కర్నూలులో కయ్యమంటే కయ్యం.. నువ్వానేనా అంటున్న హఫీజ్-ఎస్వీ

కర్నూలులో కయ్యమంటే కయ్యం.. నువ్వానేనా అంటున్న హఫీజ్-ఎస్వీ
x
కర్నూలులో కయ్యమంటే కయ్యం.. నువ్వానేనా అంటున్న హఫీజ్-ఎస్వీ
Highlights

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఒక సూరులో మూడు కొప్పులు ముడిపడవు. వుంటే గింటే ఒకరే వుండాలి. ఇద్దరూ ఒకే చోట వుండటానికి వీల్లేదు. ఒకరుంటే, మరొకరి ఉనికికే...

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఒక సూరులో మూడు కొప్పులు ముడిపడవు. వుంటే గింటే ఒకరే వుండాలి. ఇద్దరూ ఒకే చోట వుండటానికి వీల్లేదు. ఒకరుంటే, మరొకరి ఉనికికే డేంజర్. ఇదే రేంజ్‌లో కొండారెడ్డి బురుజు సాక్షిగా తొడగొడుతున్నారు ఇద్దరు నాయకులు. నువ్వా నేనా అన్నట్టుగా కత్తులకు పదునుపెడుతున్నారు. నువ్వన్నా వుండాలి, నేనన్నా వుండాలన్నట్టుగా కొట్లాటలకు దిగుతున్నారు. ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం వ్యూహప్రతివ్యూహాలు వేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి రచ్చ, వైసీపీ అధిష్టానికి తలనొప్పిగా మారింది. ఇంతకీ ఎవరు వారు ఎందుకంత రగడ?

హఫీజ్‌ ఖాన్. ప్రస్తుతం కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే, ఎస్వీ మోహన్‌ రెడ్డి కర్నూలు మాజీ ఎమ్మెల్యే. ఈయనా వైసీపీలోనే వున్నారు. వీరిద్దరి మధ్యా ఫ్యాక్షన్ ‌గొడవల్లేవు. కానీ అంతకుమించి అన్నట్టుగా, యుద్ధం జరుగుతోందిప్పుడు. ఒకే పార్టీలోనే వుంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఈ ఇద్దరు నేతలు. సోషల్ మీడియాలోనైతే వీరి అభిమానులు ఓ రేంజ్‌లో చెలరేగిపోతున్నారు. మాజీని మాజీగానే వుంచుతామంటూ, ఎస్వీ మోహన్‌ రెడ్డిపై హఫీజ్ ఫాలోవర్స్‌ పంచ్‌లు విసురుతుంటే, తాజాని మాజీ చేస్తామంటూ ఎస్వీ అనుచరులు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా వున్న వీరిద్దరి గొడవ, కొందరికి తాజాగా పార్టీ కండువా కప్పడంతో, భగ్గుమంది.

కర్నూలు సిటీలో స్థానిక వడ్డే గిరి ప్రాంతంలో ఉన్న కొందర్ని వైసీపీలోకి ఆహ్వానించారు ఎస్వీ మోహన్‌ రెడ్డి. వారికి కండువాలు కప్పి, సభ్యత్వం ఇప్పించారు. ఇదే ఇప్పుడు మాజీ, తాజా ఎమ్మెల్యేల మధ్య గొడవకు కారణమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతరులను పార్టీలోకి ఎలా చేర్పిస్తారంటూ హఫీజ్‌ ఖాన్ ఇంతెత్తున ఫైరవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఏమాత్రం సంప్రదించకుండా, పార్టీ సభ్యత్వాలు ఎలా ఇస్తారంటూ రగిలిపోతున్నారు హఫీజ్ ఖాన్. గతంలో పార్టీకి ద్రోహం చేసేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ, చేసిన తప్పులు సరిదిద్దుకుంటానని, సామాన్య కార్యకర్తగా ఉంటానని చెప్పినందుకే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇచ్చారని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, పాత చరిత్ర తవ్వి తీస్తున్నారు హఫీజ్ ఖాన్.

ఇరువురి మధ్యా ఈ రేంజ్‌లో విభేదాలకు కారణం, కర్నూలు నియోజకవర్గంలో పట్టుకోసం, పెత్తనం కోసం. మరో మాటలో చెప్పాలంటే, ఉనికి కోసం. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్నట్టుగా, ఈ ఇద్దరు నాయకులు కర్నూలు వైసీపీ నియోజకవర్గంలో సెట్‌కాలేకపోతున్నారు. ఎందుకంటే, ఒకరుంటే, మరొకరికి స్థానం లేదిక్కడ. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలోకి జంప్‌ కొట్టిన ఎస్వీ, టీడీపీలో టీజీ లాబీయింగ్‌తో తలపడలేక టికెట్‌ సంపాదించలేకపోయారు. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో వచ్చినా, టికెట్‌ మాత్రం హఫీజ్‌ఖాన్‌కు అప్పటికే కన్‌ఫామ్ కావడంతో, నిరాశ తప్పలేదు ఎస్వీకి. చేసేదేమీలేక హఫీజ్‌కు అనుకూలంగా ప్రచారం చెయ్యాల్సి వచ్చింది. టీడీపీ టికెట్‌ ఎస్వీకి వచ్చి వుంటే, ప్రత్యర్థులుగా పోటీ పడాల్సిన నేతలు, ఇఫ్పుడు ఒకేపార్టీలో వుండటంతో ఇంటర్నల్‌గా‌ కత్తులు దూయడం మాత్రం ఆపలేదు. అందుకే ఎన్నికలు అయిపోయిన రెండు, మూడు నెలల్లోనే వీరిమధ్య వార్‌ మొదలైంది.

కర్నూలు నియోజకవర్గంలో ఎస్వీ మోహన్‌ రెడ్డికి, హఫీజ్‌ఖాన్‌కు మధ్య ఉనికికోసం యుద్ధం జరుగుతోంది. మండలి కూడా రద్దు కావడంతో ఎమ్మెల్సీపై ఆశలు వదులకున్న ఎస్వీ, వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టారట. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్‌కు ఎస్వీకి టికెట్‌ దక్కాలంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్‌కు ఇవ్వకూడదు. దీంతో హఫీజ్‌ ఖాన్‌పై పైచేయి సాధించడానికి, ఎస్వీ తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే అయినప్పటికీ హఫీజ్ ఖాన్ మాట చెల్లకుండా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీలో హఫీజ్‌ను డమ్మీ చేసేందుకు, హఫీజ్‌ వ్యతిరేకులకు వైసీపీ తీర్థం ఇస్తూ, తన బలం పెంచుకుంటున్నారట. ఎస్వీ వ్యూహాలు పసిగట్టిన హఫీజ్‌ ఖాన్‌, అందుకు కౌంటర్ స్ట్రాటజీలు కూడా విసరడం మొదలుపెట్టారట. ఎస్వీకి స్థానికంగా సిటీ కేబుల్‌ నెట్‌వర్క్‌ వుంది. తనకు సైతం సిటీ కేబుల్ సపోర్ట్‌ వుండాలని తపించిన హఫీజ్ ఏకంగా ఓ సిటీ కేబుల్‌ చానెల్‌ను కొన్నారట.

మొత్తానికి ఒకరు పార్టీలో వుంటే, మరొకరికి ప్రమాదమని భావిస్తున్న ఎస్వీ, హఫీజ్‌ ఖాన్‌లు, అంతర్గతంగా ఒకరికి మరొకరు స్పాట్‌ పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే పార్టీలో వుండటం, భవిష్యత్తులో వివాదాలు మరింత ముదిరేలా చేస్తుందని, పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ఇప్పటికే ఎస్వీ మోహన్‌ రెడ్డిపై, పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారట ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్. అటు తాను సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, విధేయతను చాటుకునేందుకు ఎస్వీ ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కర్నూలు నియోజవర్గంలో ఉనికి పోరాటం, పెత్తన ఆరాటం ఇద్దరు తాజా, మాజీల మధ్య యుద్దాన్ని తీవ్రం చేస్తోంది. మున్ముందు వీరి రగడ ఎలాంటి ప్రకంపనలు రేపుతుందోనని, పార్టీ కార్యకర్తలు టెన్షన్‌ పడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories