ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాన్ బీభత్సం, ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు

Gulab Cyclone Effect in Andhra Pradesh | AP Live News Updates
x

ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాన్ బీభత్సం, ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు

Highlights

Gulab Cyclone: *విశాఖపట్నంలో 33.3 సెం.మీ. అత్యధిక వర్షం *లక్ష ఎకరాల్లో పంట నష్టం

Gulab Cyclone: ఆంధ్రప్రదేశ్‌ను గులాబ్ తుఫాను గజగజా వణికించింది. ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు బీభత్సం సృష్టించింది. లోతట్టు కాలనీలను ముంచేసింది. అక్కడి ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపెట్టింది. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలు చోట్ల కుంభవృష్టి కురిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. చాలాచోట్ల గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గులాబ్ తుఫాను కారణంగా 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. రోడ్లు, వంతెనల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్ సబ్‌స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖలో వాహనాలు నీటమునిగాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గజపతినగరం, పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి. గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories