Top
logo

Floodwater: మూడున్నర దశాబ్దాల తర్వాత మహోగ్రంగా గోదావరి !

Floodwater: మూడున్నర దశాబ్దాల తర్వాత మహోగ్రంగా గోదావరి !
X
Highlights

Floodwater: వరదలతో గోదారి ఉప్పొంగుతోంది. 34 ఏళ్ల క్రితం చూసిన ఉగ్ర గోదారమ్మను మళ్లీ ఇప్పుడే...

Floodwater: వరదలతో గోదారి ఉప్పొంగుతోంది. 34 ఏళ్ల క్రితం చూసిన ఉగ్ర గోదారమ్మను మళ్లీ ఇప్పుడే చూస్తున్నాం. ఎప్పుడు వరద నీరు వచ్చి తమ గ్రామాలను ముంచెత్తిపోతుందో అని, అటు లంక గ్రామలతో పాటు ఏజెన్నీ గ్రామవాసులు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కు మంటున్నారు. ముప్పు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. వణుకు పుట్టిస్తున్న ప్రస్తుత గోదావరి వరదల ఉధృతిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

పశ్చిమ గోదావరి జిల్లాలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. 1986 నాటి వరద భయాన్ని మరోమారు గుర్తు చేసేలా కన్నెర్రజేసింది. ఇప్పటికే నది ప్రవాహం పోలవరం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తింది. పాత పోలవరం గ్రామానికి రక్షణ గోడగా ఏర్పాటు చేసుకన్న రివర్ బండ్ కు గండి పడడంతో రాత్రి, పగలు తేడాలేకుండా జోరు వానలో సైతం ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేసి ప్రవాహ తీవ్రతను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో మొదటిసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయికి దవళేశ్వరం వద్ద వరద తీవ్రత చేరుకుందంటే, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత మొదటిసారి వరద నీరు 30 మీటర్లు దాటి ప్రమాద స్థాయిని సూచిస్తోంది. పోలవరం సమీపంలోని కడెమ్మ స్లూయిజ్ వద్ద భారీగా వరదనీరు చేరుకుంది. వరద తీవ్రత రానురాను పెరగడంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించే పనిలో పడ్డారు అధికారులు.

సరిగ్గా 34ఏళ్ల క్రితం గోదావరి వరదలు ఎన్నో గ్రామాలను సముద్రగర్భంలో కలిపేసింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో నిరాశ్రయులైయ్యారు. 1986 ఆగష్టు నెలలో వచ్చిన వరదల తరువాత ఎప్పుడూ గోదావరి ప్రజలను అంతటి స్దాయిలో భయభ్రాంతులకు గురిచేసింది లేదు. తాజాగా ఇప్పడు వరదల తీవ్రత చూస్తేంటే పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు, లంకగ్రామాలు హడలిపోతున్నాయి. ఇప్పటికే పాతపోలవరం ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మైక్ ద్వారా ప్రచారం చేస్తూ బలవంతంగా గ్రామాన్ని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. ప్రస్తుతం పోలవరం వద్ద పరిస్దితి చూస్తే గ్రామాల్లోకి వరద నీరు చేరడం, పాతపోలవరం మొంచెత్తడం తప్పదని భావించి స్దానికులు స్వచ్చందంగా సామాన్లు ఇళ్లలోనే వదిలి ఊరు ఖాళీ చేస్తున్నారు.

ఓ వైపు భద్రాచలం మరో వైపు దవళేశ‌్వరం వద్ద గోదావరి వరద రానురాను వేగంగా పెరుగుతోంది. లక్షలాది క్యూసెక్ ల వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కాజ్ వేలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. వేలేరు మండలం పూర్తిగా జలధిగ్భంలో చిక్కుకుంది. వేలేరుపాడు మండలంలోని 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు. పోలవరం ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే 19 గిరిజన గ్రామాలు ఐదు రోజుల నుంచి జలధిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల గిరిజనులు పోలవరం చేరుకోవాలంటే కొత్తూరు కాజ్ వే దాటి రావాలి. ప్రస్తుతం కొత్తూరు కాజ్ వే వద్ద 25 అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. మరో వైపు సముద్రతీర ప్రాంతంలోని లంక గ్రామాల్లో సైతం వరద ఉదృతి పెరుగుతోంది. ఆచంట, యలమంచి మండలాల్లో అయోధ్య లంక, పుచ్చల లంక, మర్రిమూల, పెదమల్లం లంక ఇలా అనేక లంకల్లోకి వరద నీరు చేరుతుండడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వరదల ఉదృతి పెరుగుతున్న తీరు చూస్తే అటు ఎజెన్సీ గామాలు, ఇటు దిగువన ఉన్న లంక గ్రామాల్లో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. ఏ క్షణంలో వరదలు గ్రామాలను ముంచెత్తుతాయో తెలియక ఆందోళన పరిస్థితి నెలకొంది.


Web TitleGodavari Water Level Increases
Next Story