కోడెల రాజకీయ మజిలీలో టెన్షన్‌ పెట్టిస్తున్న కొత్త అంశమేంటి?

కోడెల రాజకీయ మజిలీలో టెన్షన్‌ పెట్టిస్తున్న కొత్త అంశమేంటి?
x
Highlights

ఆయన అంతెత్తు ఎగిరారు. ఒక్క దెబ్బతో నేలను చూస్తున్నారు. తిరుగులేని నాయకుడని అనిపించుకున్నారు. తరిగిపోతున్న తన రాజకీయ ప్రతిష్టను చూసి, కుమిలిపోతున్నారు....

ఆయన అంతెత్తు ఎగిరారు. ఒక్క దెబ్బతో నేలను చూస్తున్నారు. తిరుగులేని నాయకుడని అనిపించుకున్నారు. తరిగిపోతున్న తన రాజకీయ ప్రతిష్టను చూసి, కుమిలిపోతున్నారు. హుందాగా సాగాల్సిన రాజకీయ జీవితంలో, వక్రదారులు పట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూలమ్మిన చోటే, కట్టెలమ్మాల్సిన దారుణమైన పరిస్థితి. తన రాజకీయ మజిలీ ఇలా అవుతున్నా ఆయనకు మాత్రం ఒక దిగులు వెంటాడుతోందట. ఒక బెంగ నిద్రపట్టనివ్వడంలేదట. ఆ బెంగ ఏంటంటే, తన రాజకీయ వారసత్వాన్ని అందుకోవాల్సిన టైంలో, కుమారుడు కూడా పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కోవడం. అందుకే కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆయనకు తెగ బెంగ పట్టుకుందట. ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన కొడుకు పొలిటికల్‌ లైఫ్ ఎందుకు గందరగోళంలో పడింది..?

ఆర్డర్‌ ఆర్డర్‌ అంటూ లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకే ఆర్డర్‌ వేశారు. అరిస్తే కళ్లు ఉరిమి చూశారు. నిరసన చేస్తే, సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజాప్రతినిధులను గడగడలాడించారు. కానీ వన్‌ఫైన్ డే, ఆయన ఓడిపోయారు. అధికారం పోయింది. జీవితమే రివర్సయిందన్నట్టుగా, మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద రావు పరిస్థితి కనిపిస్తోంది.

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా రికార్డుల్లోకెక్కిన కోడెల, ఏ క్షణాన ఆ కూర్చిని కోల్పోయారో, అప్పటి నుంచి ఆయనకు బ్యాడ్‌టైం ఫేవికాల్‌‌లా అతుకున్నట్టు కనిపిస్తోంది. స్పీకర్‌గా విచక్షణాధికారాలను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికార పార్టీ, ఇప్పటికే విచారణలు చేస్తోంది. కొడుకు, కుమార్తెలు కే ట్యాక్స్‌ వసూలు చేస్తూ, అవినీతిలో చెలరేగిపోయారని కేసులు కూడా ఫైల్‌ అయ్యాయి. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు, సొంత భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భారీ ఎత్తున అద్దె వసూలు చేశారన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తే, అసెంబ్లీ ఫర్నీచర్‌ వివాదం కోడెల పరువును పాతాళానికి తొక్కేసిందన్న చర్చ, సొంత పార్టీలోనే జరుగుతోంది.

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఫర్నీచర్‌ను అమరావతికి తరలించే క్రమంలో, స్పీకర్‌గా కోడెల తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కొత్త బిల్డింగ్‌లో ఫర్నీచర్‌ మొత్తం కొత్తదే వేశారు కాబట్టి, ఇక హైదరాబాద్‌లో కొన్న ఫర్నీచర్‌ మొత్తం తన ఇంటికి, క్యాంపు కార్యాలయానికి తరలించుకున్నారు కోడెల. తరలిస్తే తరలించుకున్నారు, కనీసం మొన్నటి ఎన్నికల ముందు ఆ ఫర్నీచర్‌ను వెనక్కి ఇచ్చేసి వుంటే, ఏ గొడవ జరిగేది కాదు. హుందాగా ఉండేది. తమ ప్రభుత్వం మారి, వైసీపీ సర్కారు ఏర్పడిన మూడు నెలలకు గానీ, ఫర్నీచర్ విషయంపై అసలు కదలికలేదు. చివరికి వైసీపీ నేతలు స్పందించి, అసెంబ్లీ కార్యాలయ అధికారులు తుళ్లూరు పీఎస్‌లో ఫిర్యాదు చేస్తేనే గానీ, కోడెల ఇంట్లో లారీలకొద్దీ తిష్టవేసిన ఫర్నీచర్‌కు‌ కదలిక రాలేదు. అవినీతికి, అధికార దుర్వినియోగానికి కోడెల పాల్పడారన్న వైసీపీ ఆరోపణలకు, కోడెల తీరు మరింత బలాన్నిస్తోందన్న చర్చ జరుగుతోంది. దీనికితోడు, ఫర్నీచర్‌ కొనుగోళ్లలో అసలు ధరకన్నా అంచనాలు పెంచేసి, భారీ ధరకు కొన్నారన్న ఆరోపణలూ కోడెలపై వెల్లువెత్తుతున్నాయి.

అసెంబ్లీ ఫర్నీచర్‌పై కోడెల కొన్ని అబద్దాలు చెప్పారనడానికి సాక్ష్యాలు చూపిస్తున్నారు వైసీపీ నేతలు, అధికారులు. ఖరీదైన ఫర్నీచర్‌ తన కుమారుడి మోటార్‌ షోరూంలో ప్రత్యక్షం కావడం, అందర్నీ షాక్‌కు గురి చేసింది. కోడెల చెప్పినట్టు అసెంబ్లీ ఫర్నీచర్‌ తన క్యాంపు కార్యాలయంలో ఉంటే, ఒకలా ఉండేది, కానీ కొడుకు షోరూంలో ప్రభుత్వ ఫర్నీచర్‌ ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా తిరుపతిలో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ను కోడెల బినామీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు కోడెల. ఇప్పుడాయనకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గంలోనే, అసంతృప్తి జ్వాల భగ్గుమంది. ఆయనను తప్పిస్తారా లేదంటే ఉద్యమం చేయాలా అని, ఏకంగా చంద్రబాబు దగ్గర పంచాయతీ పెట్టారు. తనకెంతో సన్నిహితుడైన మాజీ స్పీకర్‌ను ఏమీ అనలేక, కార్యకర్తల గోడు తోసిపుచ్చలేక, సతమతమైపోతున్నారు చంద్రబాబు.

స్పీకర్‌గా ఉన్నప్పుడు అసెంబ్లీలో తమ సభ్యులను రాచిరంపాన పెట్టారని, ఇప్పటికీ వైసీపీ నేతలు కోడెలపై రగిలిపోతున్నారు. తనపై ఆగ్రహంతో ఊగిపోతున్న వైసీపీ అధికారంలోకి రావడంతో, జాగ్రత్తగా ఉండాలని మరిచిన కోడెల, వరుస తప్పులు చేస్తూ, వారికి మరిన్ని ఆయుధాలిస్తున్నారని, సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. కోడెల నిజాయితీగా ఫర్నీచర్‌ టైంలోగా ఇచ్చేసి వుంటే, ఇంత రాద్దాంతం జరిగేది కాదని, పార్టీ పరువు కూడా పోయేది కాదని, టీడీపీ నేత వర్ల రామయ్య బాహాటంగానే వ్యాఖ్యలు చేశారంటే, కోడెల మీద సొంత పార్టీలోనే ఎలాంటి సానుభూతి లేదన్నది అర్థమవుతోంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన కోడెల, దాదాపు తన రాజకీయ ఆఖరి మజిలీలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటి కంటే, కోడెలను వెంటాడుతున్న మరో బాధ, తన కుమారుడు, కుమార్తె రాజకీయ వారసత్వం ఏమవుతుందోనన్న బెంగ.

కోడెల తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో మంత్రిగా సేవలందించారు. నవ్యాంధ్రకు తొలి స్పీకర్‌ అయ్యారు. ఇంకెన్నో పదవులు చేపట్టారు. గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు తన రాజకీయ వారసత్వాన్ని అందుకోవాల్సిన కొడుకు, కుమార్తెలు, తనతో పాటు తీవ్ర వివాదాల్లో ఇరుక్కోవడం, కోడెలను తీవ్రంగా వేధిస్తోందట. కుమారుడు శివరాం, ఇప్పటికే సత్తెనపల్లిలో యువ నాయకుడిగా ఎస్టాబ్లిష్‌ అయ్యేందుకు చేయని ప్రయత్నంలేదు. అయితే కే ట్యాక్స్, ఫర్నీచర్‌ కేసు, ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు శివరాంను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన కుమారుడిపైనా పడుతున్న అవినీతి మరకలను చూసి, కోడెల దిగాలు పడుతున్నారట. రాజకీయంగా కొడుకు భవిష్యత్తేంటని బెంగ చెందుతున్నారట. మొత్తానికి సీనియర్‌ రాజకీయ నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన కోడెల, దాదాపు తన వారసత్వాన్ని కుమారునికి అప్పగించే టైంలో, ఇబ్బందుల్లో పడటం, ఆయన అభిమానులను సైతం కలచివేస్తోందట. చూడాలి, కోడెల ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్ ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories