ఇక నుంచి ఏపీ రాజకీయరణం కొత్త మలుపు తిరగబోతోందా?

ఇక నుంచి ఏపీ రాజకీయరణం కొత్త మలుపు తిరగబోతోందా?
x
Highlights

సీబీఐ విచారణకు సిఫారసులు, ఏసీబీ అరెస్టులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాన్ని రణరంగ వేదికగా మార్చేసిన పరిణామాలు. ఏపీలో అసలేం...

సీబీఐ విచారణకు సిఫారసులు, ఏసీబీ అరెస్టులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాన్ని రణరంగ వేదికగా మార్చేసిన పరిణామాలు. ఏపీలో అసలేం జరుగుతోంది? అచ్చెన్నాయుడు అరెస్టు పొలిటికల్‌ వార్‌గా ఎందుకు మారుతోంది? ఈఎస్‌ఐ స్కాంలో అసలేం జరిగింది? మున్ముందు మరిన్ని అరెస్టులు తప్పవన్న సంకేతాల సారమేంటి? ప్రస్తుత పరిణామాల వెనక అంతుచిక్కని కథలేంటి? తాజా ఘటనలను అధికార, విపక్షాలు జనంలోకి ఎలా తీసుకెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నాయి?

మొన్నటి వరకు మాటల యుద్ధంతో రగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఇప్పుడు సీబీఐ విచారణలు, ఏసీబీ అరెస్టులతో ఒక్కసారిగా అగ్నిర్వతం బద్దలైనట్టయ్యింది. చంద్రబాబు హయాంలో కీలక పథకాలైన ఫైబర్ గ్రిడ్, రంజాన్ తోఫా, చంద్రన్నకానుక, క్రిస్మస్ కానుక పథకాల్లో అవినీతి జరిగిందంటూ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించడం, వీటిపై సీబీఐ విచారణకు మంత్రివర్గం సిఫారసు చేస్తూ తీర్మానం చెయ్యడంతో ఫస్ట్‌ డే అగ్గిరాజుకుంది. నెక్ట్స్‌ డే ఏసీబీ ఎంటరైంది. తెల్లవారు జామునే కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును, ఈఎస్‌‌ఐ స్కాం ఆరోపణలపై అరెస్టు చేసింది. ఈ రెండు పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది.

వెంటనే తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగడం, ఆందోళనలు చెయ్యడం, కక్షపూరితమంటూ విమర్శనాస్త్రాలు సంధించడం చకచకా జరిగిపోయాయి. అచ్చెన్నాయుడు అరెస్టు అక్రమం అన్న టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాను కిడ్నాప్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, వైసీపీ పాలనపై ధాటిగా విమర్శలు చేస్తున్నందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారంటూ తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఖండించారు. ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి జరిగింది కాబట్టే, ఏసీబీ అరెస్టు చేసిందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు.

విచారణలు, అరెస్టుపై అధికార, విపక్షాల వాదనేంటో అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇక వాడివేడి రాజకీయం మొదలు కాబోతోందన్న సంకేతమూ బోధపడింది. సీబీఐ విచారణ, ఏసీబీ అరెస్టుల పర్వాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై అధికార, విపక్షాలు వ్యూహాలు కూడా సిద్దం చేశాయి. మొదట విపక్షం స్ట్రాటజీలను అంచనా వేద్దాం.

సెంటిమెంట్‌ను రగిలించేందుకు టీడీపీ ఆయుధంగా ప్రయోగిస్తుందా?

తెలుగుదేశం ఇప్పటికే ఈ నినాదం ఎత్తుకుంది. విపక్షాలను కక్షపూరితంగా అణచివేసేందుకే జగన్ సర్కారు, ఇలాంటి అరెస్టులు చేస్తోందని ఆరోపిస్తోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అరెస్టుతో పార్టీ శ్రేణులు కుంగిపోకుండా, మరింత కసితో పోరాటం చేసేందుకు, ఈ పరిణామాలను ఉపయోగించుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఓటమితో కుంగిపోయిన పార్టీని సెంటిమెంట్‌తో పరుగులు పెట్టించాలని ఆలోచిస్తోంది.

బీసీ అస్త్రం సంధించాలనుకుంటోందా?

చంద్రబాబు ఇప్పటికే ట్వీట్‌ ద్వారా బీసీ అస్త్రాన్ని వదిలారు. బీసీలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నందుకే అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. బీసీలందరూ ఏకమై, తిరగబడాలని పిలుపునిచ్చారు. బీసీలు దూరమయినందుకే, ఎన్నికల్లో ఘోర ఫలితాలు వచ్చాయని భావిస్తున్న చంద్రబాబు, వారిని తిరిగి తమవైపు తిప్పుకోవడానికి బీసీ నేత అచ్చెన్నా అరెస్టు పర్వాన్ని వినియోగించుకునేందుకు ఆలోచిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

అసెంబ్లీలో అచ్చెన్నను ఎదుర్కోలేక అరెస్టని వాదించబోతోందా?

మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. అసెంబ్లీలో చంద్రబాబు కంటే కూడా, సహజంగానే అచ్చెన్నాయుడే లీడ్ తీసుకుంటారు. జగన్‌ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో విమర్శలు కురిపిస్తారు. అందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్న వాదనను, జనంలోకి తీసుకెళ్లాలనుకుంటోంది తెలుగుదేశం. శాసన సభ సెషన్‌లో అచ్చెన్నా వాయిస్ వినిపించకుండా చేసేందుకే, అరెస్టు చేశారంటోంది టీడీపీ.

అరెస్టులు, విచారణ ఆపేందుకు కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు?

సీబీఐ విచారణ, ఏసీబీ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తామంటోంది తెలుగుదేశం. గతంలోనూ విచారణలపై మధ్యంతర స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు, తాజా పరిణామాల నేపథ్యంలోనూ కోర్టు తలుపు తట్టేందుకు న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. తాజా ఘటనలపై తెలుగుదేశం వ్యూహాలు ఇలా వుండొచ్చన్నది రాజకీయ పరిశీలకుల మాట. మరి అధికార పక్షం, టీడీపీ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనుకుంటోంది...ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటోంది.

నాడు జగన్‌ అరెస్టును సమర్థించారు నేడెందుకు అచ్చెన్న అరెస్టును వ్యతిరేకిస్తున్నారు

ఇలాంటి అస్త్రాలనే బలంగా విసురుతోంది వైసీపీ. కేవలం రాజకీయ ఆరోపణలతో నాడు జగన్‌ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు సమర్థించిన తెలుగుదేశం, ఇప్పుడు ఈఎస్‌ఐ స్కాం స్పష్టంగా బయటపడినా, ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తోందని అధికారపక్ష నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. చట్టంపై నాడున్న గౌరవం, నేడెందుకు లేదని టీడీపీని ప్రశ్నిస్తోంది వైసీపీ.

వాస్తవానికి ఎప్పుడో ఈ కేసు అచ్చెన్నాయుడుకు చుట్టుకుంది. విజిలెన్స్ రిపోర్టులు పర్‌ఫెక్టుగా వున్నాయి. కానీ సంవత్సర కాలంగా అరెస్టుల జోలికి పోలేదు వైసీపీ ప్రభుత్వం. ''జగన్‌కు దమ్ములేదు, ఒక్క కేేసూ నిరూపించలేడు, అంత ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించండి వంటి వ్యాఖ్యలు కూడా టీడీపీ వైపు నుంచి దూసుకొచ్చాయి. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా ఆదే చేసింది. సీబీఐ విచారణకు ఆదేశించింది. అచ్చెన్నాయుడిని, ఏసీబీ అరెస్టు చేసింది. మరి టీడీపీ కోరుకుంటున్నట్టు విచారణకు ఆదేశిస్తే, ఇప్పుడెందుకు రాద్దాంతం చేస్తున్నారని రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీబీఐ విచారణలు, ఏసీబీ అరెస్టులతో హీటెక్కింది. ఇక నుంచి మరింత రసవత్తరంగా ఉండబోతోందని పొలిటికల్ క్లైమెంట్ సంకేతాలిస్తోంది. కక్షపూరితమంటూ విపక్షం, చట్టం ప్రకారమేనంటూ అధికారపక్షం పరస్పర విమర్శలు ప్రతివిమర్శలు మున్ముందు మరింత పదును తేలబోతున్నాయని అర్థమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories