కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై జీవీఎంసీ కొరడా.. సాక్ష్యాత్తు సీఎం ప్రారంభించిన పనులకే..

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై జీవీఎంసీ కొరడా.. సాక్ష్యాత్తు సీఎం ప్రారంభించిన పనులకే..
x
Highlights

Visakhapatnam: కాంట్రాక్టర్లపై కొరడా ఝుళిపించేందుకు జీవీఎంసీ రెడీ అయింది. పనుల టెండర్లు దక్కించుకొని వాటిని పూర్తి చేయకుండా జాప్యం...

Visakhapatnam: కాంట్రాక్టర్లపై కొరడా ఝుళిపించేందుకు జీవీఎంసీ రెడీ అయింది. పనుల టెండర్లు దక్కించుకొని వాటిని పూర్తి చేయకుండా జాప్యం చేస్తుండడంతో కన్నెర్ర చేస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా 169 పనులు విశాఖ నగర వ్యాప్తంగా నిలిచిపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన పనులు కూడా అంగుళం కదలడం లేదు. కాంట్రక్టర్ల నిర్వాకం కారణంగానే పనులు నిలిచిపోతున్నాయని గ్రహించిన గ్రేటర్ కమిషనర్ సృజన వారిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఒక్కసారిగా కాంట్రాక్టర్లలో కలకలం రేపుతోంది.

గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో 98 వార్డులున్నాయి. విశాఖ రాజధాని కాబోతున్న నేపథ్యంలో వార్డులు పెంపు జరిగింది. కానీ నగరంతో పాటు విలీన ప్రాంతాల్లో సైతం కనీస వసతులకు దిక్కులేదు. దేశంలోనే అత్యుత్తమ నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని కోసం జీవీఎంసీ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ కనీస వసతులు లేవో గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించింది.

గ్రేటర్ పరిధిలో మొత్తం 169 పనులు చేపట్టాల్సి ఉందని గుర్తించారు జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు. వెంటనే ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. చాలా మంది పోటీపడి పలువురు కాంట్రాక్టర్లు ఈ పనులను 7 నెలలు క్రితం దక్కించుకున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి విఘాతం కలిగినట్లయ్యింది. సాక్షాత్తు సీఎం విశాఖ వచ్చి శంకుస్థాపన చేసిన పనులకు కూడా అతీగతీ లేకుండా పోయింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం జగన్ ఏ క్షణంలోనైనా విశాఖ అభివృద్ధి పై సమీక్షించే అవకాశమున్నందున జీవీఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు.

నిర్లక్ష్యం వహిస్తున్న గుత్తేదారులను బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ అధికారులు సూచించినా కొందరు పట్టించుకోకపోవడంతో ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నారు అధికారులు. కమిషనర్ సృజన ఆదేశాల మేరకు ప్రధాన ఇంజినీయర్ వెంకటేశ్వరరావు జీవీఎంసీకి చెందిన 169 మంది గుత్తేదారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారు చెల్లించిన డిపాజిట్లు కోల్పోవడంతోపాటు, ఐదేళ్లపాటు బ్లాక్‌లిస్టులో పెట్టేలా ప్రభుత్వానికి నివేదించనున్నారు. తిరిగి ఆయా పనులకు టెండర్లు ఆహ్వానిస్తామని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories