కమలం వైపు నల్లారి చూపు..కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌?

కమలం వైపు నల్లారి చూపు..కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్‌?
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరాఖరి ముఖ్యమంత్రి ఇప్పుడెక్కడున్నారు 2014 వరకూ ఏపీ సీఎంగా అధికారం చేసినా నల్లారి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఆయన అసలు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరాఖరి ముఖ్యమంత్రి ఇప్పుడెక్కడున్నారు 2014 వరకూ ఏపీ సీఎంగా అధికారం చేసినా నల్లారి, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఆయన అసలు కనిపించడం లేదు కాబట్టి, సహజంగానే ఎవరికైనా ఈ డౌట్ వస్తుంది. కానీ సమైఖ్యాంధ్ర పార్టీని పక్కనపెట్టి, ఇప్పుడాయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారు. లేరంటే లేరు. ఆ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చేందుకు నల్లారి కొత్త బండి ఎక్కబోతున్నారట. ఈసారి నల్లారి వారి కయ్యాలు, జగన్‌తో ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయట. ఇంతకీ కిరణ్‌ కుమార్ రెడ్డి ఏం చెయ్యబోతున్నారు?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజకీయ జీవితం ఒక్కసారిగా పైకి ఎకబాకి, అదే వేగంతో పాతాళానికి పడిపోయింది. ఆల్‌ ఆఫ్ సడెన్‌గా ముఖ్యమంత్రి కావడం, ఆయన సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రం విడిపోవడం, అందుకు ఆగ్రహంతో రగిలిపోయిన ఏపీ ప్రజలు, కిరణ్‌ కుమార్ రెడ్డిపై ఆగ్రహంతో ఊగిపోయారు. తన మాట వినకుండా రాష్ట్రం విడగొట్టారని కుమిలిపోయిన నల్లారి, సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టినా, లాభం లేకుండాపోయింది. ఏ పార్టీలో ఉన్నా, నల్లారిని, ఆయన వర్గానికి ప్రజల చేతుల్లో పరాభవమే ఎదురైంది.

ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు సైలెంట్‌‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల టైంలో, తిరిగి స్వగృహ ప్రవేశంలో భాగంగా కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఊరూరా తిరిగి, టీడీపీ, వైసీపీలను తూర్పారబెట్టినా, కిరణ్‌ కుమార్‌ రెడ్డిని, ఆయన వెంట ఉన్న నాయకులను కనీసం గుర్తించలేదు ఏపీ ప్రజలు. దీంతో మళ్లీ మౌనముద్రలోకి జారుకున్న కిరణ్, మళ్లీ మైక్ అందుకునేందుకు సిద్దమవుతున్నారన్న సంకేతాలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అంటే చాలామంది మర్చిపోయిన పరిస్థితి. వంద అడుగుల గొయ్యి తీసి, జనం ఆ పార్టీని పాతరేశారు. అందుకే రాజకీయాల్లో తిరిగి క్రియాశీలక పాత్ర పోషించాలంటే, కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కష్టమని డిసైడయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం ఏపీ కోణంలోనే కాకుండా, జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోయిన నేపథ్యంలో, ఒక వెలుగు వెలుగుతున్న కమలం వైపు చూస్తున్నారట నల్లారి.

ఏపీలో బలపడ్డానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, చంద్రబాబుకు వయసు మీదపడుతుండటం, పవన్‌ కల్యాణ్‌ను జనం పెద్దగా విశ్వసించకపోవడం వంటి సానుకూల రాజకీయ వాతావరణం, తమ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తోందని లెక్కలేస్తోంది బీజేపీ. మొన్నటి వరకు వైసీపీతో చెలిమి అనుకుంటే, ఇప్పుడు ఏకంగా ఆల్టర్నేటివ్‌గా ఎదిగేందుకు వ్యూహాలు సిద్దం చేస్తుండటం, ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలకు నిదర్శనం. బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్‌ వ్యాఖ్యలే అందుకు సంకేతం. ఏపీలో ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని రాంమాధవ్ వ్యాఖ్యానించడంతో, రాబోయే కాలంలో వైసీపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా కమలదళం సిద్దమవుతోందన్న సంకేతాలు కనపడుతున్నాయి. అందుకే టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన కీలక నాయకులకు కాషాయం కండువా కప్పి, పార్టీని బలోపేతం చెయ్యాలని ఆలోచిస్తోంది బీజేపీ. నల్లారి వంటి దూకుడు నేతలకు అందుకే గాలం వేస్తోంది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కిరణ్ ఒకవేళ బీజేపీలో చేరితే ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటనే దానిపై కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మాజీ సీఎం కిరణ్‌తో పాటు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ నేతలు మంత్రాంగం నడుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామని కిషోర్ కుమార్ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మంచి బాధ్యతలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే హామీ ఇచ్చారని తెలుస్తోంది.

ఆంధ‌్రప్రదేశ్‌‌ రాజకీయ తెరపై కిరణ్‌తో పాటు దాదాపు ఫేడౌట్‌ అయిన చాలామంది నేతలు, బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన శైలజానాథ్‌, వట్టి వసంత కుమార్ కూడా నల్లారితో కలసి కమలం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా రాజీనామా చేసిన రఘువీరా రెడ్డి సైతం, పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గిడుగు రుద్రరాజు వంటి నాయకులు బిజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివ రావు కూడా, బీజేపీలో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని ప్రకటించారు. మొత్తానికి రామా హరీ అంటూ మూలన కూర్చున్న చాలామంది నేతలను, పార్టీలో జాయిన్ చేయించుకునేందుకు బీజేపీ సిద్దమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. చూడాలి నల్లారి బీజేపీలో నిజంగానే చేరుతారో, చేరితే చంద్రబాబు, జగన్‌ల తరహాలో జనాలు ఆ‍యను ఆదరిస్తారో మరోసారి రిక్తహస్తం చూపిస్తారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories