ఎమ్మెల్యేని మోసగించబోయి.. అడ్డంగా దొరికిపోయిన ఘరానా మోసగాడు !

ఎమ్మెల్యేని మోసగించబోయి.. అడ్డంగా దొరికిపోయిన ఘరానా మోసగాడు !
x
Highlights

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని చీట్ చేయ‌బోయి ఓ కేటుగాడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ప్ర‌భుత్వ నిధుల పేరుతో టోకరా వేయ‌బోయి‌ విశాఖకు చెందిన‌...

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని చీట్ చేయ‌బోయి ఓ కేటుగాడు క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ప్ర‌భుత్వ నిధుల పేరుతో టోకరా వేయ‌బోయి‌ విశాఖకు చెందిన‌ జగ్జీవన్‌రావు అనే వ్య‌క్తి పోలీసుల‌కు చిక్కాడు. ఎమ్మెల్యే విడదల రజిని గుంటూరులోని రవీంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమెకు మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఫోన్‌ చేసి తన పేరు బాబూ జగ్జీవన్‌రావు అని, సచివాలయంలో పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. నియోజకవర్గానికి రూ.2 కోట్ల వంతున కొవిడ్‌ నిధులు మంజూరయ్యాయని, ఇవి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల వంతున రుణాల రూపంలో ఎనిమిది మందికి మంజూరు చేస్తారని నమ్మబలికాడు. ఒక్కో లబ్ధిదారుడు రూ.50,000 వంతున నగదు చెల్లించాలని, ఎనిమిది మందికి కలిపి రూ.4 లక్షలు ఆర్టీజీఎస్‌ ద్వారా అర గంటలో తన ఖాతాకు పంపాలని, లేదంటే రుణాలు చిలకలూరిపేట నియోజకవర్గానికి దక్కకుండా పోతాయని చెప్పాడు.

నిందితుడి మాటలు నమ్మిన ఎమ్మెల్యే రూ. 4 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. అయితే, నిందితుడు పలుమార్లు జగన్ పేరును ప్రస్తావించడం, ఆయనే మీతో మాట్లాడమన్నారని చెప్పారని చెప్పడంతో ఎమ్మెల్యే రజినీకి అనుమానం వచ్చింది. దీంతో సీఎం కార్యాలయంలోని అధికారులను ఆరా తీయగా, జగ్జీవన్‌రావు పేరుతో ఎవరూ లేరని తేలింది. దీంతో ఆమె డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడు జగ్జీవన్‌రావు విశాఖలో ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలిసిన రజని తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అనంతరం పట్టాభిపురం ఎస్సై సత్యనారాయణతోపాటు మరో ముగ్గురు పోలీసులు విశాఖ వెళ్లి పరవాడ పోలీసుల సాయంతో నిందితుడు బాబూ జగ్జీవన్‌రావును అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories