Andhra Pradesh: పీకేపై మంత్రుల వేట

Kapu Ministers Slam Pawan Kalyan
x

Andhra Pradesh: పీకేపై మంత్రుల వేట

Highlights

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అదే సామాజికవర్గానికి చెందిన ఏపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు.

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అదే సామాజికవర్గానికి చెందిన ఏపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. అయితే ఇంతలా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ విమర్శించడం వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ముఖ్యంగా కాపు మంత్రులనే అందుకు వినియోగించడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కొందరు మంత్రులను ఇందుకే వాడుకున్నారని ఇప్పుడు మరికొందరికి అదే బాధ్యతలు అప్పగించారంటున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు అంబటి, దాడిశెట్టి, గుడివాడ ముగ్గురు కూడా పవన్ కల్యాణ్ ను విమర్శించడానికి పోటీ పడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు పవన్ కు లేదంటూనే వ్యక్తిగత విమర్శలకు పదనుపెడుతున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఏలూరు సభ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ సహా కొందరు మంత్రులు, వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా దూషించడంపై పవన్ మండిపడ్డారు. రైతు సమస్యలను ఎత్తిచూపితే తనను దత్తపుత్రుడని అన్నారని ఇంకోసారి దత్తపుత్రుడు అంటే సీబీఐ దత్తపుత్రుడు జగన్ అనాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పైనా, చంద్రబాబుపైనా ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు.

కాపుల ఓట్లు చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు జలవనరుల మంత్రి అంబటి రాంబాబు. ర్యాంబో రాంబాబు అని విమర్శించలేదా అన్నారు అంబటి. పవన్‌కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని తమకు సినిమా తీయడం కూడా వచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ హరహర వీరమల్లు కాదు చంద్రబాబు విసిరిన విల్లు అంటూ ఎద్దేవా చేసారు మరో మంత్రి దాడిశెట్టి రాజా. ప్యాకేజీ స్టార్ పవన్ రీల్ హీరో అయితే పీపుల్స్ స్టార్ జగన్ డ్డి రియల్ హీరో అన్నారు రాజా. రాజకీయ జీవితంలో విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ పాలన జనరంజకంగా ఉంటే రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటానన్న పవన్ ఇప్పుడెందుకు విమర్శిస్తారంటూ మండిపడ్డారు అమర్నాథ్. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు.

మొత్తంగా ఏపీ మంత్రుల తీరుపై జనం నవ్వుకుంటున్నారు. మొన్నటి వరకు ఇదే పాత్రను లీడ్ రోల్ లో పోషించిన పేర్నినాని, కన్నబాబు స్థానంలో కొత్త మంత్రులు ఆ బాధ్యతలు చేపట్టారంటున్నారు. వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను అనవసరంగా ఆక్షేపిస్తున్నారని ప్రజల పక్షాన పోరాడితే ఉలుకెందుకంటున్నారు. మొత్తంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు వల్ల పార్టీకి ఒరిగేదేముందన్న అభిప్రాయం విన్పిస్తోంది. పవన్ కల్యాణ్ ను అనవసరంగా విమర్శించడం వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం కలగదని జనసైనికులు మండిపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories