పల్నాటి రగడ వెనక అసలు రాజకీయం?

పల్నాటి రగడ వెనక అసలు రాజకీయం?
x
Highlights

పల్నాడు వేదికగా నాడు యుద్ధం జరిగింది. తలలు తెగిపడ్డాయి. రక్తం ఏరులై పారింది. ఇప్పుడు కూడా పల్నాడులో సమరం సాగుతోంది. తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ...

పల్నాడు వేదికగా నాడు యుద్ధం జరిగింది. తలలు తెగిపడ్డాయి. రక్తం ఏరులై పారింది. ఇప్పుడు కూడా పల్నాడులో సమరం సాగుతోంది. తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేశారని చంద్రబాబు అంటే, వైసీపీ వారిమీదే అటాక్‌ చేశారంటూ అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోంది. పోటాపోటీగా చలో ఆత్మకూరు పిలుపు కూడానిచ్చాయి. దీంతో పల్నాడు నిజంగానే రణక్షేత్రంగా మారింది. అయితే, ఈ పల్నాటి పౌరుషాల వెనక అసలు కథలు వేరే ఉన్నాయా....ఒక పార్టీ ట్రాప్‌లో మరో పార్టీ పడిందా...నేటి పల్నాటి సమరం వెనక అసలు కథేంటి?

పౌరుషాల గడ్డగా పేరొందిన పల్నాడులో ఇప్పుడు ఎటుచూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల టైంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు భీకరంగా కొట్టుకోగా, ఇప్పుడూ అదే వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే, మీరే వైసీపీ వాళ్లమీద అటాక్‌ చేస్తున్నారని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇరువురు నాయకులు ఆందోళనలకు పిలుపునివ్వడం, ఇరు పార్టీలు కార్యకర్తలు భారీగా చేరుకుంటుండటం, పోలీసుల మోహరింపులతో, మొత్తం పల్నాడు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ దీని వెనక అసలు రాజకీయం వేరే ఉందన్నది జరుగుతున్న చర్చ.

వైసీపీ అధికారంలోకి వచ్చాక గురజాల, సత్తెనపల్లితో పాటు గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని, చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇళ్లపై దాడులు చేసి, ఊళ్ల నుంచి తరిమేశారని అంటున్నారు. దాదాపు 500 కుటుంబాలు వేరే ఊళ్లల్లో దాచుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. పల్నాడులో హక్కుల ఉల్లంఘన సాగుతోందని ఆరోపించారు చంద్రబాబు.

వైసీపీ కూడా, టీడీపీ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. పెయిడ్‌ ఆర్టిస్టులతో బాధితుల పునరావాస శిబిరం అంటూ డ్రామాలాడుతున్నారని, హోంమంత్రి సుచరిత అన్నారు. నిజంగా బాధితులో కాదు, నిజనిర్ధారణ బృందం పంపి తేలుస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఢోకాలేదన్న సుచరిత, ప్రశాంతత చంద్రబాబుకు నచ్చలేదని ఎద్దేవా చేశారు.

గుంటూరులోని అరండాల్‌ పేట వైన్‌ డీలర్ల అసోసియేషన్‌లో, బాధితులంటూ టీడీపీ శిబిరం ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్‌గా ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో, టీడీపీ వాళ్ల చేతుల్లో బాధితులయ్యారంటూ, కొంతమంది సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కూడా అటెండయ్యారు. అసలైన బాధితులు తమ పార్టీ వారేనంటూ, మోపిదేవితో పాటు అంబటి రాంబాబు అన్నారు.

అయితే ఈ పల్నాటి యుద్దంలో ఎవరి రాజకీయం వారిదే. ఐదేళ్ల నుంచి కూడా పల్నాడులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణమే వుంది. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ, వైసీపీ కార్యకర్తలు ఊళ్లను వదిలి వెళ్లిపోయారు. అప్పుడు కూడా వైసీపీ ఇదే తరహాలో ఆందోళన చేసింది. గురజాలలో యరపతినేని మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోందని, ప్రశ్నించిన తమ పార్టీ కార్యకర్తలను హత్య చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. అలాగే సత్తెనపల్లిలో కోడెల శివ ప్రసాద్‌ అరాచకాలు అన్నీఇన్నీ కావంటూ నిరసనలు చేసింది. తమ కార్యకర్తలను చంపుతున్నా, గాయాలపాలు చేస్తున్నా, ఊళ్ల నుంచి బహిష్కరిస్తున్నా, ప్రభుత్వంలో వున్న టీడీపీ మాత్రం పట్టించుకోకుండా, రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తోందని, ప్రతిపక్ష నేతగా జగన్‌ సైతం నాడు అన్నారు. ఇప్పడు సరిగ్గా రివర్సయ్యింది. అధికార మార్పిడి జరిగింది. నాడు వైసీపీ ఆరోపణల్లాంటివే నేడు టీడీపీ చేస్తోంది.

అయితే కొందరు వీటిని ఒట్టి ప్రహసనంగా తేల్చేస్తున్నారు. ఇదంతా డ్రామా అని కొట్టిపారేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వైరాలు, గ్రామస్థాయిల్లో పరస్పర దాడులకు దారి తీయడం కొత్త ఏమీ కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాయలసీమలో రాజకీయ హత్యలు అన్నీఇన్నీ కావు. అయితే పల్నాటి గొడవలను హైలెట్‌ చేయడం వెనక చంద్రబాబు వ్యూహం వేరే వుందని, కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీని రీప్లేస్ చేసేందుకు బీజేపీ దూసుకువస్తోంది. టీడీపీ హయాంలోని అవినీతిపై వైసీపీ విచారణ కమిటీలు సంధిస్తోంది. ముఖ్యంగా గుంటూరులో టీడీపీ నాయకులు కోడెల కే ట్యాక్స్, అసెంబ్ల ఫర్నీచర్, యరపతినేని మైనింగ్‌లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు రకాల కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలుగుదేశంలో ఒక నిస్తేజం కమ్ముకుంది. వీటితో పాటు బాబు తర్వాత నాయకుడెవరన్న సందిగ్దం. ఇతర పార్టీల్లోకి నేతల వలసలు. ఇలా టీడీపీ కార్యకర్తల్లో స్థైర్థ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో తిరిగి జోష్ నింపడానికి, పల్నాటి ఇష్యూను అస్త్రంగా మలచుకుని, రాజకీయ చాణక్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నిజానిజాలు ఎలా వున్నా, పల్నాడులో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, పెద్ద ఎత్తున అలజడి రేపడంలో కొంతమేర సక్సెస్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం మీద ఉద్యమించాలంటూ పిలుపునిచ్చి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. బాబు రణవ్యూహాన్ని ఏమాత్రం అర్థం చేసుకోని వైసీపీ, అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా రియాక్టయి, ఇష్యూను మరింత పెద్దది చేసింది. అంటే పల్నాటి రగడలో, చంద్రబాబు ట్రాప్‌లో వైసీపీ పడిందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.

మొత్తానికి పల్నాడు ఇష్యూలో ఎవరి రాజకీయం వారిదే. పార్టీని కాపాడుకునేందుకు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్థ్యం నింపేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తే, ఎక్కడ తమ ఇమేజ్‌కు డ్యామేజ్‌ జరుగుతుందోనని వైసీపీ పోటాపోటీ కౌంటర్‌లు ఇస్తోంది. చూడాలి, రణక్షేత్రంగా మారిన పల్నాడులో, రానురాను ఇంకెలాంటి పరిణామాలు జరుగుతాయో, రాజకీయం ఇంకెన్ని రంగులు మార్చుకుంటుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories