డెంగ్యూ చిచ్చు..కన్నీటి క్షణాలు

డెంగ్యూ చిచ్చు..కన్నీటి క్షణాలు
x
Highlights

ప్రేమ ప్రాణం పోస్తుంది. ప్రేమించిన వారు తోడుగా ఉంటే ఆఖరి మజిలీ వరకు ఆనందంగా ఉండొచ్చు. మరి అలాంటి వారు అకస్మాత్తుగా దూరమైతే ఆ జీవితం కకావికలం అయినట్టే....

ప్రేమ ప్రాణం పోస్తుంది. ప్రేమించిన వారు తోడుగా ఉంటే ఆఖరి మజిలీ వరకు ఆనందంగా ఉండొచ్చు. మరి అలాంటి వారు అకస్మాత్తుగా దూరమైతే ఆ జీవితం కకావికలం అయినట్టే. పెంచుకున్న ప్రేమ కళ్లముందే కూలిపోతుంది. భవిష్యత్తంతా చీకటిమయం అవుతుంది. అలా తన భార్యపై పెంచుకున్న ప్రేమ చివరకు అతడి ప్రాణమే తీసింది. కన్నబిడ్డను కూడా కాదనుకుంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన ఘటన అందరినీ కలచివేసింది.

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తండ్రీ కూతురు బలవన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. నెల రోజుల వ్యవధిలోనే ఆ కుటుంబం మొత్తం కాటికి పోయింది. నాళం వారి వీధిలో ఉంటున్న బాదం చందన కుమార్‌ దంపతులుంటున్నారు. వీరికి నాలుగేళ్ల ముద్దుల పాప యోషిత కూడా ఉంది. అయితే ఇటీవలే చందూ భార్య శ్రీ నవ్య డెంగ్యూ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. అంతే ఈ ఘటన చందూ జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య లేదనే వేదనతోనే ఇటీవలే ఆమె దినకర్మ కూడా నిర్వహించాడు. భార్య నేత్రాలను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశాడు. కానీ అప్పటి నుంచి చందూ చందూలా లేడు. తన భార్యను తలుచుకుంటూ జీవిశ్చవంలా బతికాడు.

తన భార్య మరణం చందూ జీవితంలో తీవ్ర దు:ఖాన్ని నింపింది. అంతులేని విషాదంలో మునిగిపోయాడు. తన భార్య లేని లోకంలో తానెలా ఉండాలనే ఆలోచన ఆవరించింది. అంతే తాను కూడా తన భార్య దగ్గరకే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన ముద్దుల గారాల పట్టి లోకం కూడా తెలియని అమాయక చిన్నారి నాలుగేళ్ల యోషిత గురించి ఆలోచించాడు. తల్లీతండ్రీ లేని లోకంలో తన బిడ్డ ఎలా బతుకుతుందని అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఏ చేతులతో పెంచాడో అదే చేతులతో తన కన్న కూతురు ప్రాణం తీశాడు. కట్టుకున్న భార్య ప్రేమ ముందు కన్న ప్రేమ ఓడిపోయింది.

చివరకు పుట్టెడు దు:ఖంలో ఉన్న చందూ తీవ్ర వేదనలోనే ఫ్యాన్‌ను ఉరేసుకుని తానూ ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు చందూ ఇంటికి వచ్చి చూసేసరికి చిన్నారి యోషిత విగతజీవిగా పడి ఉంది. చందూ ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. భార్యపై పెంచుకున్న అమితమైన ప్రేమ అతడి ప్రాణాలే తీసింది. చివరకు ఆ కుటుంబాన్నే కనుమరుగు చేసింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories