Gulab Cyclone: ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకు వస్తున్న గులాబ్‌ తుపాను

Gulab Cyclone: ఉత్తరాంధ్రకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Sandeep Eggoju
Updated on: 26 Sept 2021 2:04 PM IST
Gulab Cyclone High Alert North Coastal Andhra Pradesh
X

ఉత్తరాంధ్ర తీరం వైపుకు దూసుకువస్తున్న గులాబీ తుఫాన్ (ఫైల్ ఇమేజ్)

Gulab Cyclone: ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్‌ తుపాను దూసుకొస్తోంది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి మరింత బలపడి గులాబ్ తుపానుగా మారింది. ప్రస్తుతం ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 370 కిలో మీటర్లు శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి తూర్పు దిశలో 440 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉన్నప్పుడు గంటకు 14 కిలో మీటర్ల వేగంతో కదిలిన గులాబ్‌ తుపానుగా మారిన తర్వాత గంటకు 7 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సముద్ర మట్టానికి 5.6 కిలో మీటర్ల ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో తుపాను మరింత చురుగ్గా కదులుతోంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కాస్త పరిస్థితుల మార్పు చెందితే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతోనూ.. గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 27వ తేదీ వరకూ మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, సోంపేట, గంజాం జిల్లాల్లో మీటరు ఎత్తు వరకూ అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండనున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.

తుపాను నేపథ్యంలో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉంది. బొప్పాయి, అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రైతులు అప్రమత్తంగా వ్యవహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ముందు జాగ్రత్తగా విశాఖపట్నంలో ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళానికి మరో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story