logo
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం
X
Highlights

విజయనగరం జిల్లా వాసులకు ఏనుగుల గుంపు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలో...

విజయనగరం జిల్లా వాసులకు ఏనుగుల గుంపు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తుండటంతో జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. ఏక్షణంలో ఎవరిపై దాడచేస్తాయోనని బయపడుతూ జీవిస్తున్నారు. విజయనగరం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులు గుంపుపై హెచ్ఎంటివి అందిస్తోన్న ప్రత్యేక కథనం.

విజయనగరం జిల్లా కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస మండలాలో ఏనుగుల గుంపు తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రదానంగా కొమరాడ మండలం దుగ్గి, కల్లికోట గ్రామాలలో గత కొన్ని రోజులుగా ఏనుగుల గుంపు తిరుగుతూ చేతికివచ్చిన పంటలను నాశనం చేస్తున్నాయి. దాంతో పాటు గ్రామ శివారులో ఉన్న ఇళ్ళను, వాహనాలను, మోటారు బోర్లను ద్వంసం చేస్తూ గ్రామస్థులను భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏనుగుల గుంపు రాత్రివేళ పంట పొలాల్లో దాడిచేస్తుండటంతో వందలాది ఎకరాల పంటలు నాశనమవుతున్నాయి. రెండున్నర సంవత్సరాలుగా ఏనుగులు తిరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒడిషాలోని అటవీ ప్రాంతం నుండి రెండు సంవత్సరాల క్రితం ఎనిమిది ఏనుగుల గుంపు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించాయి. ఆనాటి నుండి ఏనుగుల గుంపు ఇక్కడే తిష్ట వేసి కొమరాడ, జియమ్మవలస, గరుగుబిల్లి మండలాలో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు ఎన్నిసార్లు వాటిని ఒడిషా ప్రాంతానికి తరలించినా అవి తిరిగి వెనకకు వచ్చేస్తూ రైతులు వేసుకున్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ ఏనుగుల గుంపు బారీ నుండి తమ పంటలను రక్షించి ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఏనుగుల గుంపు దాడిలో పంటలతో పాటు ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నా జిల్లా అధికారులు వాటిని తరలించే చర్యలు తీసుకోక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టాన్ని చవిచూస్తున్నారు. ప్రదానంగా అరటి, మొక్కజొన్న, వరి, పత్తి పంటలను ఏనుగుల గుంపు దాడిచేసి నష్ట పరుస్తున్నాయి. తమ పంటలను కాపాడలని అటవీ అధికారులను కోరుతున్నా ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగులు గుంపు కొమరాడ మండలం దుగ్గి, కల్లికోట గ్రామలలో ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గ్రామ సమీపంలో నాగావళి నదీ పరివాహక ప్రాంతం కావడంతో త్రాగునీటి సౌకర్యంతో పాటు ఆహారం దొరుకుతుండటంతో ఏనుగుల గుంపు ఈ ప్రాంతాన్ని వదలి వెళ్ళేందుకు ఇష్టపడటం లేదు.

Web Titleelephant groups hulchul in Vizianagaram
Next Story