Top
logo

నెల్లూరు వైసీపీ నేతల చుట్టూ టీడీపీ లీడర్ల ప్రదక్షిణ ఎందుకు?

నెల్లూరు వైసీపీ నేతల చుట్టూ టీడీపీ లీడర్ల ప్రదక్షిణ ఎందుకు?
Highlights

తెలుగుదేశం-వైసీపీ. ఉప్పూ నిప్పు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. కానీ ఇప్పుడు ఓ జిల్లాలో టీడీపీ నేతలు,...

తెలుగుదేశం-వైసీపీ. ఉప్పూ నిప్పు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. కానీ ఇప్పుడు ఓ జిల్లాలో టీడీపీ నేతలు, వైసీపీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అవసరమున్నా లేకపోయినా నమస్కారాలు పెడుతున్నారు. చోటామోటా నేతలకు సైతం బొకేలిచ్చి విషెస్ చెబుతున్నారు. మరి వైసీపీ లీడర్లంటే కస్సుమనే తెలుగు తమ్ముళ్లు ఎందుకింత కాకా పడుతున్నారు. అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణల వెనక అసలు కథేంటి?

నెల్లూరు జిల్లాలో నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం తమ ప్రాణం రక్తం చంద్రబాబు దేవుడు అంటూ చెప్పుకొచ్చిన టీడీపీలోని కొందరు నాయకులు, ఇప్పుడు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఇప్పటివరకు టిడిపిలో నామినేటెడ్ పదవికి రాజీనామా కూడా చేయని ఓ నాయకుడు రాష్ట్రంలో టిడిపికి అధికారం చేజారిందే తడవు, జంప్ జిలానీల టైపులో వైసీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. నగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆనేత ఇప్పుడు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని చర్చ జరుగుతోంది. పనిలోపనిగా తన అనుచరులు, సామాజిక వర్గం నాయకులతో, ఇన్నాళ్లు తామే నిజమైన టిడిపి నేతలమంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా, గోడ దూకేందుకు సిద్దమయ్యరని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. మరో కార్పొరేటర్ కూడా ఇదే బాటలో ఉన్నారట. ఎన్నికల వరకు మాజీమంత్రి నారాయణ, సోమిరెడ్డిలతో పార్టీ కార్యాలయంలో ముందంజలో ఉన్న ఆ కార్పొరేటర్, ఇప్పుడు ఉన్నపళంగా జెండా మార్చేయడం, టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోందట.

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో కొందరు చోటామోటా నేతలు, అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందుక్కారణం కాంట్రాక్టులేనని తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎంతో మంది ఆ పార్టీ నాయ‌కులు, అభివృద్ధి ప‌నుల కాంట్రాక్టుల‌ను చేజిక్కించుకుని, ప‌నులు చేశారు. మ‌రి కొంద‌రు త‌మ అనూయ‌ాయుల‌కు వాటిని ఇప్పించారు. ఎన్నిక‌ల వేళ ఈ ప‌నుల్లో వేగం పెంచి, ప‌నులు శ‌ర‌వేగంగా చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో 80శాతం వ‌ర‌కు ప‌నులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం మార‌డంతో, ఇప్పుడు ఈ ప‌నులు చేసిన వారి ప‌రిస్థితి గాలిలో దీపంలా మారింది. పెట్టిన డ‌బ్బులు తిరిగి వ‌స్తాయో లేదోనన్న ఆందోళ‌న వీరిలో నెల‌కొంది. దీంతో ఇక చేసేదేమీ లేక వీరంతా ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

జిల్లాలోని ఒక్క నెల్లూరు న‌గ‌రంలోనే రెండున్న వేల కోట్లకు పైగా అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు అప్పటి మంత్రి నారాయ‌ణ‌. అందులో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, మార్కెట్‌ల ఆధునీక‌ర‌ణ‌, అండ‌ర్ గ్రౌండ్ వాట‌ర్ పైప్‌లైన్‌, నెక్లెస్ రోడ్ వంటి కీల‌క‌మైన ప‌నులు ఉన్నాయి. వీటిలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాట‌ర్ పైప్‌లైన్ ప‌నులు దాదాపు పూర్తికాగా, పార్కుల అభివృద్ధి 50శాతం మాత్రమే జ‌రిగింది. ఇక నెక్లెస్ రోడ్ నిర్మాణం కూడా 60 నుంచి 80శాతం వ‌ర‌కు పూర్తయ్యింది. ప్రభుత్వం మారి జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 25శాతం లోపు జ‌రిగిన అన్ని ప‌నులు నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డంతో, నెల్లూరులో కొన్ని ప‌నులు మ‌ధ్యలోనే నిలిచిపోగా, దాదాపుగా పూర్తి కావ‌చ్చిన ప‌నులు ముందుకుసాగ‌డం లేదు. దీనికి కార‌ణం నూత‌నంగా వ‌చ్చిన స‌ర్కారు, చేసిన ప‌నుల‌కు బిల్లులు చెల్లిస్తుందా లేదా అన్న డైలమాలో కాంట్రాక్టర్లు ఉండ‌ట‌మే. అందుకే, చేసిన ప‌నుల‌కు బిల్లులు రాబ‌ట్టుకునేందుకు ఇక్కడి రాజ‌కీయ‌నేత‌లు త‌మ‌దైన శైలిలో వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. స్థానిక అధికారపార్టీ నేతల అనుమతులు లేకుండా బిల్లులు చేయకూడదన్న పరోక్ష సంకేతాలెల్లాయి అధికారులకు. దీంతో బిల్లులు రావాలంటే అధికారపార్టీ నేతల ప్రసన్నం తప్పనిసరిగా మారింది టీడీపీ నేతలకు.

నెల్లూరు జిల్లాలో టిడిపి హయాంలో అభివృద్ధి ప‌నులు చేజిక్కించుకున్న వారు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి నేత‌ల‌ను ప్రస‌న్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. చిన్నచిన్న నాయ‌కులు ఎమ్మెల్యేల‌ను కలిసి, పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతూ, తాము ఇక మీ వెంటే ఉంటామ‌న్న సంకేతాలు ఇస్తుంటే, పెద్ద పెద్ద నాయ‌కులు, త‌మ‌కున్న ప‌లుకు బ‌డితో క‌మ‌ల‌ద‌ళంలో చేరేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.

జిల్లాలో చోటామోటా నాయకులేకాదు, మొన్నటి వరకు ఏపీ క్యాబినెట్లో ఉన్న ఒకరిద్దరు నాయకులు ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి సరిగాలేకుంటే, ఏదో ఒక అధికార పార్టీ అవసరమే కదా అంటూ ఓ పార్టీ నేత అనుచరులడొకరు లాజికల్‌గా కన్‌క్లూజన్‌కు వచ్చేస్తున్నారు. ఇందుకు జిల్లాలో ఓ సీనియర్ నేత, వెంకయ్య నాయుడి ద్వారా క‌మ‌లం పార్టీలోకి వెళ్లేందుకు పావులు క‌దుపుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న నాయ‌కులు, స్థానిక ఎమ్మెల్యేల‌ను ప్రస‌న్నం చేసుకునేందుకు ర‌క‌ర‌కాల ఎత్తులు వేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఓట‌మి త‌రువాత టిడిపి నాయ‌కులు, త‌మ మ‌నుగ‌డ‌, స్వార్థం కోసం అధికారంలో ఉన్న వైసిపి నేత‌ల చుట్టూ తిరుగుతుంటే, వైసిపి నేత‌లు మాత్రం ఈ అంశాన్ని దూదిపింజ‌లా చూస్తున్నారు. ఇప్పటికే, వైసిపి రైలుబండిలోని అన్నీ బోగిలు ఫుల్ అయిపోయి, క‌నీసం నిల‌బ‌డేందుకు కూడా చోటు లేకుండా ఉన్న త‌రుణంలో, అద‌నంగా టిడిపి నేత‌లు వ‌స్తే పార్టీలో అస‌మ్మతులు చెల‌రేగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జిల్లా వైసిపి నేత‌లు ఆలోచిస్తున్నారు. అందుకే అంటీముంటనట్టుగా పార్టీలోకి రావాల‌నుకుంటున్న టిడిపి నేత‌ల‌పై ఒక కన్ను వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి గాలి బ‌లంగా ఉండ‌టం, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అది ప‌దింత‌లు వేగంగా ఉండ‌టంతో, సైకిల్ పార్టీ నేత‌లను అధికారంలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్యేలు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఏది ఏమైనా తాము చేప‌ట్టిన కాంట్రాక్టు ప‌నులు, స్వార్థ రాజ‌కీయాల కోసం అధికారం కోల్పోయిన తెలుగుదేశం నేత‌లు, అధికారంలో ఉన్న వైసిపి నేత‌ల‌ను ఎలాగైనా ప్రస‌న్నం చేసుకోవాల‌ని భావిస్తుంటే, ఐదేళ్లు ప్రతిప‌క్షంలో ఉండి, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన వైసిపి నేత‌లు మాత్రం, టిడిపి నేత‌ల తీరును చూస్తూ ఆనందిస్తున్నారే త‌ప్ప‌, వీరిని అక్కున చేర్చుకోవాల‌న్న ఆలోచ‌న చేయ‌డం లేదు. పవర్‌ అనే మూడక్షరాలకు ఉన్న పవర్ అది.


Next Story