదే పార్టీలో వున్న జేసీ మాత్రం ఆరు నెలల పాలన బావుందని వ్యాఖ్యానించడం టీడీపీలో కలకలం రేపుతోంది.

పొగిడినట్టే పొగిడి, తనదైన శైలిలో కాసిన్ని చురకలు కూడా వేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యంలో కక్షరాజ్యం అని పేరు పెట్టాలన్నారు. జగన్ హయాంలో ఆయన తాత రాజారెడ్డి పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. జగన్ నామినేటేడ్ పోస్టుల్లో రెడ్లకు ఎక్కువ ఇచ్చారని అందుకు అభినందిస్తున్నానన్న జేసీ, చంద్రబాబు హయాంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, కామెంట్స్‌ను బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జగన్ బాగా మాట్లాడారని కితాబిచ్చారు. టీడీపీని నొప్పించకుండా కామెంట్లు చేస్తూనే, అటు జగన్‌ను ప్రస్ననం చేసుకునేందుకే అన్నట్టుగా ప్రశంశలు కురిపించారు జేసీ.

గతంలోనూ ఒకసారి జగన్‌ పాలనపై ప్రశంసించారు జేసీ. నూటికి నూరు మార్కులు వేస్తానన్నారు. తర్వాత జగన్‌ను మళ్లీ టార్గెట్ చేశారు. అంతేకాదు జేసీ ఎప్పుడూ జగన్ 'మావాడే, మావాడే' అంటూ కలుపుకునే ప్రయత్నమూ చేస్తుంటారు. అయితే, ఈమధ్య తమ కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులను సీజ్‌ చేయడంపై ఇంతెత్తున అరిచారు జేసీ దివాకర్ రెడ్డి. తనపై జగన్‌ కక్ష సాధింపులకు దిగుతున్నారని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనను వైఎస్సార్‌సీపీలో చేరమని ఒత్తిడి పెరుగుతోందని తాను మాత్రం చేరనని తేల్చి చెప్పానని అన్నారు. ఇఫ్పుడు మళ్లీ ఉన్నట్టుండి జగన్‌పై కొన్ని విమర్శలు, మరికొన్ని ప్రశంసలు కురిపించడం వెనక కథేంటన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

జేసీ దివాకర్‌ రెడ్డి, రెండంచెల వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు పొగడ్తలు, అప్పుడప్పడు తెగడ్తలు చేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పటికే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన జేసీ, తన కుమారుడు, తన తమ్ముడి కుమారుడి రాజకీయ భవితవ్యంపైనే దృష్టిపెట్టారు. తమ కుటుంబానికి ఎదురులేదు, జనం బ్రహ్మరథం పడతారన్న కాన్ఫిడెన్స్‌తో పావులు కదిపిన జేసీ బ్రదర్స్, తమ కుమారులు తొలి ఆరంగేట్రంలోనే ఓడిపోవడంతో కంగుతిన్నారు. టీడీపీలో నాయకత్వ సంక్షోభం తప్పదన్న ఆందోళనతో, వారిద్దర్నీ ఎలా సెట్‌ చేయాలన్నదానిపై తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఒకానొక సమయంలో బీజేపీలోకి వెళ్తారన్న ఊహాగానాలూ వెల్లువెత్తాయి. అయితే, సీమలో బీజేపీకి అంత స్కోపులేదని ఆగిపోతున్నారు జేసీ. అందుకే వైసీపీ మీద అప్పుడప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, తమ కుమారులు పవన్, అస్మిత్‌‌లు జగన్‌కు దగ్గరయ్యేలా ప్రయత్నిస్తున్నారని స్థానిక నేతలంటున్నారు. మొత్తానికి అటు జగన్‌పై తెగడ్తలతో చంద్రబాబును మెప్పించే ప్రయత్నం చేసిన జేసీ, ఇటు పొగడ్తలతో జగన్‌కు ఫీలర్లు వదిలారు. ఎందుకైనా మంచిదని రెండు అస్త్రాలు ప్రయోగిస్తున్న జేసీ వ్యాఖ్యలతో టీడీపీ క్యాడర్‌ మాత్రం కన్‌ఫ్యూజ్‌ అవుతోందట.


Web TitlePolitical strategies behind JC Diwakar reddy words

లైవ్ టీవి


Share it
Top