ఇంద్రకీలాద్రిపై బెంబేలెత్తిస్తోన్న కొండచరియలు.. సీఎం కోసం రాకపోకలు నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం

ఇంద్రకీలాద్రిపై బెంబేలెత్తిస్తోన్న కొండచరియలు.. సీఎం కోసం రాకపోకలు నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం
x
Highlights

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. మౌన స్వామి గుడి దగ్గర పెద్దపెద్ద కొండ రాళ్లు విరిగి పడ్డాయి. దాంతో, పలువురు భక్తులకు స్వల్ప...

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. మౌన స్వామి గుడి దగ్గర పెద్దపెద్ద కొండ రాళ్లు విరిగి పడ్డాయి. దాంతో, పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మరికాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సమయంలో కొండచరియలు విరిగిపడటంతో భక్తులు అపశృతిగా భావిస్తున్నారు.

భారీ కొండ చరియలు విరిగిపడటంతో మౌన స్వామి గుడి దగ్గర రేకుల షెడ్డు మొత్తం ధ్వంసమైంది. రేకులు తుక్కుతుక్కయ్యాయి. ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి రానున్న నేపథ్యంలో కొండపైకి రాకపోకలను నిలిపివేశారు. దాంతో, ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఇంకా ప్రమాదం పొంచే కనిపిస్తోంది. భక్తులను కొండ చరియలు బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలకు కొండ నాలుగు అంగుళాల మేర బీటలు వారడంతో చిన్నచిన్న రాళ్లు దొర్లి పడుతూనే ఉన్నాయి. దాంతో, ఎప్పుడు ఏ కొండచరియలు విరిగి పడతాయోనని భక్తులు వణికిపోతున్నారు. ప్రమాదం కారణంగా సీఎం పర్యటన కాస్త ఆలస్యంగా సాగే అవకాశం కనిపిస్తోంది. సీఎం ఘాట్ రోడ్ ద్వారా కాక మహామండపం లిఫ్ట్ మార్గాన కొండపైకి చేరుకోనున్నట్లు సమాచారం.

భారీవర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా కొండ చెరియలు విరిగిపడుతున్నా అధికారులు ప్రమాద హెచ్చరిక బోర్డు మాత్రం పెట్టి ఊరుకున్నారు. కొన్నాళ్ల క్రితం కొండలకు వలలతో నెట్ లాగా కట్టే ప్రయత్నం చేసినా దానిని తూతూ మంత్రంగా చేసి వదిలేశారు. ఇప్పుడు సీఎం పర్యటన కావడంతో హడావుడి ఏర్పాట్లతో ముగించారు. సీఎం రాకకు కొద్ది నిమిషాల ముందు ఈ ప్రమాదం జరగడంతో భక్తులు బెంబేలెత్తుతున్నారు. నాలుగు రోజుల నుంచి మట్టి, బండరాళ్లు దొర్లి పడుతున్నా అధికారులు పట్టించుకోటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కొండచరియలు విరిగి పడిన ఘటనలో శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విధుల్లో కనిపించకుండా పోయిన సిబ్బంది పై ఆరా తీస్తున్నారు. కొండ చరియలు పూర్తిగా తొలగిస్తే గానీ క్లారిటీ వచ్చే ఆస్కారం లేదు. కొండ రాళ్లు విరిగి పడిన చోట షెడ్డు పూర్తిగా విరిగిపోయింది. అదే స్థానాన్ని మీడియా పాయింట్ గా అధికారులు కేటాయించారు. ఘాట్ రోడ్ లో ప్రమాదం కారణంగా దుర్గమ్మ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories