రాజుగారి మంటలు మంచే చేశాయా.. వైసీపీలో సరికొత్త మార్పులకు శ్రీకారమా?

రాజుగారి మంటలు మంచే చేశాయా.. వైసీపీలో సరికొత్త మార్పులకు శ్రీకారమా?
x
Highlights

రఘురామ కృష్ణంరాజు. వైసీపీలో ప్రకంపనలు రేపిన ఫైర్‌ బ్రాండ్. సొంత పార్టీ ప్రభుత్వంపై ఆయన చేయని విమర్శ లేదు. సొంత పార్టీలను తిట్టని తిట్టులేదు. ఘాటైన...

రఘురామ కృష్ణంరాజు. వైసీపీలో ప్రకంపనలు రేపిన ఫైర్‌ బ్రాండ్. సొంత పార్టీ ప్రభుత్వంపై ఆయన చేయని విమర్శ లేదు. సొంత పార్టీలను తిట్టని తిట్టులేదు. ఘాటైన ఆరోపణలే చేశారు. ఏకంగా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు ఫైర్‌ అయ్యేంతగా రగడ చేశారు. రఘురామపై రేపోమాపో చర్యలు తప్పవంటూ, వైసీపీ అధిష్టానం సిగ్నల్స్ కూడా ఇచ్చింది. కానీ, ఇప్పుడు అదే రఘురామ చేసిన ఆరోపణలు, వైసీపీలో పెను మార్పులుకు శ్రీకారం చుట్టాయన్న చర్చ జరుగుతోంది. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారట. ఇది నిజంగా నిజమంటున్నారు వైసీపీ నేతలు. ఇంతకీ ఏంటా మార్పులు?

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వంపైనే ఘాటు విమర్శలే చేశారు. అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా నడుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రఘురామ మాటలు వైసీపీలో కల్లోలం రేపాయి. ఓ రేంజ్‌లో కౌంటర్‌ అటాక్‌లూ సాగాయి. ఇప్పుడు అవే ఆరోపణలు మార్పుకు శ్రీకారం చుట్టాయా? రఘురామ ఆరోపణలను జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారా? వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారా?

రఘురామ కృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడు. తొలిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రాజు, కొన్ని రోజుల తర్వాతే వైసీపీకే కొరకురాని కొయ్యగా మారారు. ఢిల్లీలో బీజేపీతో అదేపనిగా ఆయన రాసుకుపూసుకు తిరిగడం పార్టీకి కోపం తెప్పించింది. అంతటితో ఆగకుండా వైసీపీ ప్రభుత్వం మీదే తీవ్ర ఆరోపణలు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. తిరుమల ఆస్తుల అమ్మకం ప్రతిపాదనను వ్యతిరేకించారు. వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇసుక దొంగలుగా మారారని నిప్పులు చెరిగారు. నరసాపురంలో తన గెలుపుకు జగన్ ఒక్కరే కారణం కాదని, తన పాత్రా వుందన్నారు. సీఎం జగన్‌ను కలవాలని ఎన్నిసార్లు అడిగినా అపాయింట్‌ ఇవ్వలేదన్నారు. వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ, వైసీపీలో ప్రకంపనలు సృష్టించారు రఘురామ. ఆ వెంటనే, మంత్రులు, ఎమ్మెల్యేలు మూకమ్మడిగా ప్రెస్‌మీట్లు పెట్టి, రఘురామకు కౌంటర్‌ ఇచ్చారు. తాజాగా తన జిల్లాలో ఏకంగా తనకు ప్రాణాహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. తనను చంపుతామని కొందరు వ్యక్తులు బెరిరిస్తున్నారని వాపోయారు. కేంద్రబలగాలతో తనకు రక్షణ కల్పించాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఇదీ, రాజుగారి మాటల మంటలు, ఆరోపణలు సెగలు. కానీ ఈయనగారి మాటలే, ఇప్పుడు వైసీపీలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాయన్న చర్చ జరుగుతోంది.

రఘురామ కృష్ణం రాజు విమర్శలు, ఆరోపణలపై వైసీపీ అధిష్టానం చాలా కోపంగా వుంది. కానీ ఆయన లేవనెత్తిన అంశాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంది. రాజుపై క్రమశిక్షణా చర్యల తర్వాత చూద్దాం, మొదట ఆయన రైజ్‌ చేసిన ఆరోపణల అంతుచూద్దామని డిసైడయ్యారట సీఎం వైఎస్ జగన్. రఘురామ విమర్శించినట్టు, ఇసుక సమస్య స్టేట్‌లో తీవ్రంగా వుంది. నాసిరకం ఇసుక, ట్రాన్స్‌పోర్ట్ చార్జీల అదనపు భారంతో ఇసుక ధర కొండెక్కింది. దీంతో దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, ఇప్పడున్న పాలసీలో సమూల మార్పులు చేసి, ఇసుక విధానంలతో మెరుగైన మార్పులు చెయ్యాలని భావిస్తున్నారట సీఎం జగన్. ఆ రకంగా రఘురామ ఇసుక ఆరోపణలు, కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయన్న చర్చ జరుగుతోంది.

ఇక రఘురామ రెండో కంప్లైంట్, సీఎం జగన్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని. ఇది కూడా రెలెవెంట్‌ ఇష్యూగా భావిస్తున్నారు జగన్. వైసీపీలో దాదాపు 50మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు జగన్‌తో మాట్లాడలేదట. నియోజకవర్గాల ఇష్యూలు చెప్పుకుందామంటే, సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదట. ఎక్కడో జిల్లాల్లో సీఎం పాల్గొనే ప్రోగ్రామ్స్‌లో కలుస్తున్నారు తప్ప, పర్సనల్‌గా వచ్చి కలవలేకపోయారట. దీంతో తమ వేదనా, రోదనా ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, లోలోపల కుమిలిపోతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో రఘురామ రైజ్ చేసిన అపాయింట్‌మెంట్‌ ఇష్యూపై సీరియస్‌ వర్కౌట్ చేసి, అపాయింట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారట జగన్. కలవడానికి అవకావం ఇవ్వకపోతే, అందరూ రఘురామలా తయారయ్యే ప్రమాదముందని అంచనా వేశారట. ఇక నుంచి ప్రతిరోజూ పదిమంది ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇస్తారట. నియోజకవర్గ నిధులు, ఇతర సమస్యలు విన్నవించుకోవడానికి ఎమ్మెల్యేలకు చాన్స్‌ ఇస్తారట జగన్. తన తండ్రి వైఎస్ హయాంలోనూ వున్న ఇలాంటి సాంప్రదాయాన్ని పునరుద్దించినట్టవుతుందని కూడా, జగన్‌ ఆలోచిస్తున్నారట.

తాజాగా వైసీపీలో ఇలాంటి డెవలప్‌మెంట్స్‌పై రఘురామ హర్షం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రోజూ ఇంటర్వ్యూలు ఇవ్వాలని, మీడియా ముఖంగా తాను చేసిన సూచనకు, సీఎం జగన్‌ స్పందించారని, దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ సిస్టం ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసిందని, ఆయన మెసేజ్ చేశారు. ఏదో ఒక రోజు, తనకూ కూడా జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్న ఆశాభావం వుందని అన్నారట రాజు.

ఇలా ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించిన రెండు ఇష్యూలకు, సొల్యూషన్ దిశగా అడుగులేసినట్టయ్యింది వైసీపీ. ఇసుక, అపాయింట్‌మెంట్‌లపై ఉన్నతస్థాయిలో సమీక్షిస్తోంది. వ్యక్తిగతంగా రఘురామ ఆరోపణలను పక్కనపెడితే, ఈ రకంగా రెండు మేళ్లు జరిగాయని, వైసీపీలోనే కొందరు మాట్లాడుకుంటున్నారట. అలాగని, ఓపెన్‌ కామెంట్లు చేసిన, రఘురామను బుజ్జగిస్తారని అనుకోవడానికి వీల్లేదంటున్నారు నేతలు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అన్‌పార్లమెంట్రీ లాంగ్వేజ్‌ ఉపయోగించడంపై అధిష్టానం ఆగ్రహంగా వుందని తెలుస్తోంది. పార్టీ వేదికలపై కాకుండా, ఓపెన్‌ కామెంట్లు చేస్తే, క్రమశిక్షణా చర్యలు తప్పవని, త్వరలో అదీ జరుగుతుందని, కొందరు వైసీపీ నాయకులంటున్నారు. చూడాలి, తాను చేసిన విమర్శలు వైసీపీలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయన్న సంతోషంలో వున్న రఘురామ పట్ల, అధిష్టానం మెత్తగానే వుంటుందో అంతకుమించి అన్నట్టుగా కఠిన చర్యలకు ఎర్రజెండా ఎగరేస్తుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories