
జగన్ 2.0 వేరుగా ఉంటుంది. మరో 30 ఏళ్లు ఏపీని ఏలుతాం. గతంలో ప్రజల కోసం పనిచేశా. ఇక కార్యకర్తలకు ఏం చేస్తానో చూస్తారని వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్...
జగన్ 2.0 వేరుగా ఉంటుంది. మరో 30 ఏళ్లు ఏపీని ఏలుతాం. గతంలో ప్రజల కోసం పనిచేశా. ఇక కార్యకర్తలకు ఏం చేస్తానో చూస్తారని వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి 5న విజయవాడ వైఎస్ఆర్‌సీపీ కార్పోరేటర్లు, నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారానికి దూరమైన తర్వాత జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
పార్టీ క్యాడర్ ను కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారా? విజయసాయిరెడ్డి లాంటి నాయకులు పార్టీని వీడినా నష్టం లేదని చెప్పే ప్రయత్నం చేశారా? భవిష్యత్తు కోసం జగన్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు? జగన్ వ్యాఖ్యలపై టీడీపీ రియాక్షన్ ఏంటి? ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు జగన్ ఏమన్నారంటే?
విదేశీ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన జగన్ విజయవాడకు చెందిన కార్పోరేటర్లతో తొలిసారిగా సమావేశమయ్యారు. కార్యకర్తలను చంద్రబాబు పెడుతున్న ఇబ్బందులను చూశా. భయపడవద్దని భరోసా ఇచ్చారు.
తనను 16 నెలల జైల్లో పెట్టారు. బయటకు వచ్చా.. ముఖ్యమంత్రిని కాలేదా? అని ఆయన అన్నారు. మీపై కేసులు పెడితే మూడు నెలలకు బయటకు వస్తారు. మీకు మంచి చేసిన వారిని, చెడు చేసినవాళ్లను గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాగా చెప్పారు.
కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకేనా?
వైఎస్ఆర్సీపీని 2011 మార్చి 12న వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధులు గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ గెలుస్తోందని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు భావించాయి. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.
2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ, జనసేన శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారని అప్పట్లో ఆ పార్టీలు ఆరోపలు చేశాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 50 రోజులకుపైగా జైల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ అధికారానికి దూరమయ్యారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు,నాయకులపై కేసులు పెడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులతో కొందరు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే 2029 వరకు వెయిట్ చేయాలి. అప్పటివరకు పార్టీ క్యాడర్ ను కాపాడుకోనేందుకు జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీనియర్ జర్నలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు అన్నారు.
2019 -2024 మధ్య ఐదేళ్లు మినహా 2011నుంచి ఆ పార్టీ అధికారానికి దూరంగానే ఉంది. విపక్షంలో ఉన్న సమయంలో పార్టీని కాపాడుకోవడం కష్టం. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అలా మాట్లాడి ఉంటారని ఆయన చెప్పారు.
వైసీపీ కార్యకర్తలకు పెద్దపీట
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తవ్వుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడుల కేసులు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల విచారణలో వేగం పెరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. మరో వైపు సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ లను లక్ష్యంగా చేసుకొని పెట్టిన పోస్టులపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఈ పోస్టులు పెట్టిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. ఈ కేసుల్లో కొందరు అరెస్టయ్యారు. మరికొందరు పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలను పట్టించుకోలేదని జగన్ ఒప్పుకున్నారు. ప్రజల గురించే పట్టించుకొన్నా.. ఇక నుంచి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కొత్త జగన్ ను చూడబోతారా?
అధికారానికి దూరమైన తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు ఆ పార్టీని వీడారు. ఆయనతో పాటు కేసుల్లో ఉన్న వారు కూడా పార్టీని వీడారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, ఉదయభాను వంటి నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఆవిర్భావంతో జగన్ తో ఉన్నారు.
మంత్రి పదవిని వదులుకొని అప్పట్లో ఆయన జగన్ వెంట నడిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఆయన జగన్ తో కూడా కొనసాగించారు. విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లారు. అలాంటి ఈ ఇద్దరు కూడా జగన్ బైబై చెప్పారు.
ఈ పరిణామాలు పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయనే చర్చ ప్రారంభమైంది. దీంతో పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ కార్యాచరణను ప్రారంభించాలని భావిస్తున్నారని చెబుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి కాపాడేది కార్యకర్తలు. అందుకే కార్యకర్తలను కాపాడుకుంటామని ఆయన భరోసా ఇస్తున్నారు.మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ కార్యకర్తలకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడితే తమకు మంచి జరుగుతోందనే భావన కార్యకర్తల్లో ఉంటుంది.
ఇక నుంచి జగన్ 2.0 చూస్తారని మాజీ సీఎం కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మరో వైపు తన ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టి అభివృద్ది పనుల గురించి పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేసుకొంటానని తన మాటల ద్వారా జగన్ సంకేతాలు ఇచ్చారా అనే చర్చ సాగుతోంది.
టీడీపీ రియాక్షన్ ఏంటి?
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. జగన్ పాలనతో 151 నుంచి 11 స్థానాలకు ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని సైకిల్ పార్టీ విమర్శించింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే బాగుపడ్డారని ఆ పార్టీ ఆరోపించింది. జగన్ వ్యాఖ్యలను చూస్తే ఆయన ఇంకా భ్రమల్లోనే ఉన్నారని అర్ధమౌతోందని ఆ పార్టీ కౌంటరిచ్చింది.
భవిష్యత్తు కార్యాచరణ గురించి పార్టీ కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయనే నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల తమ పాలనలో పొరపాట్లను సరిదిద్దుకొని రానున్న రోజుల్లో ప్రజల వద్దకు ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ఫ్యాన్ పార్టీ స్ట్రాటజీని రెడీ చేసుకుంటుంది. ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తోందో వెయిట్ అండ్ సీ..

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire