Top
logo

చంద్రబాబు మీటింగ్‌కి సీనియర్ల డుమ్మా..షాకిచ్చినట్టేనా..?

చంద్రబాబు మీటింగ్‌కి సీనియర్ల డుమ్మా..షాకిచ్చినట్టేనా..?
X
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. జిల్లాలవారీగా పర్యటిస్తూ, నియోజకవర్గాల వారీగా, ఓటమికి దారి తీసిన కారణాలపై చర్చిస్తున్నారు. అధికారం లేనంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదన్న భరోసా కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాటం మొదలుపెట్టాలని, క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త జోష్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో, పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కానీ ముఖ్యమమైన సమావేశానికి జిల్లాలో కీలక నాయకులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది.

జిల్లాలో కాపు ఉద్యమ నేతల్లో ఒకరిగా పేరు పొందిన రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ సమావేశానికి రాలేదు. నియోజకవర్గంలో ఆయనను అభిమానించే టిడిపి క్యాడర్ కూడా ఈ సమావేశాలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఆయనే కాదు కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీలో కీలక నేతగా పేరొందిన బొడ్డు భాస్కర రామారావు సైతం, ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు. పార్టీకి ఇంతటి కీలకమైన సమావేశానికి నేతలు రాకపోవడం, చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని, పార్టీ పరంగా ఆదేశాలు జారీ చేసినా, వీరు రాకపోవడంతో బాబు కలత చెందినట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత కాపు నేతలందర్నీ కూడగట్టి సమావేశం నిర్వహించిన రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, పార్టీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ఒకవిధంగా ధిక్కార స్వరమే అనుకోవాలి. ఎన్నికల నాటి నుంచి కూడా, తోట ఇలాంటి వైఖరే అనుసరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లు వైసీపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగినా, అక్కడి నుంచి పాజిటిల్‌ సిగ్నల్ రాకపోవడంతో, కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా కీలక మీటింగ్‌కు కూడా రాకపోవడం, ఈ ప్రచారానికి మరింత బలమిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా, కమలం వైపు చూస్తున్నారని, అందుకే మీటింగ్‌కు రాలేదని, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.

కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు దొరబాబు కూడా, కాకినాడలోనే జరిగిన పార్టీ మీటింగ్‌కు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఈయనతో పాటు మరో పదిమంది కార్పొరేటర్లు కూడా అటెండ్ కాలేదు. పార్టీలో అంతర్గత విభేదాలకు ఇంతకంటే నిదర్శనం ఏంకావాలని, కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో విభేదాలతోనే దొరబాబు పార్టీ సమావేశానికి రాలేదని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండబాబుకు టికెట్ ఇవ్వొద్దని, వ్యతిరేకత తారాస్థాయిలో వుంది కాబట్టి, ఓటమి తప్పదని దొరబాబు పట్టుపట్టారు. అనుచరులతో కలిసి ఆందోళన కూడా చేశారు. అయినా తన మాట ఏమాత్రం ఆలకించకుండా తిరిగి కొండబాబుకే టికెట్ ఇచ్చారని, చివరికి తాను చెప్పినట్టు ఆయన ఓడిపోయారన్నది దొరబాబు అసంతృప్తి. అందుకు నిరసనగానే, పార్టీ సమావేశానికి దొరబాబు రాలేదని నేతలు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి పార్టీలో ఓటమి నైరాశ్యాన్ని తరిమికొట్టి, కార్యకర్తలు, నేతల్లో పునరుత్తేజాన్ని నింపాలని చంద్రబాబు, జిల్లాలవారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నా, కొంతమంది నేతలు హాజరుకాకపోవడం, అధినేతను కలవరపాటుకు గురి చేస్తోంది. ఓడిపోయినంత మాత్రాన సర్వస్వం కోల్పోయినట్టు కొంతమంది నేతలు ఫీలవడంపై అసహనం వ్యక్తం చేశారట. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులు, పదవులు లేకపోయేసరికి అల్లాడిపోతున్నారని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. మొత్తానికి టీడీపీకి మంచి పట్టున్న తూర్పు గోదావరి జిల్లాలో, ఏకంగా పార్టీ అధినేత ఆ‌ధ్వర్యంలో జరిగిన సమావేశానికి, కీలక నేతలు హాజరుకాకపోవడం, టీడీపీలో అంతర్గత విభేదాలకు నిదర్శనం. ఈ పరిణామాలు అధినేతనే కాదు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయని నేతలంటున్నారు.

Next Story