ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసిన పవన్.. ఈ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు అంటూ కామెంట్స్

ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసిన పవన్.. ఈ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు అంటూ కామెంట్స్
x
Highlights

పవన్‌ నోట చిరు పాట పలికింది. రుద్రవీణ రాగాలు పలికించింది. అయితే, సరదాగా ఈ పాటలు ప్రస్తావించలేదు పవన్. వైసీపీ నేతలకు రుద్రవీణ పాటలు మేలుకొలుపు అంటూ...

పవన్‌ నోట చిరు పాట పలికింది. రుద్రవీణ రాగాలు పలికించింది. అయితే, సరదాగా ఈ పాటలు ప్రస్తావించలేదు పవన్. వైసీపీ నేతలకు రుద్రవీణ పాటలు మేలుకొలుపు అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, పవన్ రుద్రవీణ ట్వీట్‌పై, వైసీపీ సోషల్ మీడియా సైతం ఘాటుగానే స్పందిస్తోంది. దీంతో రుద్రవీణ పాటలపై, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో రణరంగమవుతోంది.

విశాఖలో లాంగ్ మార్చ్ ‌తర్వాత, ఫుల్‌‌జోష్‌లో కనిపిస్తున్నట్టున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసే పవన్, ఈసారి మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లాంగ్‌ మార్చ్‌ను రాంగ్‌ మార్చ్‌ అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై కొత్త తరహాలో మండిపడ్డారు. వైసీపీ నేతలకు, రుద్రవీణ పాటలైనా మేల్కొల్పాలంటూ, పవన్ చేసిన ట్వీట్‌‌, సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇదే రుద్రవీణ ట్వీట్‌పై, వైసీపీ సోషల్ మీడియా టీం కూడా, అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తోంది.

ఇంతకీ ట్విట్టర్‌లో పవన్‌ రుద్రవీణ ట్వీట్ ఏంటంటే, 'రుద్రవీణ... నాకు స్ఫూర్తిని ఇచ్చే చిత్రం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా జీతభత్యాలు తీసుకొంటున్న వైసీపీ నేతలకు రుద్రవీణలోని పాటలు మేలుకొలుపు'' అని అన్నారు పవన్‌. దీనికి 'చుట్టూ పక్కల చూడరా...' అన్న పాటను యాడ్ చేశారు జనసేనాని.

మరో ట్వీట్‌లో... ''వైసీపీ మ్యానిఫెస్టోకు, వారి వాగ్దానాలకు ఓటేసిన ప్రజల కళ్లు తెరిపించే పాట మరోటి ఉంది. వాస్తవంగా హామీల అమలు పరిస్థితిని అది అద్దంపడుతుంది'' అన్నారు పవన్. దానికి 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ...' అన్న సాంగ్‌ను యాడ్ చేశారు.

అయితే, పవన్ కల్యాణ్ రుద్రవీణ ట్వీట్‌ సాంగ్‌లపై, వైసీపీ సోషల్ మీడియా టీం కూడా కౌంటర్‌లు ఇస్తోంది. అన్నాతమ్ముళ్లు ఇద్దరూ ఇద్దరేనంటూ విమర్శలు చేస్తోంది. టీడీపీకి బీ టీం, ఇప్పుడు పాటలు కూడా పాడుతోందని సెటైర్‌లు పేలుస్తోంది. మొత్తానికి పవన్ రుద్రవీణ ట్వీట్‌, సోషల్‌ మీడియాలో సరాగాల సమరానికి జెండా ఊపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories