Off The Record: లోకేష్‌... యాత్ర అనే అస్త్రాన్ని ప్రయోగిస్తారా?

Nara Lokesh Likely to Launch Padayatra on Gandhi Jayanti
x

Off The Record: లోకేష్‌... యాత్ర అనే అస్త్రాన్ని ప్రయోగిస్తారా? 

Highlights

Off The Record: వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి, పాదయాత్రతో ప్రభంజనం మోగించారు. నారా చంద్రబాబునాయుడు సైతం, పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు.

Off The Record: వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి, పాదయాత్రతో ప్రభంజనం మోగించారు. నారా చంద్రబాబునాయుడు సైతం, పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. ఇక వైఎస్‌ జగన్‌‌మోహన్‌‌రెడ్డి పాదయాత్ర, అఖండ విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే ఒరవడిలో లోకేష్‌‌ బాబు కూడా అదే పాదయాత్రకు సిద్దమవుతున్నారట. పదేళ్ల కిందట తన తండ్రి నడిచిన బాటలోనే తనయుడు నడిచేందుకు రెడీ అవుతున్నారట. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యతను తన భుజాలపై పెట్టుకుంటున్నారట. తన సమర్ధతనే ప్రశ్నిస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు ఊహకందని షాక్‌ ఇవ్వబోతున్నారట. ఒకరకంగా యుద్ధమే చేస్తానంటున్న ఆ యువనేత ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఇంకెలా ఉండబోతోంది?

నారా లోకేష్‌. చంద్రబాబు తనయుడు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ. అన్నింటికీ మించి నారావారి వారసుడు. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్న నాయకుడు. 2014లో అధికారం చేజిక్కించుకున్న తెలుగుదేశం, 2019 ఘోర ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు ఆత్మస్థైర్థాన్ని కోల్పోతున్నాయి. తెలుగుదేశం నుంచి కీలక నాయకులను బుట్టలో వేసుకునేందుకు ఇటు వైసీపీ, అటు బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దేశం ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అందుకే నారా లోకేష్‌, పార్టీని ఆ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి, యాత్ర అనే అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నారట. అదే గతంలో తండ్రి చేపట్టిన పాదయాత్ర.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైముంది. కానీ అంతలోపు పార్టీని కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారట లోకేష్. అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నారట. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ మీద ఊరూరా తిరుగుతూ, జనాలను, కార్యకర్తలను పరామర్శిస్తూ, పలకరిస్తూ పోతే, సైకిల్ యాత్ర సూపర్‌ హిట్టవుతుందని మొదట్లో అనుకున్నారట. కానీ గత అనుభవాల మేరకు, దివంగత వైఎస్ ‌నుంచి తన తండ్రి చంద్రబాబు, వైఎస్‌ జగన్‌కు అధికారాన్ని చేతిలో పెట్టి తెచ్చి ఇచ్చిన పాదయాత్రే చేయాలన్నది చినబాబు ఆలోచనట.

ఒకప్పుడు ప్రజల్ని నేరుగా చేరుకోవటానికి నేతలు అనుసరించిన పాదయాత్ర ట్రెండు తర్వాత్తర్వాత మారుతూ వచ్చింది. బస్సుయాత్రలు, ఓపెన్ టాప్ జీపు యాత్రలు... ఇలా వగైరాలు కొంతకాలం నడిచాయి. మళ్లీ ఇంకొంతకాలం తర్వాత ట్రెండు మారింది. తెలుగు రాజకీయాల్లో తిరిగి పాదయాత్రల సీజన్ నడుస్తోంది. పాదయాత్ర చేసిన అధినేతలంతా ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాలు చేజిక్కించుకోవటంతో లోకేష్‌ కూడా తన పాదయాత్రలతో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారట. అలా జనానికి చేరువవ్వాలని ప్లాన్‌ వేస్తున్నారట.

కొంతకాలంగా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ అది సైకిల్ యాత్రలా ఉంటుందా..? లేక పాదయాత్రనా అన్నది క్లారిటీ లేకుండా ఉంది. కానీ మొన్నటి మహానాడుతో పాదయాత్ర ద్వారానే జనంలోకి వెళితే బెటరని లోకేష్ నిర్ణయంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ పాదయాత్ర చేపట్టాలని లోకేష్ భావిస్తున్నట్లు సమాచారం. తన పాదయాత్రకు తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని లోకేష్‌ అనుచరులు కొందరు లీకులిస్తున్నారు. సరిగా పదేళ్ల క్రితం వస్తున్నా మీ కోసం అంటూ ప్రజలకు చేరువైన చంద్రబాబు ఆపై విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చే ఎన్నికలకు పార్టీకి మరింత ఆదరణ కలగాలంటే పాదయాత్రే బెస్టని లోకేష్‌ భావిస్తున్నారట.

అయితే ఈ పాదయాత్రను తానే చేయాలని చంద్రబాబు భావించినప్పటికీ వయసురీత్యా ఇబ్బందులు ఎదురవుతాయన్న డాక్టర్లు సూచనతో లోకేష్ రంగంలోకి దిగినట్టు సమాచారం. మహానాడుతో ఫుల్ జోష్‌లో ఉన్న టీడీపీ నేతలు.. ఆ జోష్ కంటిన్యూ అవటానికి లోకేష్ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే, చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రెండు జిల్లాలో మూడు రోజులపాటు ఉండేలా పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తున్నారట. మహానాడు స్ఫూర్తితో జిల్లాలో మినీ మహానాడులు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమవ్వాలన్నది అధిష్టానం ఆలోచనట. ఏడాది వ్యవధిలో మొత్తం రాష్ట్రమంతా తండ్రీ తనయులు పర్యటించేలా ప్రస్తుతం రోడ్ మ్యాప్ రెడీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశముంటే ఆ మేరకు తమ యాత్రలను మరింత ముందుగా చేపట్టేందుకు కూడా ఈ తండ్రీ కొడుకులు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

నాయకుడు ఎవరైనా ప్రజల్లో నిత్యం ఉంటేనే నాయకుడు అవుతాడు. పవర్‌లో ఉన్నంత కాలం, మంత్రిగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు లోకేష్. ఆ తర్వాత ఎన్నికల టైంలో జనాల దగ్గరకు వెళ్లారు తప్ప, ప్రజా సమస్యలపై పెద్దగా ఎలుగెత్తింది లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ ఆలోచిస్తున్నారట. సైకిల్ యాత్ర ద్వారా వీలైనన్ని ప్రాంతాలను చుట్టేస్తే, ప్రజా నాయకుడిగానూ మద్దతు లభిస్తుందని భావిస్తున్నారట. మరి ఇప్పటివరకూ ఈ పాదయాత్రలన్నీ ఆయా పార్టీలకు కలిసిరావడంతో ముందుకొద్దామని అనుకుంటున్న లోకేష్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది? తెలుగు తమ్ముళ్లకు ఎలాంటి బూస్టప్ ఇవ్వబోతోందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories