ఏపీలో రాజకీయ చిచ్చు రేపుతున్న దివీస్ వ్యవహారం

ఏపీలో రాజకీయ చిచ్చు రేపుతున్న దివీస్ వ్యవహారం
x
ఫైల్ ఫోటో 
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ లాబరేటరీ వ్యవహారం చిచ్చు రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల సమీపంలో దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న 3వ యూనిట్ పై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ లాబరేటరీ వ్యవహారం చిచ్చు రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండల సమీపంలో దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న 3వ యూనిట్ పై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ధర్నాలు,నిరసనల ద్వారా ప్రజలు తమ ఆందోళను తెలియ జేస్తున్నారు. అధికార వర్గాల నుంచి ఎంతకూ స్పందన రాకపోవడంతో చుట్టూ పక్కల గ్రామ ప్రజలు దివీస్ కంపెనీ పరిశ్రమపై దాడి చేశారు. దివీస్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేశారు. అయినా వారు నిరసన మాత్రం వదులుకునేది లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు దివీస్ ఫార్మాను అక్కడి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? రాజకీయ పార్టీలు తమ వైఖరిని ఎందుకు మార్చుకుంటున్నాయి ? తదితర అంశాలపై hmtv స్పెషల్ ఫోకస్

దివీస్ సంస్థకు భూములను సేకరించి ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీ అధీనంలో ఉన్న200 ఎకరాలలో ఈ నెల 7న ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయాలని దివీస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించేందుకు కలెక్టర్ తొండంగికి వెళ్లారు. దివీస్ కార్యక్రమ ఏర్పాట్లను చూసేందుకు కలెక్టర్ వెళ్ళినప్పుడు దివీస్‌కు వ్యతిరేకంగా ఆందోళన మొదలైంది. ఎప్పటినుండో రైతులు, గ్రామస్తుల్లో గూడు కట్టుకున్న ద్వేషం ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో వారు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రదర్శనల్లో పాల్గొన్న ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిని విడుదల చేయాలని రైతులు పట్టు బట్టారు. అప్పటివరకూ వెనక్కి తగ్గేది లేదంటూ దివీస్ గేట్ ముందు బైఠాయించారు. దివీస్ లాబరేటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కనిపించిన వాటిని ధ్వంసం చేశారు. కంపెనీ కి చెందిన ప్రహరీ గోడను కూలగొట్టారు. గోడలను నేల మట్టం చేశారు. కంపెనీ పరిసరాల్లోని కంటైనెర్‌కు నిప్పు పెట్టారు.

తొండంగి మండలం కొత్తపాకల గ్రామ సమీపంలో దివీస్ లాబరేటరీ నిర్మాణానికి ఆ సంస్థ నిర్ణయించింది. దశల వారీగా 1500 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిశ్చయించింది. దీనిలో భాగంగా 500 ఎకరాలు సేకరించి ఇవ్వాలని APICCని దివీస్ కోరింది. దీంతో అన్నదాతల నుండి భూ సేకరణ మొదలు పెట్టింది. అతి కష్టంపై 200 ఎకరాల వరకూ 2015లో సేకరించారు. మిగిలిన భూమి కోసం రైతులు ససేమిరా అన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా 2016 నుండి రైతులు ఉద్యమిస్తున్నారు. అప్పటి నుండి ఇక్కడ రైతుల ఉద్యమం కొనసాగుతూనే వుంది. తాజాగా కలెక్టర్ రావడంతో మరోసారి రైతులు ఆందోళన చేపట్టారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. స్థానికుల నిరసనలకు సీపీఎం నాయకులు, జనసేన నాయకులు తోడయ్యారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.

తమ భూములు లాక్కుని సముద్ర తీరాన్ని కలుషితం చేసే వేలాది మందిని రోడ్డున పడేసే ఈ పరిశ్రమ వద్దంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మత్యకారుల జీవితాలను, హేచరీల భవిష్యత్తును కాలరాసి తీరాన్ని కాలుష్యం చెయ్యొద్దంటూ మండిపడుతున్నారు.

దివీస్ నిర్మిస్తే సమీపంలో ఉన్నసముద్ర తీరం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కు కుంటుందని..పర్యావరణం విషపూరితమైపోతుందని,చేపల వేట సాగించే పరిస్థితి ఉండదని వరుస నినాదాలు చేశారు. దివీస్ కంపెనీకి ఇంకా ౩౦౦ ఎకరాల వరకూ భూములు సేకరించాల్సి ఉండడం తో వాటిని ఇవ్వబోమని, తామంతా తరతరాలుగా వాటిని సాగు చేసుకుంటుంటే భూ సేకరణ పేరుతో లాక్కోవడం కుదరదని నినాదాలు చేశారు. విధ్వంసం నేపథ్యంలో దివీస్ పరిసరాల్లో పోలీసుల బలగాలు భారీగా దిగాయి. ఎవరు ఆందోళన చేసినా అదుపులోకి తీసుకోవాలని పోలీసుశాఖ నిర్ణయించింది.

దివీస్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారంలో వున్నప్పుడు అనుమతులు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే,వీస్ ల్యాబ్‌ను ఉండనివ్వం అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. దివీస్ ల్యాబ్స్ తన కొత్త యూనిట్‌ను ప్రాంభించేందుకు టీడీపీ హయంలోనే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు సీన్ రివెర్స్ అయ్యింది. రెండు పార్టీలు కూడా తమ స్టాండ్ మార్చేశాయి. ప్రస్తుతం వైసీపీ దివీస్‌కు సై అంటుంటే టీడీపీ మాత్రం నయ్ అంటుంది.

దివీస్ లాబరేటరీస్ తన మూడవ యూనిట్‌ను తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి సమీపంలో ఉన్నతొండంగి మండలం వద్ద కొత్తగా ప్లాంట్ ను ఏర్పాటు చేసుకుంటుంది. యూనిట్ 3 పెసిలిటీ కోసం 1500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు దివీస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 7 న ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆ సంస్థ తెలిపింది. అంతర్గత వనరులు దశల వారీగా ఈ ప్లాంట్ కోసం వెచ్చించనున్నట్లు దివీస్ యాజమాన్యం వెల్లడించింది. ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టి తొలిదశ కార్యకలాపాలు 12,18 నెలల్లో మొదలు పెట్టేందుకు దివీస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔషధ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కావలిసిన లైసెన్స్ లను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం నుండి అందుకున్నట్లు దివీస్ వెల్లడించింది.

తొండంగి మండలం సముద్ర తీరానికి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతాయి. మత్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని..అలాగే భూ గర్భ జలాలు కలుషితం అవుతాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు వ్యవసాయం,ఇటు జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని సమీప గ్రామ ప్రజలు అంటున్నారు. దివీస్ ల్యాబ్ ఇక్కడ వద్దంటే వద్దని ఉద్యమాలు చేస్తున్నారు.

ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ ఉద్యమం ఆగేటట్లు కనపడటం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories