మృతి చెందిన జన సైనికులకు రూ.12.5 లక్షల సాయం

Arun Chilukuri
Published on: 4 Sept 2020 12:23 PM IST
మృతి చెందిన జన సైనికులకు రూ.12.5 లక్షల సాయం
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ బ్యానర్‌ను కడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించిన ముగ్గురు అభిమానుల కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పార్టీ ముందుకొచ్చింది. మరణించిన వారి కుటుంబాలకు పార్టీతోపాటు మెగా హీరోలు, పవన్‌ కల్యాణ్‌తో సినిమాలు నిర్మిస్తున్న సంస్థల ద్వారా ఒక్కొక్కరికి రూ.12.5 లక్షల చొప్పున అందిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఆర్థిక పరిహారాన్ని ప్రకటించారని, రామ్ చరణ్ రెండున్నర లక్షల రూపాయలు, అల్లు అర్జున్ రెండు లక్షల రూపాయలను చెల్లిస్తారని అన్నారు. అలాగే ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోన్న వకీల్ సాబ్ యూనిట్, పవన్ కల్యాణ్‌తో తమ తదుపరి సినిమాలను ప్రకటించిన మైత్రీ మూవీస్, మెగా సూర్య ప్రొడక్షన్స్, ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story