టీడీపీకి ఆది ఇవ్వబోతున్న షాక్ ఏంటి?

టీడీపీకి ఆది ఇవ్వబోతున్న షాక్ ఏంటి?
x
Highlights

కడప జిల్లాలో టిడిపికి మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయమా ఓ సీనియర్ నాయకుడు టిడిపిని వీడి కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే...

కడప జిల్లాలో టిడిపికి మరో ఎదురుదెబ్బ తగలడం ఖాయమా ఓ సీనియర్ నాయకుడు టిడిపిని వీడి కమలం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సిఎం రమేష్, బిజేపిలో చేరడం మార్చిపోకముందే, మరో సీనియర్ నేత పార్టీ వీడేందుకు సిద్దమయ్యాడన్న ప్రచారం, జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ నేత పార్టీ మారడం ద్వారా ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జిల్లా రాజకీయం మరోమారు వేడెక్కింది. ఇంతకీ ఎవరా నేత?

కడప జిల్లాలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని బలపడాలన్న ప్రయత్నం బలంగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది బీజేపీ. ఏకంగా సీఎం ఇలాకాపై గురిపెడుతోంది. కీలక నేతలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ వల విసురుతోంది. టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, కడప నేత సిఎం రమేష్ బిజేపిలో చేరగా, ఇప్పుడు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం, కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారన్న ఊహాగానాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుండటంతో నాయకుల చేరికలకు, రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇతర పార్టీల్లోని ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, వాయిస్‌ ఉన్న మహిళా నేతలు ఇలా అన్ని వర్గాలవైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సీమలో కీలక లీడరైన మాజీ మంత్రి ఆదిని చేర్చుకునేందుకు బీజేపీ చాలా రకాలుగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

గతంలో వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరుండేది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి. అయితే వైఎస్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఆయన ఆ ఫ్యామిలీకి దూరమవుతూ వచ్చారు. రెండేళ్ల క్రితం ఏకంగా తెలుగుదేశంలో చేరారు. అయితే ఆయన చేరిక సమయంలో అప్పటి జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి రామసుబ్బారెడ్డి, తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ టిడిపి అధినేత ఇద్దర్నీ ఒకేతాటిపైకి తెచ్చి, మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఆయన టిడిపిలో చేరాక, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శల తూటాలు కురిపించారు. ఎన్నికల్లో కడప ఎంపిగా పొటీ చేసిన ఆది, ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆది అంచనాలన్నీ రివర్సయ్యాయి.

ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జిల్లాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. ఓవైపు రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి రావడం, ఇతరత్రా వ్యక్తిగత విషయాలతో రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించాలంటే, బీజేపీలో చేరడమే మార్గమని ఆదినారాయణరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే బిజేపిలో చేరేందుకు ప్రయత్నాలు ఆరంభించారట మాజీ మంత్రి ఆది. అయితే, పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ బిజేపిలో చేరిపోయారు. రాజకీయంగా సిఎం రమేష్‌తో పెద్దగా పొసగదు ఆదికి. అయినా బిజేపిలో చేరే ప్రయత్నాలు మానుకోలేదట ఆదినారాయణ రెడ్డి.

కొద్దికాలం క్రితం దివంగత వైఎస్ఆర్ ప్రియ శిష్యుడిగా కొనసాగిన మాజీ డిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత బిజేపి నాయకుడు మాకం అశోక్ కుమార్ ద్వారా, బిజేపి రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మరో బిజేపి నేత, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం. ఈ ప్రచారం సాగుతున్న నేపథ్యంలోనే, బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను, ఆది కలిశారన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటి ద్వారా ఆది బిజేపిలో చేరిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.

త్వరలోనే బిజేపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనలో ఆదినారాయణరెడ్డి, కమలం తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాకు చెందిన పలువురితో ఆర్బాటంగా అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరికకు, రంగం సిద్దం చేసుకుంటున్నట్లు ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు.

అయితే జగన్‌పై ఎన్నికల ముందు ఒంటికాలిపై లేచిన ఆదినారాయణరెడ్డి, బిజేపిలో చేరిన తర్వాత, మళ్లీ అదే వైఖరిని కంటిన్యూ చేస్తారా అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టిడిపిలో చేరిన నాటి నుంచి ప్రతినిత్యం హాట్‌హాట్ కామెంట్స్‌తో ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి, ఇప్పుడు బిజేపిలో చేరిన తర్వాత వైఎస్ జగన్‌పై ఎలాంటి కామెంట్స్‌ ఎక్కుపెడతారు, టిడిపిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. చూడాలి ఆది అడుగులు ఎటువైపు పడతాయో ఎలాంటి వాగ్భాణాలు దూసుకొస్తాయో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories