Eluru: ఏలూరు ఎంపీ మీకైమనా కనిపించారా?

Kotagiri Sridhar
x

Eluru: ఏలూరు ఎంపీ మీకైమనా కనిపించారా?

Highlights

Eluru: ఏలూరు ప్రజలు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు తమ ఎంపీ ఎక్కడా అని!!

Eluru: ఏలూరు ప్రజలు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు తమ ఎంపీ ఎక్కడా అని!! ఫేస్‌బుక్‌లు గాలిస్తున్నారు. గూగుల్‌ను పరిశోధిస్తున్నారు. అయినా జాడ లేదు. జవాబు లేదు. అధికార పార్టీలో ఉంటూ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ గుసగసలాడుకుంటున్నారు. ఎంపీ టికెట్‌ కోసం పార్టీలు మారి కండువాలు మార్చి కంగారెత్తించిన నాయకుడు ఏమయ్యారని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏడాది పాలనలోనే ఆయన ప్రజల మన్ననలు కోల్పోయారా? అసలు తండ్రికి తగ్గ వారసుడు అని అనిపించుకున్నారా... లేదా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో చక్రం తిప్పారు దివంగత నేత, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో మంత్రిగా సేవలందించి, ప్రజలకు ఎంతో సేవ చేశారన్న పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన చేరి, ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ విద్యాధరరావు మరణానంతరం ఆయన రాజకీయ వారసుడిగా కోటగిరి తనయుడు శ్రీధర్ రంగంలోకి దిగారు. పోటీ చేస్తే ఎంపీగానే పోటీ చేయాలని పట్టుబట్టి 2014 ఎన్నికల్లో బీజేపీలో చేరారు. కానీ టికెట్‌ దక్కలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కోటగిరి శ్రీధర్‌ ఎలాగొలా 2019 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ దక్కించుకున్నారు. ఏలూరు ఎంపీగా విజయం సాధించారు.

పట్టువదలని విక్రమార్కుడిలా టికెట్‌ దక్కించుకొని, ఎంపీగా బాధ్యతలు చేపట్టి, పార్లమెంట్‌కు వెళ్లిన శ్రీధర్‌ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటమే మానేశారన్నది ఏలూరు వినిపిస్తున్న టాక్‌. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్లి ఇక్కడి ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుకొని, తిరిగి రావడం ఏ ఎంపీ అయినా చేసే పని. కానీ, ఈయన గారు మాత్రం ఢిల్లీ వెళ్లారో, లేక దేశమే దాటి వెళ్లారో ఎవరికీ తెలియదంటున్నారు ప్రజలు. పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడప్పుడూ ప్రశ్నించే కోటగిరి శ్రీధర్‌ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరనే విమర్శలు ఎక్కువయ్యాయి.

ప్రత్యక్ష ఎన్నికల ముందు కోటగిరి శ్రీధర్‌ విదేశాల్లో స్థిరపడ్డారు. జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం విదేశాల చుట్టూనే తిరిగారు. కానీ ఎంపీగా గెలిచిన తర్వాత కష్టాలు చెప్పుకుందామంటే పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు కంటబడి పుణ్యం కట్టుకోలేదని వాపోతున్నారు. మా ఎంపీ ఎక్కడా అంటూ ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, కైకలూరు, నూజివీడు ప్రాంతాల్లో సమస్యలు ఎదురైన వారి ప్రతీ నోటా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

ఎంపీగా గెలిచి ఇన్నేళ్లలో కనీసం రెండు మూడుసార్లైనా శ్రీధర్ తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించలేదట. కనీసం అధికారిక సమీక్షలకు కూడా హాజరు కాలేదట. నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల మంది వరకూ ప్రజలు ఉండగా, ఓటర్లే 13 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇందులో ఆయనకు ఓట్లేసినవారే అత్యధికం. వైఎస్ జగన్ బొమ్మ చూసో, లేక, దివంగత కోటగిరి విద్యాధరరావుపై అభిమానమోగానీ, లక్షన్నరకు పైగా ఓట్ల ఆధిక్యంతో శ్రీధర్‌ను గెలిపించారిక్కడి ప్రజలు. ఇంత అభిమానం చూపిస్తే తాము ఓటు వేసిన ఎంపీని ఎక్కడ కలవాలి, ఎలా కలవాలో కూడా తెలియడం లేదని ప్రజలు నిరుత్సాహ పడుతున్నారు.

సాధారణ సమయాల్లో పార్లమెంట్ సమావేశాలు, లేకుంటే స్థానిక సమస్యలపై దేశీయ, విదేశీయ ప్రతినిధులతో చర్చలు, అభివృద్ధిపై సమీక్షలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే తమ ఎంపీ కనీసం కరోనా కష్టకాలంలోనూ తమను గుర్తుతెచ్చుకోలేదని వాపోతున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి లక్షలాది మంది అవస్థలు పడుతుంటే తమ బాధలు వినేవారే లేరని ఆవేదన చెందుతున్నారు. స్థానిక అధికారులు, యంత్రాంగం అంతా కరోనా కట్టడికి పనిచేస్తుంటే, ప్రజలను ప్రజాప్రతినిధులేగా ఆదుకోవాలి అనీ, కానీ తమ ప్రజాప్రతినిధి మాత్రం తమకు అందనంత దూరంలో ఉన్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

లాక్‌డౌన్ ముందు కరోనా సమయంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించగా ఒక్కటంటే ఒక్కసారి నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ కోటగిరి ఆ తర్వాత ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఇక అడ్రస్ లేరట. ఎప్పుడుచూసినా ఢిల్లీలోనో, విదేశాల్లోనో ఏదో జాతీయ స్థాయి సమస్యలపై చర్చించానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఎంపీ, స్థానిక ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించరని వారు అడుగుతున్నారు. ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నత్తనడకన నడుస్తూ, అక్కడి నిర్వాసితులకు పరిహారం అందకపోయినా, కేంద్రంతో సంప్రదించి వేగవంతం చేయించాల్సిన బాధ్యత ఉన్న ఎంపీ కోటగిరి కనీసం నిర్వాసితుల గోడు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాక్షాత్తూ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నా ఎంపీగా తాను కనీసం పర్యటించకపోవడం విడ్డూరమంటున్నారు ప్రజలు.

ఒక పక్క జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రజల సమస్యలను లేవనెత్తుతూ, మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఇదే జిల్లాలోని ఏలూరు ఎంపీ మాత్రం కనీసం ప్రజలకు, మీడియాకు కూడా కానరాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, నియోజకవర్గంలోని ఏలూరు అసెంబ్లీలో ఎంపీ పర్యటించేందుకు స్థానిక నేత అభ్యంతరాలు అడ్డున్నాయని ఆయన అనుచరులు సాకులు చెబుతున్నా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఏనాడు పర్యటించారనేది ఆయనకే తెలియాలంటున్నారు. మరి కోటగిరి శ్రీధర్‌ వైఖరిపై ఆ పార్టీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు? విద్యాధరరావు వారసుడిగా శ్రీధర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారా లేదా అన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories