ఏపీ రాజకీయాలను కరోనా ఇంతగా కుమ్మేస్తోందా?

ఏపీ రాజకీయాలను కరోనా ఇంతగా కుమ్మేస్తోందా?
x
Highlights

కరోనా వైరస్‌ లక్షణాలు ప్రపంచంలో ఎవరికైనా ఒక్కటే. కానీ అదే కరోనా ఏపీ రాజకీయ పార్టీల్లో రకరకాల లక్షణాలు వెలికితీస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికలే...

కరోనా వైరస్‌ లక్షణాలు ప్రపంచంలో ఎవరికైనా ఒక్కటే. కానీ అదే కరోనా ఏపీ రాజకీయ పార్టీల్లో రకరకాల లక్షణాలు వెలికితీస్తోంది. కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికలే వాయిదాపడ్డంతో అధికార వైసీపీ ఐసోలేషన్‌గా ఫీలవుతుంటే, అటు తమకు మాత్రం వైరస్‌ మంచి చేసిందంటూ విపక్షాలు లోలోపల సంబరపడుతున్నాయట. ఇంతకీ కరోనా ప్రభావం పక్కనపెడితే, ఎన్నికల వాయిదా ఏ పార్టీపై ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తోంది? ఈ పరిణామాన్ని ఒక్కో పార్టీ, ఒక్కోలా ఎందుకు చూస్తోంది?

ఏ దేశమైనా కరోనా వైరస్‌ ఒక్కటే. ఏ దేశ పౌరులైనా కరోనా వైరస్ లక్షణాలూ ఒక్కటే. కానీ ఆంధ‌్రప్రదేశ్‌ రాజకీయ పార్టీల్లో మాత్రం, కరోనా లక్షణాలు రకరకాలుగా కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యాలంటే, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని, కానీ ఎన్నికలను వాయిదా వేయడంతో ఆ ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడినట్టయ్యిందని ఆరోపించారు సీఎం జగన్. కరోనా కేవలం సాకేనని, నిమ్మగడ్డ రమేష్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేశారని జగన్‌ వ్యాఖ్యానించారు. అయితే, ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే, ఏపీ సీఎంకు మాత్రం అది చాలా చిన్న విషయంగా కనిపించడమేంటన్నారు చంద్రబాబు.

కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను ఈసీ వాయిదా వేయడం, దానిపై అధికార, విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకోవడం అటుంచితే, పార్టీలు ఎందుకింత భిన్నంగా స్పందిస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటూ దూసుకుపోతోంది వైసీపీ. ఎక్కువశాతం ఏకగ్రీవాలే. ఇలా విజయాలతో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న వేళ, ఎన్నికల వాయిదా సడెన్‌గా స్పీడ్‌ బ్రేకరేసినట్టయ్యింది వైసీపీకి. అభ్యర్థులు కూడా ఎన్నికల కోసం భారీగా ఖర్చుపెట్టుకున్నారు. ఇక అతిత్వరలో పీఠమెక్కి రాజ్యం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మొత్తం లోకల్‌ ఎలక్షన్స్‌ను క్లీన్‌స్వీప్ చేసి, తడాఖా చూపించి, ఏడాది అవుతున్నా, ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని, విపక్షాల అడ్రసే గల్లంతు అయ్యిందని, భారీ ఎత్తున విజయశంఖారావం పూరించాలనుకుంది వైసీపీ. కానీ హఠాత్తుగా ఎన్నికలు వాయిదా వేయడంతో, అధికార పార్టీ అంచనాలు, వ్యూహాలన్నింటికీ బ్రేక్‌ పడినట్టయ్యింది. అంతేకాదు, ఆరువారాల పాటు వాయిదా పడటంతో, అంతేకాలం ఎన్నికల కోడ్‌ అమల్లో వుంటుంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొత్త కార్యక్రమాలు అమలు చేయడానికి వీలుకాదని రగిలిపోతోంది వైసీపీ.

ప్రపంచమంతటా కరోనా కంగారుపెట్టిస్తుంటే, తమకు మాత్రం మేలు చేసిందని సంబరపడుతోందట తెలుగుదేశం. కారణం, కరోనా అయినా, మరోటయినా ఎన్నికలు వాయిదాపడటం మాత్రం తమకెంతో మేలని భావిస్తోందట టీడీపీ. వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుండటం, అసలు టీడీపీ నామరూపాల్లేకుండా పోతున్న టైంలో, కరోనా ఆదుకుందని అనుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఆరువారాల గ్యాప్‌తో ఎంతోకొంత కోలుకుని, కొన్ని స్థానాలైనా గెల్చుకుంటామనుకుంటోందట టీడీపీ.

అటు బీజేపీ-జనసేన కూటమి, ఎన్నికల వాయిదాను తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎలక్షన్స్‌ వాయిదా వెయ్యాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది తామేనని ఆ పార్టీ నేతలంటున్నారు. బీజేపీ రాజ్యసభ ఎంపీలు జీవీఎల్, టీజీ వెంకటేష్‌‌తో పాటు మరికొందరు ఎంపీలు హోంమంత్రి అమిత్‌ షాను కలవడం, ఎన్నికల్లో తీవ్ర హింస, బీజేపీ నేతలు గాయపడటం వంటి ఘటనలు వివరించారని, ఎన్నికల వాయిదాలో కేంద్ర పెద్దలూ వున్నారని, రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎలక్షన్స్‌ పోస్ట్‌పోన్‌పై వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు పవన్‌.

మొత్తానికి కరోనా వైరస్‌, ఏపీ రాజకీయ పార్టీల్లో ఒక్కోరకమైన లక్షణాలను వెలికి తీసింది. రాజధానుల వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో చైర్మన్‌ షరీఫ్‌‌తో అడ్డుకుంటే, ఇప్పుడు స్థానిక ఎన్నికలను, ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌తో టీడీపీ వాయిదా వేయించిందని వైసీపీ ఆరోపిస్తుంటే, రాజ్యాంగ సంస్థలనే కించపరుస్తారా అంటూ టీడీపీ తిప్పికొడుతోంది. చూడాలి, స్థానిక ఎన్నికల వాయిదా, ఏపీలో ఇంకెలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories