రైతులకు గాడిదల సాయం

రైతులకు గాడిదల సాయం
x
Highlights

ఎవరైనా ఎక్కువుగా కష్టపడుతుంటే గాడిద చాకిరీ చేస్తున్నారంటాం. గాడిద అంత చాకిరి చేస్తుంది వసుదేవుడంతటివాడు అవసరం కొద్దీ గాడిద కాళ్ళు పట్టుకున్నాడని...

ఎవరైనా ఎక్కువుగా కష్టపడుతుంటే గాడిద చాకిరీ చేస్తున్నారంటాం. గాడిద అంత చాకిరి చేస్తుంది వసుదేవుడంతటివాడు అవసరం కొద్దీ గాడిద కాళ్ళు పట్టుకున్నాడని పెద్దల సామెత కానీ ఇప్పుడు అదే అవసరం పత్తికొండ రైతులకు వచ్చింది. తమ పొలాలకు వెళ్లాలన్నా ,పంటలకు ఎరువులు వేయలన్నా, మందు మూటలు తీసుకెళ్లాలన్నా ఇప్పుడు గాడిదలే వారికి దిక్కయ్యాయి గాడిద ఎంత కష్టమైన భరిస్తుంది. అందుకే ఇప్పుడు కర్నూలు జిల్లా రైతులు గాడిదలనే నమ్ముకున్నారు.

అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో సాగు చేసే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. భారీ వర్షాలతో పొలాల్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండటంతో రహదారులు బురద మయంగా మారిపోయాయి. ఎడ్లు, ఎడ్ల బండ్లు పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. దీంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఎలాగైనా పొలం లోకి వెళ్లి ఎరువులు వేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రైతులకు గాడిదలు గుర్తుకు వచ్చాయి. వాటి సాయంతో తమ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు.

గాడిదలపై ఎరువుల బస్తాలు వేసుకొని పొలం బాట పట్టారు. బురద రహదారుల్లోనూ చకచకా సాగిపోతున్నాయి. పొలాల్లోకి గాడిదలతో ఎరువులను తరలించేందుకు కొందరు గాడిదలను అద్దెకు ఇస్తున్నారు. ఒక్కొక్క గాడిదకి ఒక ఎరువు సంచికి 200 రూపాయల నుంచి 300 వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు ఒక గాడిద 8 నించి 10 సంచులను పొలానికి తరలిస్తోంది.

కర్నూలు జిల్లాలో హోసూరు గ్రామంలో రైతులు గాడిదలతో తమ పొలం పనులు కొనసాగిస్తున్నారు. దీన్ని చూసిన పక్క గ్రామాల రైతులు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. పనికి మాలిన గాడిద అనే మాట ఇక్కడ వినపడదు. నల్ల రేగడి భూములలో తమ పంటలకు కావలసిన వస్తువులను, పరికరాలను తీసుకువెళ్లేందుకు గాడిదల సాయం తీసుకుంటున్నారు రైతులు. గాడిదల వల్ల చాలా మందికి జీవనోపాధి కలుగుతోంది. ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి గాడిదలను కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇస్తున్నారు. హైటెక్ యుగంలో రవాణాకు ఎలాంటి ఇబ్బందీ లేదనిపిస్తుంది. కాని ప్రకృతి తిరిగబడితే కష్టాలు చుట్టు ముడితే.. పాత పద్ధతిలే ఆదుకుంటాయి.. ఆసరాగా నిలుస్తాయి. కర్నూలు జిల్లా రైతులకు గాడిదలు అందిస్తున్న సహకారమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.


Show Full Article
Print Article
Next Story
More Stories