Top
logo

పెళ్లికి పిలిచిన రమేష్‌ను సీఎం జగన్‌ ఏమన్నారు.. జగన్‌ రియాక్షన్‌తో రమేష్‌ షాకయ్యారా?

పెళ్లికి పిలిచిన రమేష్‌ను సీఎం జగన్‌ ఏమన్నారు.. జగన్‌ రియాక్షన్‌తో రమేష్‌ షాకయ్యారా?
X
పెళ్లికి పిలిచిన రమేష్‌ను సీఎం జగన్‌ ఏమన్నారు
Highlights

సీఎం జగన్‌, సీఎం రమేష్‌. ఇద్దరూ ఉప్పూ నిప్పు. అయినా, సీఎం జగన్‌ను పెళ్లికి ఆహ్వానించారు సీఎం రమేష్‌. తన...

సీఎం జగన్‌, సీఎం రమేష్‌. ఇద్దరూ ఉప్పూ నిప్పు. అయినా, సీఎం జగన్‌ను పెళ్లికి ఆహ్వానించారు సీఎం రమేష్‌. తన కుమారుడి వివాహానికి రావాలని కార్డు ఇచ్చారు. కానీ సీఎం రమేష్‌కు ఊహించని స్పందన ఎదురైందట. ఇంతకీ సీఎం రమేష్‌కు, సీఎం రియాక్షన్‌ ఏంటి? ఈ రియాక్షన్‌కు వెనక కథేంటి?

తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌ది ఒకే జిల్లా. కడప. కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం మామలూగా లేదు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి టైం నుంచే సీఎం రమేష్‌‌‌, పొలిటికల్‌ రైవర్లీ వుండేది. టీడీపీలో వున్నంత వరకూ, జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యేవారు రమేష్‌. బీజేపీలో చేరిన తర్వాత, సీఎం రమేష్‌ కాస్త సైలైంటైనా అప్పుడప్పుడు విమర్శల బాణాలు వేస్తూనే వున్నారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నేపథ్యంలో, సీఎం రమేష్‌, ఏకంగా సీఎం జగన్‌ను అమరావతి వెళ్లి కలవడం, ముసిముసి నవ్వులు నవ్వుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉప్పూనిప్పూలాంటి ఇద్దరు లీడర్లు ముఖాముఖి కలుసుకోవడమేంటి, ముసిముసి నవ్వులు నవ్వుకోవడమేంటి, అసలేం జరుగుతోందని చెవులు కొరుక్కుంటున్నారట ఏపీ ప్రజలు. ఇంతకీ సీఎం రమేష్‌, సీఎం జగన్‌ను కలిసిన సందర్భమేంటి?

సీఎం రమేష్‌ కుమారుడి వివాహం వచ్చే నెల మొదటివారంలో జరగబోతోంది. దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్‌ను ఒక రేంజ్‌లో చేశారు రమేష్. పెళ్లి వేడుకను అంతకుమించిన రేంజ్‌లో చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, వెడ్డింగ్ కార్డు ఇచ్చారు సీఎం రమేష్. అమరావతి సచివాలయంలోని సీఎం ఆఫీసుకు కొడుకుతో పాటు సతీసమేతంగా వెళ్లి, జగన్‌కు ఆహ్వానపత్రిక అందించారు. పక్కనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వున్నారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని పిలిచారు. కానీ సీఎం జగన్‌ రియాక్షన్‌తో షాకయ్యారట సీఎం రమేష్‌. ఇంతకీ జగన్‌ ఏమన్నారు?

సీఎం రమేష్‌ కుమారుడి పెళ్లికి రాలేనని చెప్పారట సీఎం జగన్‌. రావాలని పదేపదే అడిగినా జగన్‌ మాత్రం సారీ అన్నారట. ఎందుకు అలా అన్నారన్నదానిపై చాలా విషయాలు ప్రచారంలో వున్నాయి. పెళ్లికి టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు తన రాజకీయ ప్రత్యర్థులు వస్తారని, అందుకే తాను రాలేనని సీఎం రమేష్‌కు నవ్వుతూనే చెప్పారట జగన్‌. రాజధానుల అంశం, ఇంగ్లీష్‌ మీడియంపై ఈమధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒకే వేదికలో కూర్చోవడం, మాట్లాడటం, తనకే కాదు, వాళ్లకీ ఇబ్బందేనని అన్నారట జగన్. అయినా రావడానికి ప్రయత్నించాలని చెప్పి, నవ్వుతూ వెళ్లిపోయారట సీఎం రమేష్‌ దంపతులు.

అయితే ఈమధ్య సీఎం రమేష్‌, ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. కొడుకు మ్యారేజ్‌కు ఆహ్వానించడమే కాదు, సీఎం జగన్‌ శంకుస్థాపన చేసిన కడప స్టీల్‌ ప్లాంట్‌‌ కార్యక్రమానికీ హాజరయ్యారు రమేష్. జగన్‌తో మాట్లాడారు కూడా. సీఎం అయిన తర్వాత జగన్‌ను రమేష్‌ కలవడం అదే మొదటిసారి. ఈమధ్య ఆ‍యన జగన్‌ విషయంలో విమర్శలు తగ్గించుకున్నారు. వైసీపీ అధినేతను బద్ద శత్రువులా భావించే రమేష్‌, ఎందుకు జగన్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి వెనక ఆసక్తికరమైన అనేక విషయాలు వినపడ్తున్నాయి.

కడపతో పాటు అనేక చోట్ల సీఎం రమేష్‌కు కాంట్రాక్టు బిల్లులు పెండింగ్‌లో వున్నాయట. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు, ఇంకా డబ్బులు రావాల్సి వుందట. కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం బిల్లులు క్లియర్‌ చేయడం లేదట. దీంతో జగన్‌‌తో వైరం పెంచుకుంటే, బిల్లులన్నీ మరింతకాలం పెండింగ్‌లో పడతాయని భావించిన సీఎ రమేష్‌, వైసీపీ అధినేతతో కయ్యం కన్నా వియ్యమే మేలని ఆలోచిస్తున్నారట. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం నడుపుతూ, జగన్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో పాటు బీజేపీ అధిష్టానం కూడా జగన్‌ పట్ల పాజిటివ్‌ కూడా వున్నప్పుడు, తానెందుకు నెగెటివ్‌గా వుండాలని ఆలోచిస్తున్నారట. అందుకే జగన్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే, మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసి, ఇప్పుడు క్లోజ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రమేష్‌ను మాత్రం, జగన్‌ దూరం పెడుతున్నారట. అందుకే కొడుకు మ్యారేజ్‌కు సైతం రాలేనని సున్నితంగా బదులిచ్చారట. అదీ సీఎం జగన్‌, సీఎం రమేష్‌ మధ్య జరిగిన వెడ్డింగ్‌ కార్డు ముచ్చట.


Web TitleHere is CM Jagan's reaction to CM Ramesh's invitation
Next Story