Jogi Ramesh: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగి రమేశ్.. ఫోన్ స్విచ్ఛాఫ్!

Jogi Ramesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Arun Chilukuri
Published on: 2 Feb 2026 11:29 AM IST
Jogi Ramesh: అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగి రమేశ్.. ఫోన్ స్విచ్ఛాఫ్!
X

Jogi Ramesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో, అరెస్ట్ తప్పదని భావించిన ఆయన తన నివాసం నుంచి పరారయ్యారు. ప్రస్తుతం ఆయన సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

కేసు వివరాలు ఇవే: మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, వివిధ కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారనే ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన ఎస్ఐ సత్యవతి, జోగి రమేశ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 189(2), 190, 292, 324(4) కింద కేసు నమోదు చేశారు.

రాత్రికి రాత్రే నివాసం ఖాళీ: నిన్న రాత్రి తిరుపతి పర్యటన ముగించుకుని ఇబ్రహీంపట్నంలోని తన నివాసానికి చేరుకున్న జోగి రమేశ్‌ను, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు పరామర్శించారు. అనంతరం రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో జగన్ మోహన్ రావుతో కలిసి జోగి రమేశ్ తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన వెంట కుమారుడు రాజీవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆయన ఇంటికి చేరుకునే లోపే ఆయన పరారు కావడంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరో కేసుపై పోలీసుల దృష్టి: ఇదిలావుండగా, జోగి రమేశ్ నివాసంపై జరిగిన దాడి ఘటనను కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించి టీడీపీ శ్రేణుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరో వేరే కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జోగి రమేశ్ ఎక్కడ ఉన్నారనే కోణంలో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story