తృణమూల్‌ కూటమిలో ఏపీ సీఎం చేరబోతున్నారా?

Jagan Join Hands With Trinamool Congress
x

తృణమూల్‌ కూటమిలో ఏపీ సీఎం చేరబోతున్నారా?

Highlights

Jagan: తెలుగు రాష్ట్రాలపై తృణమూల్‌ అధినేత్రి కన్నేశారా? ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో సరికొత్త వ్యూహం రచించబోతున్నారా?

Jagan: తెలుగు రాష్ట్రాలపై తృణమూల్‌ అధినేత్రి కన్నేశారా? ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో సరికొత్త వ్యూహం రచించబోతున్నారా? వరుసగా మూడోసారి పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన మమత తెలుగు రాష్ట్రాలపై ఎందుకు ఫోకస్‌ పెట్టారు? దేశవ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న దీదీ రాజకీయ వ్యూహాలకు అందుకే పదును పెడుతున్నారా? మూడోసారి ఎన్నికల్లో తాను గెలవటానికి కారణమైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌‌తో రాయబారం నెరపబోతున్నారా? అసలు తెలుగు రాష్ట్రాలపై మమతకు ఉన్న ఆశేంటి అధినేత్రి ఆశయమేంటి?

ప్రధాని నరేంద్రమోడీపై దండయాత్రే అంటూ ప్రకటించిన తృణమూల్‌ అధినేత్రి పనిలో పనిగా, ఏపీ సీఎం జగన్ మావాడే అంటూ తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారట. 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికల్లా బీజేపీని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో పావులు కదుపుతున్న మమత బీజేపీయేతర పార్టీ అధినేతలను కలిసి తన ఫోకస్‌ను తెలుగు రాష్ట్రాలపై కూడా పెట్టారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

2018లో థర్డ్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ భారీగానే పావులు కదిపారు. కేంద్రంలో బీజేపీ-కాంగ్రెస్‌యేతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో బీజేపీ, కాంగ్రెస్యేతర పార్టీ నాయకులను కలిశారు. ఆ సమయంలో మమతా బెనర్జీ కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా ఎలా అనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. కానీ అలాంటి మరో ప్రయత్నమే దేశ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతోందట. ప్రస్తుతం బీజేపీతో జతకట్టనప్పటికీ కేంద్రంలో మద్దతుగా ఉంటున్న వైసీపీ, బీజేడీలాంటి పార్టీలకు కూడా మమతా డోర్స్ ఓపెన్ చేశారట. ఆ రెండు పార్టీలు కూడా బీజేపీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారట దీదీ.

సోనియా, రాహుల్, కేజ్రీవాల్‌తో మమతాబెనర్జీ భేటీ అయినప్పుడు వారంతా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్, ఒడిషా సీఎం, బీజేడీ నేత నవీన్ పట్నాయక్ గురించి ప్రస్తావించారట. మోడీ ప్రభుత్వానికి సరైన సమయంలో జగన్ పార్టీ, నవీన్ పట్నాయక్ పార్టీలు అండగా నిలుస్తున్న విషయం చర్చకు వచ్చిందట. అయితే జగన్‌తో, నవీన్ పట్నాయక్‌లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న దీదీ భవిష్యత్తులో వీరు కూడా తమతో కలిసొస్తారనే నమ్మకంతో ఉన్నారట. దీనికి తోడు, పార్లమెంటులో వైసీపీ ఫ్లకార్డులతో ప్రదర్శిస్తుందంటే ఆ పార్టీ కూడా మోడీ సర్కార్‌ను దూరం చేసుకుంటుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

అటు, త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ రాష్ట్రాల్లో పోటీకి సిద్ధవుతున్న మమత ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గురించి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల కోసం జగన్ ప్రశాంత్‌కిషోర్ టీంతో చేసుకున్న ఒప్పందాన్నే రాయబారిగా వాడుకునేందుకు రెడీ అవుతున్నారట. పీకే వ్యూహాలు జగన్‌తో కలసి నడిచేందుకు ఉపయోగపడతాయని మమత బలంగా నమ్ముతున్నారట. ఈ మేరకు వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న పీకే అడుగులు కూడా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో పీకే వ్యూహాలు కీలకం కానుండగా, పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రాంతీయ పార్టీలతో కలసి కీలక పాత్ర పోషించేందుకు మమత సమాయత్తం అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈరోజు కాకపోయిన రేపైనా వారంతా తమతో కలిసి వస్తారనే విశ్వాసంతో ఉన్న తృణమూల్‌ టీమ్‌ తామంతా ఒకే తాటిపైకి వచ్చామంటే ఒక దళంలా తయారవుతామని చెబుతోంది. మరి మమత ఆశయం నెరవేరుతుందో జగన్‌ తృణమూల్‌ కూటమిలో చేరుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories