తొలి అడుగు మాత్రమే.. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పవన్

తొలి అడుగు మాత్రమే.. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పవన్
x
Highlights

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఈ...

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ఇది తొలి అడుగు మాత్రమే అని రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కారాదని పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గు తేల్చాలని పవన్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

అంతర్వేది సంఘటనలో సీబీఐ దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం అంటే పరిష్కారం అయినట్టు కాదు, నిందితుల్ని పట్టుకోవటానికి వేసిన తొలి అడుగు మాత్రమే... ముఖ్యమంత్రి 'శ్రీ జగన్ రెడ్డి' గారి నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోంది. అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సిబిఐ పరిమితం కారాదు. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సిబిఐ నిగ్గు తేల్చాలి. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయి. కాబట్టి పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సిబిఐ పరిధిలోకి తీసుకువెళ్ళండి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయి. ఈ ఆలయమే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు ఆన్యులపరమైపోయాయి. వీటి గురించీ సిబిఐ ఆరా తీసి ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. వీటితో పాటు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సిబిఐ ఆరా తీయాలి.

ఆ పింక్ డైమండ్ ఏమైపోయినదనే అంశంపై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారు. ఆ వజ్రం ఎటుపోయిందో ఆరా తీయాలి. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలి. భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ విషయంలో ప్రభుత్వం ఆమోదకర చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటి 'ఛలో అంతర్వేది' కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాము. అయితే ధర్మ సంస్థాపనార్ధం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది. దర్యాప్తు అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే , మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Show Full Article
Print Article
Next Story
More Stories