లౌడ్‌ స్పీకర్‌కు లౌక్యం లేదా.. ఉన్న ఉద్యోగాన్ని కావాలనే ఊడగొట్టారా?

Roja
x

Nagari: లౌడ్‌ స్పీకర్‌కు లౌక్యం లేదా.. ఉన్న ఉద్యోగాన్ని కావాలనే ఊడగొట్టారా?

Highlights

Chittoor: రోజాకు మరోసారి షాక్‌ తగిలిందా? ఉన్న ఉద్యోగాన్ని కావాలనే ఊడగొట్టారా?

Chittoor: రోజాకు మరోసారి షాక్‌ తగిలిందా? ఉన్న ఉద్యోగాన్ని కావాలనే ఊడగొట్టారా? రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీఐఐసీ పదవి వేరొకరిని ఎందుకు వరించింది? ఇప్పటికే నగరిలో రోజా అసమ్మతి వర్గం నేతకు రాష్ట్ర పదవి కట్టబెట్టిన అధిష్టానం ఈసారి అదే ?ఝలక్‌ ఎందుకు ఇచ్చింది? పెద్దిరెడ్డితో వైరమా నగరిలో తిరగబడుతున్న అసహనమా? రోజాకు ఎందుకిలా ముళ్లు గుచ్చుకుంటున్నాయి? పొలిటికల్ స్క్రీన్‌పై చెలరేగిపోయిన స్టార్‌కు ఉన్నఫళంగా అదృష్టం తిరగబడిందా? ఎందుకు రోజాకు ఏమైంది.? పొలిటికల్‌ ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌కి డామేజ్‌ జరుగుతోందా?

నగరి ఎమ్మెల్యే, వైసీపీలో కీలక నాయకురాలు రోజాకు ఇంకా చిక్కులు వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీలో అంతా తానై వ్యవహరించే రోజాకు సొంత నియోజకవర్గంలోనే తిప్పలు తప్పడం లేదట. దీనికి తోడు తాజాగా తాను పదవిలో ఉన్న ఏపీఐఐసీ ఛైర్మన్‌ గిరి కూడా పోవడంతో రోజా ఇంకా షాక్‌లో ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె అసమ్మతి వర్గం నేతకు రాష్ట్ర పదవి కట్టబెట్టి పొగబెట్టిన అదిష్టానం- ఈసారి మరో నేతకు కీలక పదవిని కట్టబెట్టి ఝలక్ ఇచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. నగరి నియోజకవర్గంలో ఒకనాడు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి చెంగారెడ్డి అన్న కొడుకు చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ఛైర్మన్ గిరి అప్పగించారు. మొదట్లో రోజాకు వ్యతిరేకంగా పావులు కదిపిన చక్రపాణిరెడ్డి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటున్నారు.

నిజానికి చక్రపాణిరెడ్డి గత కొంత కాలంగా పార్టీలో క్రియాశీలకంగా లేకున్నా పార్టీని వీడలేదు. మొదట్లో రోజాతో విబేధించిన ఆయన ఆ తరువాత ఆమెతో వైరం ఎందుకని సర్దుకున్నారట. అంత మాత్రాన పూర్తిగా మారిపోలేదని టాక్‌. ఈ సందర్భంలో చక్రపాణిరెడ్డికి ప్రతిష్ఠాత్మక పదవి దక్కడంతో ఆయన వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గంలోని నిండ్ర, విజయపురం మండలాలలో తనకంటూ సొంత వర్గమున్న ఆ నేతకు ఇప్పుడు అదనపు బలం చేకూరిందని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో అసలే రాజకేయంగా పుట్టెడు కష్టాలు భరిస్తున్న రోజాకు ఈ అంశం మరో తలపోటుగా మారింది. అయితే నియోజకవర్గంలోనో జిల్లాలోనో పదవి కాదు కాబట్టి తనకొచ్చే ఇబ్బందేమీ ఉండదని భావించి కొంత ఊరట పొందుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

పార్టీ అధికారంలోకి రాగానే మంత్రిపదవి ఆశించిన రోజాకు ఆ పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. అయితే తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మరో నేతలు అప్పగించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి. కొంతకాలంగా పార్టీలో రోజాకు పొగ పెడుతున్నారనే ప్రచారం సాగుతుండగా అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతోంది. నగరి ఎమ్మెల్యే రోజా కొంత కాలంగా చిత్తూరు వైసీపీలో ఒంటరయ్యారనే ప్రచారం ఉంది. రోజాకు పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.

జిల్లాలో పార్టీ రాజకీయాలను శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు విబేధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఆమెకు అస్సలు పొసగడం లేదు. జిల్లాలో ఉన్న ఏ ఒక్కరూ పెద్దిరెడ్డిని కాదని రోజాకు అండదండలు అందించే పరిస్థితి లేదు. నేరుగా సీఎం జగన్‌తో పరిచయం ఉండటంతో నెట్టుకొస్తున్న రోజా తన ప్రయాణంలో సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న వారిని అందలమెక్కిస్తున్న తీరు చూసి కుమిలిపోతున్నారట. రేపు రేపు నగరి రాజకీయాలను ఏ మలుపుకు తిప్పుతుందోనన్న చర్చకు దారి తీస్తోందట.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు తన నియోజకవర్గంలో అంతా తానై వెలగాలని పెద్ద లీడర్లతో పోలికలేసుకుని పొలికేకలేయడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. దీంతో లీడర్, క్యాడర్ అంతా తానే అన్నట్లుగా సాగాలనుకున్న ఆమె వ్యూహం బెడిసి కొట్టిందన్న చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో నగరి మున్సిపాలిటీ, విజయపురం, పుత్తూరులో ఆమెకు ఆదిలోనే ఎదురుగాలి వీచింది. అక్కడి అసంతృప్తులకు జిల్లాలో పార్టీకి పెద్దాయనగా చలామణి అవుతున్న పెద్దిరెడ్డి ఆశీర్వాదం ఉంది. దీంతో వారెవరూ రోజాకు తలొగ్గలేదు. మరి మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజాకు ఎదురౌతున్న రాజకీయ సమస్యలు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories