Veligonda Project: ఫలించనున్నదశాబ్దాల ఎదురుచూపులు

Veligonda Project: ఫలించనున్నదశాబ్దాల ఎదురుచూపులు
x

వెలిగొండ ప్రాజెక్ట్ పాత చిత్రం 

Highlights

దశాబ్దాల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఫ్లోరైడ్ రక్కసితో పోరాడి అలసిన గొంతులు అమృతధారలతో తడవనున్నాయి. అసలు పూర్తవుతుందా.. లేదా అన్న ప్రశ్నల నుంచి ఆ...

దశాబ్దాల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. ఫ్లోరైడ్ రక్కసితో పోరాడి అలసిన గొంతులు అమృతధారలతో తడవనున్నాయి. అసలు పూర్తవుతుందా.. లేదా అన్న ప్రశ్నల నుంచి ఆ తల్లి కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెట్టేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ సిద్ధమైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ వెలిగొండ మొదటిదశ పనుల్లో సొరంగ మార్గం పూర్తయింది. తాగు, సాగు నీటికోసం అల్లాడుతున్న ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య తీవ్రంగా వుంది. ప్రధానంగా ఫ్లోరైడు సమస్య జిల్లా ప్రజలను తీవ్రంగా వేదిస్తోంది. ఇటు నెల్లూరు జిల్లాలోనూ తాగు సాగు నీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. ఉప్పునీరు తాగలేక అవస్థలుపడుతున్నారు. ఇక దుర్భిక్ష ప్రాంతంగా కడప ప్రజలు పడుతున్న కష్టాలూ అన్నీ, ఇన్నీ కావు. ఇలా మూడు జిల్లాల ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకునే వెలిగొండ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వెలిగొండ ప్రాజెక్ట్‌కు 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దివంగత నేత పూల సుబ్బయ్య పేరుతో వెలిగొండ ప్రాజెక్ట్ మొదలైంది. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయింపు జరగలేదు. ప్రాజెక్ట్ నిర్మాణంపై అసెంబ్లీలో పలుమార్లు చర్చ జరిగింది. అయినా ప్రాజెక్ట్ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రాజెక్ట్ పై అప్పటి అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యమే అయింది. ప్రకాశం, నెల్లూరు, కడప వాసులకు ఈ ప్రాజెక్ట్ పై ఆశలు సన్నగిల్లయి. మరో వైపు ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం తడిసి మోపెడు అయింది.

మరోవైపు.. ఈ ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే.. ఎటు చూసినా అవరోధాలే. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన నూజివీడు, కోస్టల్, మెగా వంటి సంస్థలు టన్నల్ నిర్మాణం కష్టంగా మారటంతో నిర్మాణం పనులు తమవల్ల కాదంటూ తప్పుకున్నాయి. దాదాపు 13 సంవత్సరాలపాటు ప్రాజెక్టుకు మూడు సార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవరు ముందుకు రాలేదు. చివరకు కడప జిల్లాకు చెందిన లంకా రెడ్డి ముందుకు వచ్చి టెండర్‌లో పాల్గొన్నారు.

దట్టమైన నల్లమల అటవీప్రాంతం.. అందులోనూ డేంజర్ టైగర్ జోన్.. ఇలాంటి వ్యతిరేకతల మధ్య టన్నెల్ నిర్మించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి ప్రతికూలతలనే లంకా రెడ్డి సవాల్‌గా తీసుకున్నారు. 91 కోట్లతో టెండర్ దక్కించుకుని టన్నెల్ పనులను ప్రారంభించారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని లంకా రెడ్డి నిరూపించారు. తమ దగ్గర ఉన్న అతి తక్కువ సాంకేతికతతోనే అద్భుతం చేశారు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశంలోని ప్రఖ్యాత ఐఏఎస్ ఆఫీసర్‌లతో పాటు ముఖ్యమైన రాజకీయ ప్రముఖులు అందరు రావడం ఎంతో ఆనందం అంటారు లంకారెడ్డి.

‎మరోవైపు.. వెలిగొండ టన్నెల్ నిర్మాణం ఓ సాహసంతో కూడుకున్నదే.. అటవీశాఖ అనుమతించిన 1.2 ఎకరం విస్తీర్ణాన్ని వినియోగించుకుంటూనే నిర్మాణాన్ని సాగించారు. ఎలాంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించకుండానే కేవలం మనుషులతోనే ఈ టన్నెల్‌ను నిర్మించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు లంకారెడ్డి. అంతేనా.. ఓ వైపు పులులు, మరోవైపు ఉగ్రరూపం దాల్చుతున్న ఖృష్ణమ్మను ఎదుర్కొంటూ నిర్మాణ పనులు సాగించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ చిన్న వస్తువు కావాలన్నా గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇలాంటి ప్రతికూలతలను తట్టుకుని ప్రతి కార్మికుడూ ముందుకు సాగారు.

అత్యంత కష్టం సాధ్యం అయిన 18.9 కిలోమీటర్ల టన్నెల్‌ను లంకారెడ్డి బృందం పూర్తి చేసింది. దీని ద్వారా మూడువేల 500 క్యూసెక్కుల నీటిని ఇప్పుడు సరఫరా చేయవచ్చు. రైట్ టన్నెల్‌ను కూడా దాదాపు పూర్తి చేసే పనిలో ప్రస్తుతం లంకారెడ్డి టీమ్ సిద్ధంగా ఉంది. ఇది పూర్తయితే.. మరో 19 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు టన్నెల్ పూర్తయినట్లే. దీని ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేయవచ్చు. వెలిగొండ ద్వారా రెండు టన్నెల్స్‌తో కలిపి11 వేల 500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించవచ్చు.

టన్నెల్ నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావడంతో ప్రకాశం జిల్లా వాసుల ఆనందానికి అవధుల్లేవు. బ్యాక్ వాటర్‌లో టన్నెల్ నిర్మాణం సాగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంస్థకు ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎడమవైపు టన్నెల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలపడంతో.. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అన్నీ సిద్ధం చేసినట్లు కంపెనీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

వెలిగొండతో మూడు జిల్లాల తాగునీటి, సాగునీటి కష్టాలు తీరనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాలు ప్రాజెక్టు కోసం ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో.. దగ్గరుండి నిర్మాణం పూర్తి చేసిన లంకారెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు.. అతి త్వరలోనే వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసి.. మూడు జిల్లాల ప్రజల్లో చిరునవ్వులు నింపేందుకు ప్రభుత్వం కూడా పూర్తిగా సిద్ధమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories