ఒకప్పుడు కళకళ..ఇప్పుడెందుకు వెలవెల?

ఒకప్పుడు కళకళ..ఇప్పుడెందుకు వెలవెల?
x
Highlights

ఎన్టీఆర్‌ హయాం నుంచీ రాజకీయాల్లో కళకళలాడారు ఆ నాయకుడు. పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ కీలక పదవులతో కోలాహలమైన పాలిటిక్స్‌ నడిపారు. ఇప్పుడా నాయకుడి...

ఎన్టీఆర్‌ హయాం నుంచీ రాజకీయాల్లో కళకళలాడారు ఆ నాయకుడు. పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ కీలక పదవులతో కోలాహలమైన పాలిటిక్స్‌ నడిపారు. ఇప్పుడా నాయకుడి రాజకీయం కళ తప్పింది. వెలవెలబోతోంది. ఎందుకిలా?

కిమిడి కళా వెంకటరావు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లలో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ ఛైర్మన్ గా అనేక పదవులను నిర్వహించిన నేత. అంతేకాదు నందమూరి, నారా కుటుంబాల తర్వాత తెలుగుదేశం పార్టీలో తొలి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది ఈయనకే. అయితే ఇప్పుడు ఆ నాయకుడు ఒంటరి అయిపోతున్నారట. ఒకప్పుడు సిక్కోలు రాజకీయాలను శాసించిన కళాను, ఇప్పుడు ఆ జిల్లాలోని నాయకులే పట్టించుకోవడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే దీనికి అక్కడి నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరే కారణమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో కిమిడి, కింజరాపు, గౌతు కుటుంబాలు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీరి మధ్య వర్గపోరు ఉందనే విషయం అనేక సందర్భాలలో బహిర్గతమైంది. టిడిపి వ్యవస్థాపక అధ్యక్ష్యుడు ఎన్టీఆర్‌కు విధేయుడిగా, కళా వెంకట్రావుకు అప్పట్లో పార్టీలో మంచి గుర్తింపు ఉండేది. ఎన్టీఆర్ మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం దివంగత నేత ఎర్రం నాయుడుకు దక్కిందనే చర్చ కూడా నాడు జరిగింది. దీని వల్లే ఇరువురి మధ్య వర్గపోరు మొదలయ్యిందని, అది చినికి చినికి గాలివానగా మారిందని చెప్పుకుంటారు. దీనికి తోడు కింజరాపు కుటుంబం రాజకీయ ఆరంగేట్రంలో, గౌతు కుటుంబ పెద్ద, సర్దార్ గౌతు లచ్చన్న పాత్ర ఉందని చెప్పుకుంటారు. అందువల్లే ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం దశాబ్దాలు గడిచినా అలానే ఉందని అంటుంటారు. అయితే ఎర్రం నాయుడు అకాల మరణానంతరం కిమిడి, కింజరాపు వర్గపోరు మరుగున పడిపోయిందని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ ఆ వర్గపోరు కొనసాగుతూనే ఉందని టాక్.

ఇదిలావుంటే, తాజా పరిణామాలు కళా ఒంటరి అవుతున్నారనే చర్చకు దారి తీసేలా మారాయట. ఇప్పటికే ఎన్నికల తర్వాత గడిచిన కొద్దికాలంగా చడీ చప్పుడు లేకుండా ఉన్న తెలుగుదేశం పార్టీలో, ఒక్కసారిగా చోటుచేసుకున్న అనూహ్య మార్పులు, కళాలో కళ లేకుండా చేశాయి. రాష్ట్ర అధ్యక్ష పీఠం మార్పు, కళాను అసంతృప్తికి గురి చేసిందట. అంతేకాదు, శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్షుడిగా కూనరవిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ పరిణామాలు ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కళా చుట్టూ తిరిగినవారు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకోవాలని ప్రదిక్షిణలు చేసిన వారు కానీ, ఇప్పుడు అస్సలు అటువైపు చూడటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట.

దీనికి తోడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని కళా, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అందుబాటులో లేకపోవడంపై క్యాడర్ లోనూ నైరాశ్యం నిండుకుందట. ఏ కొద్దిపాటి సమయం దొరికినా రాజాంకు వెళ్లిపోతున్నారట. దీంతో తన నియోజకవర్గమైన ఎచ్చెర్ల వైపు కనీసం చూడటంలేదనే నిరాశ అనుచరుల నుంచి వ్యక్తమవుతోందట. దీంతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను తెలుగు తమ్ముళ్ళకు అప్పజెప్పినా, తమ నాయకుడు లేకుండా తామేం చెయ్యగలమని సైలెంట్ అయిపోతున్నారట. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రానున్న స్థానిక ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలంటే, సీనియర్ నాయకుడిగా కళా అనుభవం అక్కడ అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.

మొత్తానికి నాయకుడిగా పార్టీలో, మంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కళకు, ఇప్పుడు పరిస్థితులేమీ అనుకూలించడం లేదు. రానున్న రోజుల్లో ఆయన ఇంకెలాంటి అనుభవాలు, పరిణామాలు, ఎగుడుదిగుళ్లు ఎదుర్కొంటారోనని, ఆయన క్యాడర్‌ కొంత ఆందోళనలో వుంది. అయితే, ఎవ్వరూ నిరాశపడొద్దు, మనకూ ఓ టైం వస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట కళా. చూడాలి, కళ తప్పిన కళా వెంకటరావు రాజకీయం, ఎప్పుడు మళ్లీ కళకళలాడుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories