Top
logo

బాలయ్య రాజ్యంలో పీఏల పాలనా?

బాలయ్య రాజ్యంలో పీఏల పాలనా?
X
హిందూపురం
Highlights

ఆ నియోజకవర్గంలో పీఏలదే హవా ప్రజాప్రతినిధులు స్థానికేతరులు కావడంతో పీఏలు అధికారం చెలాయిస్తున్నారక్కడ. పీఏల...

ఆ నియోజకవర్గంలో పీఏలదే హవా ప్రజాప్రతినిధులు స్థానికేతరులు కావడంతో పీఏలు అధికారం చెలాయిస్తున్నారక్కడ. పీఏల పెత్తనంతో అక్కడి ప్రజలు విసిగి వేశారిపోయారు. పీఏల పెత్తనాన్ని జీర్ణించుకోలేని స్థానిక నేతలు, కార్యకర్తలు అసమ్మతి బాట పట్టారు. ఇంతకీ ప్రజాప్రతినిధుల స్థానంలో పీఏల రాజ్యం ఎక్కడ?

టీడీపీ అయినా వైసీపీ అయినా అక్కడ పీఏలదే రాజ్యం. అధికారిక కార్యకలాపాల నుంచి గ్రామాలో రాజకీయాల వరకూ అన్నీ వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కొంత కాలంగా కొనసాగుతున్న ఈ తరహా వ్యవహారంపై, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు బయటి నుంచి వచ్చిన వారు కావడంతో పీఏలపై ఆధారపడటాన్ని పార్టీ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతోంది. నేతలు వారి పీఏల తీరుకు నిరసనగా రోడ్లెక్కుతున్నారు.

2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ పోలీసు అధికారి అహ్మద్ ఇక్బాల్ బరిలో నిలిచారు. టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ పోటీ చేసి ఎమ్మల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ అధికారంలోకి రావడంతో అధికార పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఇక్బాల్ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయనకు అధినేత ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. నియోజకవర్గం ఇన్ చార్జిగా వచ్చే ఎన్నికల వరకూ కొనసాగాలని, నియోజకవర్గ అభివృద్ధికీ పాటుపడాలని సీఎం ఆదేశించారు. అంతవరకు బాగానే ఉన్నా ఎమ్మెల్సీ ఇక్బాల్ తీరుపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కొన్ని రోజుల కిందట పట్టణంలో ఓ ఫంక్షన్ హాలులో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేవం నిర్వహించారు. ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్న కార్యకర్తలకు గుర్తింపు లేదని, స్థానిక నేతలను ఎమ్మెల్సీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని పార్టీ ఇన్ చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కు వివరించారు. ముఖ్యంగా పీఏల వ్యవహరంపై స్థానిక నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.

ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎన్నికల ముందు హిందూపురం వచ్చారు. నియోజకవర్గంపై పూర్తీస్థాయిలో పట్టు లేకపోవడంతో అనధికారికంగా ఇద్దరు పీఏలను నియమించుకున్నట్లు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. వారు చెప్పిన విధంగా ఇన్ చార్జి వ్యవహరిస్తూండడాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక వర్గానికే నాయకుడు ప్రాధాన్యం ఇస్తున్నారని ముందు నుంచి పార్టీ లో ఉన్న సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిలమత్తూరు,లేపాక్షీ మండలాల నేతలు పీఏల తీరుపై ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా క్యాడర్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీకి చిత్తశుద్దితో పనిచేసిన నేతలకు గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకివచ్చినా తమ పై కేసులు నమోదవుతున్నాయని ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురంలో మొదటి నుంచీ పీఏలదే రాజ్యంగా నడుస్తోంది. గత ప్రభుత్వంలోనూ పీఏల సమస్య తెగని పంచాయతీగా మారింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయనేమో సినిమాల షూటింగ్‌తో బిజీగా వుంటూ, పెద్దగా నియోజకవర్గానికి వచ్చేవారు కాదు. హిందూపురంలో పీఏలను పెట్టి మొత్తం వ్యవహారం నడిపించేవారు. దీంతో బాలయ్యపైనా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడి నుంచి ఆ పార్టీ నేతలే, ముఖ్యంగా నందమూరి తారాక రామారావు కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. రాయలసీమ దత్త పుత్రుడిగా చెప్పుకున్న ఎన్ టీఆర్ హిందూపురాన్ని తన సొంత నియోకజవర్గం చేసుకున్నారు. ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. అనంతరం హరికృష్ణ, తాజాగా బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. రంగ నాయకులు, అబ్ధుల్‌ ఘని వంటి వారు ఒకటి రెండుసార్లు స్థానిక నేతలు ఎన్నికైనా, ఎక్కువ కాలం ఎన్ టీఆర్ కుటుంబం ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించింది. 2014లో తొలిసారిగా హిందూపురం నుంచిపోటీ చేసిన బాలకృష్ణ, ఎమ్మెల్యే అయిన అనంతరం ఆయన పీఏగా చంద్రశేఖర్ కొనసాగారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగినా పెత్తనం మాత్రం పీఏ చెలాయించేవారు. నియోజకవర్గంలో ఏ పనికావాలన్నా ఏం జరగాలన్నా ఆయన కనుసన్నల్లోనే నడిచేది. ఆయన వ్యవహారం నచ్చని తమ్ముళ్లు, అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న అసమ్మతితో చంద్రశేఖర్‌ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కొంతకాలం టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన కృష్ణమూర్తి పీఏగా కొనసాగారు.

అసమ్మతి వాదులను కలుస్తూ బాలయ్య సూచనలతో పనిచేసుకుంటూ వెళ్లారాయన. కొద్ది రోజులకే వీరయ్యను ప్రభుత్వం బాలకృష్ణ పీఏగా నియమించింది. పీఏల చేష్టలతో విసిగిపోయిన పార్టీ కార్యకర్తలు పలుమార్లు ఆందోళనకు దిగారు. బాలకృష్ణకు, పీఏల తీరుకు వ్యతిరేకంగా కర్ణాటకలోనూ సమావేశాలు నిర్వహించారు. ఓ సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబుకు హిందూపురం పీఏల పంచాయితీ సమస్యగా మారింది. తాజాగా పీఏల తీరుపై వైసీపీలోనూ అసమ్మతి అగ్గిరాజేస్తోంది. ఇక్బాల్ నియమించుకున్న అనధికార పీఏల తీరుపై క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. ఈ ప్రభుత్వంలోనైనా పీఏల గోల లేకుండా ఎమ్మెల్సీ అందరికీ అందుబాటులో ఉంటూ స్థానికులకు న్యాయం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.


Web TitleIt's PA's not Balakrishna who is ruling Hindupur constituency
Next Story