Pawan Kalyan: అధినేత పర్యటన బూస్టునివ్వబోతోందా?

Pawan Kalyan Visit to Vizag Over Steel Privatisation
x

Pawan Kalyan: అధినేత పర్యటన బూస్టునివ్వబోతోందా?

Highlights

Pawan Kalyan: సింహం సింగిల్‌గానే వెళ్తుందంటూ ఊదరగొడుతున్న జనసైనికులు తమ అధినేత పొలిటికల్ జర్నీని ఆసక్తిగా గమనిస్తున్నారా?

Pawan Kalyan: సింహం సింగిల్‌గానే వెళ్తుందంటూ ఊదరగొడుతున్న జనసైనికులు తమ అధినేత పొలిటికల్ జర్నీని ఆసక్తిగా గమనిస్తున్నారా? 2014 నుంచి జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఎదురైన పరాభవంతో పాఠాలు నేర్చుకోబోతున్నారా? ఓసారి పోటీకి దూరంగా ఉంటే మరోసారి జనం దూరం పెట్టారన్న ఆవేదనతో ఉన్న సేనాని రూటు మార్చి ఫేటు మార్చుకోబోతున్నారా? అవసరమైనపుడు వ్యూహం మారుస్తానన్న అధినేత కొత్త వ్యూహం ఏంటి? విశాఖలో ఉక్కు ఉద్యమంలో తన సత్తా చాటేందుకు వేసే ఆయన అడుగు బలమెంత? పవన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానుల మాటేంటి?

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు అయింది. సేనాని పర్యటనతో ఉత్తరాంధ్ర సైనికుల్లో నూతనోత్సహం రానుందన్న టాక్‌ వినిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిరుత్సాహంతో నీరుగారిపోయిన తన సైన్యానికి పవన్‌ టూర్‌ బూస్టునిచ్చిందట. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి సమీక్షలు నిర్వహిస్తున్న సేనాని స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలపడంతో రాజకీయ సమీకరణాలు మారుతాయన్న చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల తర్వాత నుంచి జనసేనాని ఉత్తరాంధ్ర పర్యటనకు పవన్ సరిగ్గా రాకపోవడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. అలా సైలెంట్‌గా ఉన్న సైనికుల్లో పవన్‌ టూర్‌ న్యూస్‌ ఒక్కసారిగా పవర్‌ పెంచిందట. ఈనెలాఖరు నుంచి మూడు రోజులు పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్టు తెలియడంతో ఉత్తరాంధ్రలో పార్టీకి పూర్వ వైభవం రాబోతోందని జనసైనికులు సంబరపడిపోతున్నారట. మాములుగానైతే ఏ కార్యక్రమమైనా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే ఆనవాయితీ ఉన్న పవన్‌కల్యాణ్‌ మొన్నటి ఎన్నికలలో గాజువాక నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఉత్తరాంధ్రకు, అందులో మరీ ముఖ్యంగా విశాఖకు దూరం దూరంగానే ఉంటున్నారు. దీంతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జనసేన నాయకులు పవన్ వద్ద తమ గోడును వినిపించుకున్నారట. దీనిపై స్పందించిన జనసేనని ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ అయ్యారని టాక్‌.

అయితే, ఉత్తరాంధ్ర పర్యటనకు పవన్ వస్తున్నారన్న వార్తతో ఇక్కడి జనసైనికుల్లో మాంచి జోష్ కనిపిస్తోందట. అధినేత టూర్‌తో మునుపుటి ఉత్సాహం పెరుగుతుందని చెబుతున్నారట. పవన్ ఒక్కసారి పర్యటిస్తే క్యాడర్‌లో ఎక్కడలేని ఉత్సాహం వస్తుందని, పార్టీలోకి చేరికలు కూడా ఉంటాయని అంచనా వేసుకుంటున్నారట. ఇప్పటికే జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో పర్యటించి పార్టీలో అంతర్గత వ్యవహారాలు, పార్టీ స్థితిగతులపై సమీక్షా సమావేశాలు నిర్వహించి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లారట నాదెండ్ల మనోహర్‌.

ఇదిలాఉంటే, కొంతకాలంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి, పవన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉత్తరాంధ్ర పర్యటనలో కార్మికులు చేస్తున్న ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పడంతో ఉక్కు కార్మికులలో నూతనోత్సాహం కనిపిస్తోందట. గతంలో దీక్ష చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపడానికి వెళ్లినప్పుడు ఎదురైనా పరాభవ పాఠాన్ని అధినేతకు వివరించడంతో ఉద్యమంలో పాల్గొనేందుకు సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అదీగాక, ఏపీలో బీజేపీతో పొత్తు ఉండడంతో కేంద్ర పెద్దలతో చర్చలు జరిపితే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపొచ్చన్న అంచనాతో ఉన్న కార్మికుల ఆశలు పవన్‌ వస్తారన్న ప్రచారంతో మరింత పెరుగుతున్నాయని జనసైనికులు అంటున్నారు.

ఏది ఏమైనా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనతో మంచి మైలేజ్ వస్తుందన్న టాక్‌ అయితే బలంగానే వినిపిస్తోంది. దీంతో పాటు విశాఖలో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీకి పూర్వ వైభం వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి జనసేనాని ఉత్తరాంధ్ర పర్యటనతో పార్టీకి ఏ మేరకు లబ్ది చేకూర్చుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories