బంధుత్వమా...రాజకీయమా.. ప్రత్తిపాడు ఫ్యామిలీవార్‌ కొత్త ట్విస్ట్ ఏంటి?

బంధుత్వమా...రాజకీయమా.. ప్రత్తిపాడు ఫ్యామిలీవార్‌ కొత్త ట్విస్ట్ ఏంటి?
x
Highlights

రెండు పార్టీల మధ్య రాజకీయం వైరం ఆ నియోజకవర్గంలో రెండు కుటుంబాల పోరుగా మారింది. ఏళ్ల తరబడి రాజకీయ ఆధిపత్యం, ఇప్పుడు పీక్స్‌కు వెళ్లి రచ్చ చేస్తోంది....

రెండు పార్టీల మధ్య రాజకీయం వైరం ఆ నియోజకవర్గంలో రెండు కుటుంబాల పోరుగా మారింది. ఏళ్ల తరబడి రాజకీయ ఆధిపత్యం, ఇప్పుడు పీక్స్‌కు వెళ్లి రచ్చ చేస్తోంది. పాత తరం నుంచి నేర్చుకున్న రాజకీయ పాఠాలను పక్కన పెట్టిన వారసులు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారట. ఇద్దరి నేతల మధ్య అటు బంధువులు ఇటు క్యాడర్ నలిగిపోతున్నారట. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన కొత్తతరం నాయకులతో వస్తున్న చిక్కులేంటి..?

తూర్పుగోదావరి జిల్లా మెట్ట నియోజకవర్గం ప్రత్తిపాడులో రాజకీయాల రూటే వేరు. యమ ఘాటెక్కిన పాలిటిక్స్ ఇక్కడ. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అధికార ప్రతిపక్షాల మధ్య, మాటల యుధ్దం నిత్యమిక్కడ. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తొలి నుంచి వస్తున్న రెండు కుటుంబాల ఆధిపత్య పోరు, ఇప్పుడు మరింత రచ్చకెక్కుతున్నాయి. ఒకసారి ప్రత్తిపాడు నియోజకవర్గం ముఖ చిత్రం చూస్తే, అక్కడ పర్వత, వరుపుల కుటుంబాలదే తొలి నుంచి ఆధిపత్యం. పర్వత కుటుంబం నుంచి ఇప్పటి వరకు పర్వత బాపనమ్మ, పర్వత గుర్రాజు, పర్వత సుబ్బారావు, పర్వత చిట్టిబాబు, నలుగురు ఎమ్మెల్యే పదవులు చేపట్టగా, వరుపుల కుటుంబం నుంచి సుబ్బారావు వరుపుల జోగిరాజా అక్కడ శాసనసభ్యులుగా పని చేసారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున పర్వత పూర్ణచంద్రప్రసాద్, టిడిపి నుంచి వరుపుల రాజా పోటీపడగా, హోరాహోరీ పోరులో పర్వత పూర్ణచంద్రప్రసాద్ విజయం సాధించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా వరుపుల రాజా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరడానికి సిధ్దమయ్యారు. అయితే రాజా రాకను, పూర్ణచంద్రప్రసాద్ అడ్డుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే డిసిసిబి చైర్మన్ గా వరుపుల రాజా పని చేసిన సమయంలో, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు, అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆరోపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. కోఆపరేటివ్ సొసైటీ అధికారుల ప్రాథమిక విచారణలో, సుమారు 16 కోట్ల రూపాయిలు అక్రమాలు జరిగినట్టు నిర్ధారించడంతో, వివిధ సెక్షన్ల కింద వరుపుల రాజాపై కేసులు నమోదు చేసి అరెస్టుకు రంగం సిధ్ధం చేసారు. అయితే వరుపుల రాజా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో అరెస్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ రాజకీయ వైరం పీక్స్‌కు చేరింది.

వరుపుల రాజాను రాజకీయంగా అణగదొక్కేందుకు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఈ కేసులు బనాయించినట్టు, రాజా వర్గం రుసరుసలాడుతోంది. వరుపుల రాజాకు మద్దతుగా, పార్టీ సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప కూడా నిలవడంతో మెట్ట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పర్వత-వరుపుల ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, ఇరు కుటుంబాల మధ్య దశాబ్ధాల రాజకీయ ఆధిపత్యం తోడవడంతో ప్రత్తిపాడు రాజకీయం మరింత రంజుగా మారింది. గతంలో ఎన్నడూలేని విధంగా సవాళ్లు ప్రతి సవాళ్లు, వ్యక్తిగత దూషణలతో పార్టీ నేతలు రచ్చరచ్చ చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య వైరం కాస్త రెండు కుటుంబాల సమరంగా మారి, నియోజకవర్గంలో కొత్త పోకడకు దారి తీసిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

రాజా వర్సెస్ పూర్ణచంద్రప్రసాద్ అంటూ సాగుతున్న మెట్ట రాజకీయాలు, నియోజకవర్గ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరూ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, ఇరు కుటుంబాల మధ్య బంధుత్వాలు కూడా ఉండటంతో, వివాదానికి తెర దించేందుకు మెట్ట ప్రాంతం టిడిపి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ప్రయత్నించారట. అయితే జ్యోతుల నెహ్రూపైన కూడా పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఒంటికాలిపై లేచి, సీనియర్ అనే కనీస గౌరవం లేకుండా వ్యవహరించారని చర్చించుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గ రాజకీయాలను వేడెక్కించిన నేతలు, వివాదాన్ని అన్నవరం సత్యదేవుని సన్నిధికి చేర్చారు. రాజా వర్సెస్ పూర్ణచంద్రప్రసాద్ కాస్తా ఇప్పుడు జ్యోతుల వర్సెస్ పర్వతగా మారడం నియోజకవర్గ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయనేదానిపై ఆసక్తి కలిగిస్తోంది. మెట్ట రాజకీయ వివాదాలకు అధిష్టానాలు చెక్ పెడతాయా.. లేక సామాజిక వర్గ పెద్దలు పరిష్కరిస్తారా..? చూడాలి ఏమవుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories