రసవత్తరంగా మారిన కడప జిల్లా పంచాయతీ ఎన్నికలు

రసవత్తరంగా మారిన కడప జిల్లా పంచాయతీ ఎన్నికలు
x

కడప పంచాయతీ ఎన్నికలు 

Highlights

*6 చోట్ల వైసిపి సానుభూతి పరుల ఏకగ్రీవం *తమవాళ్లను నెగ్గించుకునేందుకు ఎమ్మెల్యేల కసరత్తు *నిమ్మగడ్డ పర్యటనతొ మారిన రాజకీయం

కడప జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. అధికార, విపక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. సీఎం సొంత జిల్లాలో ఎలాగైనా పట్టుతప్పకూడదన్న ప్రయత్నంలో అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇదే జిల్లాలోనే తమ పోరాట పటిమను చూపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది.

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఓ వైపు అదికార పార్టీ అధికారంలో ఉండటంతో ఏకగ్రీవాల వైపు అడుగులేస్తుంటే..... నిన్న మొన్నటి వరకు కనిపించకుండాపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఎన్నికల బరిలోకి దిగడంతో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అంతేకాకుండా కడప జిల్లా సిఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ ఎన్నికలు మరింత హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అదిపత్యం చాటుకోవాలన్నది మొదటి నుంచి అధికార పార్టీ వ్యూహం. ఇందులో భాగంగానే ఎన్నికల్లోను తమ పార్టీ సానుభూతి పరులనే ఏకగ్రీవం చేసుకోవాలన్న లక్ష్యంతొ కసరత్తు చేశారు. కానీ ఎన్నికల కమిషన్ తో వివాదం తలెత్తిన నేపధ్యంలో అధికార పార్టీకి అనుకొని పరిస్ధితులు ఎదురయ్యాయి.

ఈసీ నిమ్మగడ్డ రమేష్ కడపకు వచ్చి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అధికార యంత్రాంగానికి దిశానిర్ధేశనం చేశారు. అనవసర ఏకగ్రీవాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీంతో టిడిపికి ఆక్సిజన్‌ అందినట్లయింది. దీంతో ఎన్నికలే వద్దకున్న నేతలు కూడా తమ అనుచరులను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. ఈ పరిణామంతో అధికార పార్టీని ఢోలాయమానంలో పడింది.

కడప జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 206 పంచాయతీల్లో సర్పంచి కోసం 1,477 నామినేషన్లు వేయగా అందులో 57 తిరస్కరించారు. 2068 వార్డులకు 4265 నామినేషన్లు రాగా 112 నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో కేవలం ఆరు పంచాయతీలకు సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ కూడా వైసీపీ సానుభూతి పరులవే కావడం గమనార్హం.

తొలి విడత ఎన్నికల జరగనున్న నియోజకవర్గాల్లో చాలా వరకు టిడిపి పోటీ చేయదనుకుంటే .... దాదాపుగా అన్ని చోట్ల పోటీలోకి దిగడం అధికార పార్టీని ఆలోచింపచేసేలా చేసిందని చెప్పవచ్చు. ఎక్కడొ ఒక చోట ఎన్నికలు జరుగుతాయి... చాలా వరకు ఏకగ్రీవాలు చేసుకోవచ్చుకున్న అధికార పార్టీకి ఇలాంటి పరిస్ధితి మింగుడుపడని పరిణామంగా మారింది. తొలి విడతలొనే ఇలా ఉంటే.... మిగిలిన మూడు విడతల్లో పరిస్ధితి ఇంతకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్నది రాజకీయ వర్గాల సమాచారం. పలుచోట్ల వైసీపీలోనే రెబల్స్ పోటీ చేస్తుండటం కూడా ఆ పార్టీలో గుబులు రేపుతోంది.

వాస్తవానికి కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ సానుభూతి పరులదే అదిపత్యం ఉంటుందని అందరు భావించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇన్ చార్జులు, నేతలందరు పార్టీ క్యాడర్ కు దూరంగానే ఉంటు వచ్చారు. ఓ వైపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా .... ఎన్నికలు జరుగుతాయో లేదోనన్న అనుమానంతో కదలిక లేకుండా ఉండిపోయారు. మరో వైపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం రాష్ర్ట స్థాయిలో యాక్టీవ్ గా కనిపించినా జిల్లా నేతలు మాత్రం స్ధబ్దుగానే ఉండిపోయారు. కానీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఎన్నికలకు అనుమతివ్వడంతో జిల్లా టిడిపి నేతల్లోను ఒక్క సారిగా ఉత్సాహం కనిపించింది. అధినేత ఆదేశాల మేరకు హుషారైనా నేతలు జిల్లాకు వచ్చి ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడు జమ్మలమడుగు, పులివెందులలో మినాహా అన్ని నియోజకవర్గాల్లోను అన్ని స్థానాల్లో అభ్యర్ధులను పోటీ చేయిస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల ద్వారా తిరిగి పట్టు సాధించాలన్న లక్ష్యంతో ముందకెళ్తున్నారు. కానీ అధికార పార్టీ ఎంత వరకు ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల విజయవకాశాలకు అడ్డుకట్ట వేస్తుంది..... ఎన్నిక జరిగితే ఓటర్లను ఏ విధంగా తమ వైపు తిప్పుకుంటారోనన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో వెనకబడితే .... సిఎం సొంత జిల్లాలో వెనకబడిన ఎమ్మెల్యేలుగా ముద్రపడటమే కాకుండా రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న భయం అధికార పార్టీ ఎమ్మెల్యేలో నెలకొంది. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరువు నిలుపుకుంటారో ..... ప్రతిపక్ష పార్టీ నేతలు పట్టు సాధిస్తారో ఎన్నికల వరకు వేచిచూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories