టీడీపీలో పయ్యావులపై రగడ ఎందుకు?

టీడీపీలో పయ్యావులపై రగడ ఎందుకు?
x
Highlights

తెలుగుదేశంలో పీఏసీ ఛైర్మన్‌ పదవి రచ్చరచ్చ చేస్తోంది. పయ్యావుల కేశవ్‌కు ఎందుకిచ్చారంటూ, ఒకవర్గం నేతలు చంద్రబాబు దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నారట....

తెలుగుదేశంలో పీఏసీ ఛైర్మన్‌ పదవి రచ్చరచ్చ చేస్తోంది. పయ్యావుల కేశవ్‌కు ఎందుకిచ్చారంటూ, ఒకవర్గం నేతలు చంద్రబాబు దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నారట. పయ్యావులకు మించిన సీనియర్లు ఎవరూ లేరా అంటూ కోపంగా మాట్లాడుతున్నారట. ఇంతకీ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ ఛైర్మన్‌గా అవకాశం వెనక, ఏదైనా తతంగం జరిగిందా? పయ్యావులను ప్రతిపాదించడం పట్ల సీనియర్లు ఎందుకంతగా రగిలిపోతున్నారు?

పబ్లిక్‌ అకౌంట్స్ కమిటీ ఛైర్మెన్ పదవి టీడీపీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురి చేసిందనే ప్రచారం సాగుతోంది. పీఏసీ ఛైర్మెన్ పోస్టుకు పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేయడంపట్ల ఘాటైన చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం, పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది. పయ్యావులను మించిన నాయకులు, బీసీ నేతలూ పార్టీలో ఎవరూ లేరా అంటూ కొందరు సీనియర్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి పీఏసీ ఛైర్మెన్ పదవి దక్కడం ఆనవాయితీ. పీఏసీ ఛైర్మన్‌కు కేబినెట్‌ హోదా వుంటుంది. దీంతో సహజంగానే ఈ పదవి పట్ల భారీగానే పోటీ ఉంటుంది. దీంతో టీడీపీలోని కొందరు సీనియర్లు పోటీపడ్డారు. ఈ పదవికి పేర్లను ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును కోరారు. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్‌ పేరును ప్రతిపాదించారు చంద్రబాబు. ఈ మేరకు స్పీకర్‌కు కూడా ఆయన లేఖ పంపినట్టుగా సమాచారం. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం పయ్యావుల కేశవ్‌తో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్‌లు పోటీ పడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్‌కు ఈ పదవిని దాదాపుగా కేటాయించినట్టుగా తొలుత ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా పయ్యావుల పేరు తెరపైకి రావడం వెనక చాలా తతంగమే నడిచిందన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేసేందుకు, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై ఆకర్షణ మంత్రం విసురుతోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా టీడీపీలోని ప్రధాన సామాజికవర్గం కమ్మవర్గంపై వల వేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఇదే క్రమంలో ఉరవకొండ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌ను పార్టీలోకి లాగేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందన్న మాటలు వినపడ్డాయి. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు, పయ్యావులను ఆపేందుకే, పీఏసీ ఛైర్మన్‌ పదవికి ప్రతిపాదించారన్న చర్చ జరుగుతోంది.

అయితే ఈ ప్రచారాన్ని కేశవ్ ఖండించారు. తనకు అసెంబ్లీ వ్యవహరాలపై పట్టు ఉన్న కారణంగానే ఈ పదవిని కట్టబెట్టారని అంటున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికే, ఉన్న ఒక్క కేబినెట్ ర్యాంకు పోస్టును కేటాయించడంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

అధికార వైసీపీ బీసీ, కాపు సామాజిక వర్గాలను తమవైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించడం, మరోవైపు బీజేపీ కూడా, టీడీపీ బీసీ నేతలను లాగేందుకు వల విసురుతున్న తరుణంలో, బీసీ వర్గాన్ని కాపాడుకోవాల్సిన టీడీపీ, పీఏసీ ఛైర్మన్‌‌కు ఎంపిక చెయ్యాల్సిందిపోయి, తిరిగి కమ్మవర్గానికే కేటాయించడంపై బీసీ ఎమ్మెల్యేలు మండిపోతున్నారు. చంద్రబాబు నిర్ణయంపై లోలోపల రగిలిపోతున్నారు. కేవలం పార్టీ మారతారన్న వారికే పదవులు కేటాయిస్తే, చాలామంది వెళ్లిపోతామని అంటారని, అలాగని అందరికీ పదవులు ఇవ్వలేరు కదా అని అంటున్నారు.

పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు కూడా ఆశలు పెట్టుకున్నారన్న ప్రచారం సైతం జరిగింది. గంటా కూడా పార్టీ మారతారు, ఎక్కువమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీలోకి వెళ్లిపోతారన్న పుకార్లూ షికారు చేశాయి. దీంతో గంటాను ఆపేందుకు పీఏసీ ఛైర్మెన్‌ పదవి ఇస్తారన్న చర్చ జరిగింది. అయితే పయ్యావుల ముందు గంటా తేలిపోయారని ఒకవర్గం నేతలు మాట్లాడుకుంటున్నారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ పదవిని కేటాయిస్తే పార్టీలో ఇతర ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యేవారు కాదనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఈ పదవిపై పెట్టుకొన్న ఆశలు గల్లంతు కావడంతో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి పయ్యావుల ఎంపిక చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఉన్న ఒక్క కేబినెట్ ర్యాంక్ పోస్టును అందరికీ పంచలేమని, ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టే, ఇచ్చామని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాబు. 2014లో పయ్యావుల ఓడిపోవడం, చివర్లో ఎమ్మెల్సీగా చేసినా, మంత్రి పదవి దక్కకపోవడంతో, ఈసారైనా పయ్యావులకు కేబినెట్‌ ర్యాంకు ఇచ్చామని అంటున్నారట చంద్రబాబు. మొత్తానికి ఇఫ్పటికే అనేక తలనొప్పులతో సతమతమవుతున్న చంద్రబాబుకు, పీఏసీ ఛైర్మన్‌ ఎంపిక మరింత చికాకు తెప్పిస్తోందని, పార్టీలో చర్చ జరుగుతోంది. చూడాలి, ఈ వివాదానికి బాబు ఎలా ముగింపు పలుకుతారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories