Top
logo

జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు.. కొత్త పార్టీ పెడతారా?

జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు.. కొత్త పార్టీ పెడతారా?జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు.. కొత్త పార్టీ పెడతారా?
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? సైకిలెక్కి బాబుతో కలిసి...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? సైకిలెక్కి బాబుతో కలిసి స్వారీ చేస్తారా? లేదంటే కొత్త పార్టీ పెట్టి, అరవింద్‌ కేజ్రీవాల్‌లా చెలరేగిపోవాలనుకుంటున్నారా? అసలు జేడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారా‍యణ, వాట్‌ నెక్ట్స్ అన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. జనసేనకు రాజీనామా చేసిన తర్వాత, ఆయన తరువాతి అడుగులేంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణ తన భవష్యత్‌ కార్యాచరణ ప్రకటించలేదు. అయితే, మాజీ రాష్ట్రపతి కలాంకు సంబంధించిన ఓ కార్యక్రమ పనుల్లో బిజీగా వున్నారు. ఆ తర్వాతే తీరిగ్గా ఆలోచిస్తానని చెప్పారు జేడీ. 'ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌'ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు లక్ష్మీనారాయణ. ప్రస్తుతానికి మాత్రం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. అయితే, తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న జేడీ, తర్వాతి ప్రస్థానంపై మాత్రం చాలా ఆసక్తికరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకీ జేడీ రాజకీయాల్లోనే వుంటారా?

ప్రజా సేవకు రాజకీయమే అత్యుత్తమ వేదిక అని లక్ష్మీనారాయణ చాలాసార్లు స్పష్టం చేశారు. అంటే, ఆయన రాజకీయాల నుంచి వైదొలిగే ప్రశ్నేలేదు. మరి ఏ పార్టీలోకి వెళతారు?

ఢిల్లీలో ఆప్‌ ఉత్సాహంతో కొత్త పార్టీ పెడతారా?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా, ఒకప్పుడు జేడీ మాదిరే సివిల్ సర్వెంట్. ఆమ్‌ ఆద్మీ స్థాపించి, హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆప్‌ విజయఢంకా, జేడీలోనూ ఉత్సాహం నింపిందని, ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. మరి కేజ్రీవాల్ తరహాలోనే జేడీ కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. కానీ జేడీ సన్నిహితులు మాత్రం, ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలంటే, సమాజంలో ఇమేజ్‌ ఒక్కటే సరిపోదని, ఆర్థిక వనరులు, పెద్దపెద్ద రాజకీయ నాయకులూ అవసరమంటున్నారు. జేడీ దగ్గర డబ్బుల్లేవంటున్నారు. కేవలం యువతను మాత్రమే ఆయన నమ్ముకున్నారని చెబుతున్నారు.

మరి జేడీ టీడీపీ సైకిల్‌ ఎక్కుతారా?

ఈ చాయిస్‌ కూడా జేడీ ఆలోచించడం లేదట. ఎందుకంటే, గత ఎన్నికల్లోనే జేడీ టీడీపీలోకి వెళతారన్న ప్రచారాన్ని వైసీపీ ఆయుధంగా మలచుకుంది. నాడు జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం జేడీయేనని, ఆరోపించారు. దీంతో టీడీపీకి వెళతారనుకున్న జేడీ, లాస్ట్‌ మినిట్‌లో వద్దనుకుని, జనసేనలోకి వెళ్లారని తెలుస్తోంది. ఇప్పడు కూడా టీడీపీకి వెళితే, వైసీపీకి ఆరోపణలకు చిక్కే ప్రమాదముంది కాబట్టి, సైకిలెక్కే ఛాన్సే లేదంటున్నారు జేడీ సన్నిహితులు.

బీజేపీలోకి వెళతారా?

ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే, జేడీ భావజాలం, ఆరెస్సెస్ భావజాలానికి చాలా దగ్గరగా వుంటుంది. వారి సభలకూ, సమావేశాలకూ ఆయన హాజరయ్యారట. మొన్నటి కేంద్ర బడ్జెట్‌పైనా ఆ‍యన ప్రశంసలు కురిపించారు. రైతులకు మేలు చేసేలా నిర్మల బడ్జెట్‌ వుందని కితాబిచ్చారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నట్టు ప్రశించారు. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ, జేడీ లాంటి ఇమేజ్‌ వున్న వ్యక్తులు పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆలోచిస్తోందని తెలుస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఆల్రెడీ, జేడీని సంప్రదించారట. ఆయన కూడా సానుకూలంగా వున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై ప్రకటన కూడా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జనసేనతో చేయి కలిపిన బీజేపీలో నిజంగానే జేడీ చేరతారా?

ఇదే సందిగ్దం అందరిలోనూ. సినిమాలు చేయనని చెప్పి, సినిమల్లో నటిస్తున్నారని, పవన్‌లో నిలకడలేదని విమర్శించి, జనసేనకు రాజీనామా చేశారు జేడీ. కానీ అదే పవన్‌ ఇప్పుడు బీజేపీకి మిత్రుడు. ఇద్దరూ కలిసే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అభ్యర్థులను నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, జేడీ బీజేపీలో చేరితే, ఇబ్బందులే. అందుకే ఆచితూచి అడగులేస్తున్నారు జేడీ. అలాకాకుండా జేడీని పార్టీలోకి ఆహ్వానించి, ప్రాధాన్యమిస్తే, పవన్‌ ఫీలవుతారేమోనని బీజేపీ కూడా ఆలోచించొచ్చు. అందుకే జేడీ కాషాయ పార్టీలోకి వెళ్లడంపై సందిగ్దం నెలకొంది.

విశాఖ ఎంపీ టికెట్‌పైనా భవిష్యత్‌లో జేడీకి ఇబ్బంది కలగొచ్చు. ఎందుకంటే, బీజేపీ నుంచి పురంధ్రీశ్వరి ఆల్రెడీ లైన్‌లో వున్నారు. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకే వదిలేయొచ్చు. 2019లో మంచి ఓట్లే సంపాదించుకున్న జేడీ, అదే సీటుపై ఆశలు పెట్టుకుంటే, ఇబ్బందే. అందుకే జేడీ బీజేపీలోకి వెళ్లాలనుకున్నా, అనేక అడ్డంకులు మాత్రం కళ్లముందు కదలాడుతున్నాయి. అలాగని దాదాపు అంతర్థానమైన కాంగ్రెస్‌లో చేరలేరు, వైసీపీలో పొరపాటున కూడా జాయిన్‌కాలేరు. జనసేన ఛాన్సేలేదు. టీడీపీలోకి వెళితే, చంద్రబాబుకే ఇబ్బంది. బీజేపీలోకి అంటే, జనసేనతో గొడవ. అలాగని సొంత పార్టీ పెట్టలేరు. సమాజ సేవకు, రాజకీయమే అత్యుత్తమ వేదిక అని, పదేపదే అంటున్న జేడీ, పాలిటిక్స్‌లో వుంటానని మాత్రం గట్టిగానే చెబుతున్నారు. కానీ ఏ పార్టీ అన్న ఆప్షన్స్‌ పరిశీలిస్తే మాత్రం, గందరగోళం కనిపిస్తోంది. క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డ జేడీ, ఎటువైపు అడుగులు వేస్తారన్నది, ఆయనే చెప్పాలి.Web Titlein which party jd laxminarayana will join
Next Story


లైవ్ టీవి