మంత్రి-ఎంపీ నడుమ గొడవేంటి?

మంత్రి-ఎంపీ నడుమ గొడవేంటి?
x
Highlights

ఆ నియోజకవర్గంలో ఓ మంత్రికి, ఎంపీకి అస్సలు పొసగడం లేదట. అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే అన్న చందంగా మారిందట. ఇంతకీ ఎవరా లీడర్లు? వారి మధ్య...

ఆ నియోజకవర్గంలో ఓ మంత్రికి, ఎంపీకి అస్సలు పొసగడం లేదట. అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే అన్న చందంగా మారిందట. ఇంతకీ ఎవరా లీడర్లు? వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ చేసిన గొడవలేంటి?

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్ధానాలు గెలుచుకున్న పార్టీ, రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకుంటుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇది మరోసారి రుజువైంది. జిల్లాలోని 19 అసెంబ్లీ స్ధానాల్లో, 14 స్ధానాలతో పాటు,. మూడు పార్లమెంట్ సీట్లలోనూ విజయకేతనం ఎగురవేసిన వైసిపి, రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటయ్యి రెండేళ్లు అవుతున్నా, ఆ పార్టీలో నేతల మధ్య ఇంకా సఖ్యత కుదరడం లేదన్న మాటలు ధ్వనిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకుంటూ, ఇగోలకు వెళ్తున్నారనే విమర్శలు సొంత పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. ప్రధానంగా కోనసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విశ్వరూప్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితులు మారాయట.

మంత్రి విశ్వరూప్ అమలాపురం అసెంబ్లీ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికవగా, అదే పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఎంపీగా గెలుపొందారు చింతా అనురాధ. అయితే ఇద్దరి మధ్య విభేధాలు తారాస్ధాయికి చేరాయట. ఇద్దరూ కలిసి గత 18 నెలల్లో హాజరైన కార్యక్రమాలు, చేతి వేళ్లమీద లెక్కపెట్టవచ్చంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఎంపీ అనురాధ హాజరయ్యే కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ దూరంగా ఉంటుంటే, విశ్వరూప్ కార్యక్రమానికి అనురాధ హాజరుకావడం లేదట. వీరిద్దరి మధ్య ఇంతలా విభేధాలు రావడానికి కారణమేంటనేది, కోనసీమలోని వైసిపి క్యాడర్‌కు అంతుచిక్కని ప్రశ్నగా మారిందట.

కోవిడ్ విజృంభణ సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టే విషయంలో, ఇద్దరి నేతల మధ్య విభేధాలు స్పష్టం అయ్యాయట. కోనసీమలోని కేజి బేసిన్‌లో చమురు అన్వేషణ చేస్తున్న ఓఎన్జీసీ సంస్థ ద్వారా, అక్కడి ప్రజలకు నిత్యావసరాలు అందించాలని కోరారట ఎంపీ అనురాధ. కోనసీమలోని సుమారు 4 లక్షల మందికిపైగా ప్రజలకు సహాయాన్ని అందించాలని కోరారట. అయితే సదరు సంస్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మాత్రమే, నిత్యావసరాలు అందించి, ఆ తర్వాత సీఎం సహాయ నిధికి కొంత సొమ్ము అందించాలని విశ్వరూప్ కోరారని సమాచారం. దీంతో ఓన్జీసీకి ఇరకాటమైంది. ఇద్దరు నేతల భిన్నమైన ప్రతిపాదనలు కాదనలేక, అవుననలేక, అసలు నిత్యావసరాలు అందించాలనే ప్రపోజల్‌నే నిలిపివేశారట ఆ చమురు సంస్ధ ప్రతినిధులు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరిందంటున్నారు స్థానిక నాయకులు. ఇద్దరు చేసిన ప్రతిపాదనలు ప్రజలకు మేలు చేసేవే అయినా, పరస్పరం పొంతన లేకుండా వ్యవహరించడంతో, అసలు అది అమలు కాకుండా పోయిందని టాక్ నడుస్తోంది కోనసీమలో. అయితే ఇద్దరు ముఖ్యనేతల మధ్య కొనసాగుతున్న ఇగో ఫ్యాక్టర్ పక్కనపెడితే బాగుంటుందని అనుకుంటున్నారట అక్కడి ద్వితీయశ్రేణి నాయకులు. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేదెవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందట. ఇటువంటి చిన్న చిన్న పొరపచ్చాలను అధిగిమించేందుకు అధిష్టానమే చొరవ తీసుకోవాలని కోరుతున్నారట కార్యకర్తలు.


Show Full Article
Print Article
Next Story
More Stories