GGH Doctors In Tension: ఫుల్ టెన్షన్ లో జీజీహెచ్ డాక్టర్లు?

GGH Doctors  In Tension Regarding RaghuRam Krishna Raju Case
x

RaghuRam Krishna Raju

Highlights

GGH Doctors In Tension: రఘురామకృష్ణరాజు కేసులో జీజీహెచ్ వైద్యులు టెన్షన్ పడుతున్నారని సమాచారం.

GGH Doctors In Tension: రఘురామకృష్ణరాజు కేసులో ఆయనను హింసించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ అధికారుల కన్నా ఎక్కువ టెన్షన్ లో వేరేవారు ఉన్నారు. వారే గుంటూరు జీజీహెచ్ వైద్యులు. అవును రఘురామకృష్ణరాజుపై మెడికల్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తే 24 గంటల పాటు నానా తంటాలు పడి.. కోర్టులను సైతం వెయిటింగ్ లో పెట్టి తయారు చేసి ఇచ్చిన నివేదిక తప్పుడుదని ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ముందే బయటపడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికతో గుంటూరు జీజీహెచ్ నివేదిక తప్పు అని తేలిపోయింది.

సుప్రీం కోర్టులో ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాదప్రతివాదనలు హోరాహోరీగా సాగాయి. ఎంపీ రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు బిగుసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీ హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి.. వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపీ రఘురామ ఆరోగ్యంపై నివేదిక అందజేయాలని చెప్పిందని ఆయన తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. అనంతరం రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోర్టు చెప్పిందని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల టీమ్ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన రిపోర్టులో ఆయనకు గాయాలయ్యాయని.. ఎముక విరిగినట్లు నివేదికలో ఉందని అన్నారు.

గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ భర్త వైసీపీ లీగల్ సెల్‌లో కీలక నేతగా ఉన్నారని.. అందుకే తప్పుడు నివేదిక ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను జీజీహెచ్ చెకప్ అనంతరం రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా పట్టించుకోకుండా జైలుకి తరలించారని న్యాయస్థానానికి విన్నవించారు. ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇవ్వడంతో పాటు అందుకు కారణమైన పోలీసులు, వైద్యులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరడం సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని.. కోర్టుకు తప్పుడు నివేదిక సమర్పించారని సుప్రీం కోర్టులో వాదనలు జరగడంతో ఎంపీ రఘురామ వ్యవహారం గుంటూరు వైద్యుల మెడకు చుట్టుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories