రామనాథం రీఎంట్రీతో దగ్గుబాటికి పొగ మొదలైనట్టేనా?

రామనాథం రీఎంట్రీతో దగ్గుబాటికి పొగ మొదలైనట్టేనా?
x
Highlights

నందమూరి అల్లుడు. చంద్రబాబు తోడల్లుడు. రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. తన సొంత నియోజకవర్గంలో ఎదురులేదు, బెదురులేదన్న లీడర్. కానీ తానొకటి తలిస్తే, దైవం...

నందమూరి అల్లుడు. చంద్రబాబు తోడల్లుడు. రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. తన సొంత నియోజకవర్గంలో ఎదురులేదు, బెదురులేదన్న లీడర్. కానీ తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచింది అన్నట్టుగా, ఆయన ఓడిపోయారు. సరే, తాను ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చిందనుకుంటే, అంతలోనే ఆయనకు సెగ మొదలైంది. ఎన్నికల ముందు తనను తిట్టినతిట్టు తిట్టకుండా, పార్టీ నుంచి వెళ్లిపోయిన ఒక నాయకుడు, తిరిగి పార్టీలోకి రావడంతో, నందమూరి అల్లుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యర్థిలాంటి నాయకుడిని, పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ రగిలిపోతున్నాడు. మరి ఆయన పయనమేంటి?

ప్రకాశం జిల్లా పర్చూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు. ఇదే సమయంలో దగ్గుబాటి వైసీపీలోకి రావడాన్ని నిరసిస్తూ, టీడీపీలోకి వెళ్లారు రామనాథం. దగ్గుబాటిపై విమర్శనాస్త్రాలు కురిపిస్తూ, తెలుగుదేశం అభ్యర్థి విజయానికి కృషి చేశారు. దగ్గుబాటి, రామనాథంలు ఉప్పూనిప్పులా నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అయితే అదే రామనాథం ఇప్పుడు, సొంత గూటికి చేరడంతో, పర్చూరు వైసీపీ పేలడానికి సిద్దంగా ఉన్న ఆటంబాంబులా తయారైంది.

ప్రకాశం జిల్లా పర్చూరులో సీనియర్‌ నాయకుడు రామనాథం, తెలుగుదేశానికి గుడ్‌ బై చెప్పి, సొంత గూడైన వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చారు. సీఎం వైయస్ జగన్, రామనాథంకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రామనాథంతోపాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వారికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాకప్పి వెల్‌కం చెప్పారు. వైఎస్‌ జగన్‌ సుపరిపాలన చూసి వైసీపీలో చేరుతున్నట్లు చెప్పారు రామనాథం. విశాల హృదయంతో తనను సీఎం జగన్‌, పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. వైసీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రామనాథం బాబు చేరిక పర్చూరు వైసీపీలో కార్చిచ్చులా మండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికలకు ముందు పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా వ్యవహరించారు రామనాథం బాబు. నియోజకవర్గం ఇంచార్జ్ గా చక్రం తిప్పారు. తనకు టికెట్‌ ఖాయమని ప్రచారం చేసుకున్నారు. అయితే ఆకస్మాత్తుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సీన్‌లోకి ఎంటర్‌ కావడంతో, రామనాథం అంచనాలన్నీ రివర్సయ్యాయి. టికెట్ సైతం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు రామనాథం. ఆగ్రహంతో వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాకు విచ్చేసిన చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు రామనాథం. కానీ నాలుగైదు నెలల్లోనే సీన్‌ మరోసారి రివర్సయ్యింది.

టీడీపీ అభ‌్యర్థిని గెలిపించినా తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని టీడీపీలో రగిలిపోయారు రామనాథం. కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో సొంత గూటిపై మనసుపడి, తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, రామనాథం వెళ్లారు, వచ్చారు. అంతా బాగానే వుంది. కానీ పర్చూరులో తనను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించి, చివరికి ఓడించిన రామనాథంను తిరిగి పార్టీలో చేర్చుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు దగ్గుబాటి వెంకటేశ్వర రావు.

రామనాథం తిరిగి వైసీపీలో చేరడాన్ని సహించలేకపోతున్నారు దగ్గుబాటి. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, పార్టీ కండువా కప్పారని రగిలిపోతున్నారు. అంతేకాదు, తన కొడుకును వెంటబెట్టుకుని, పర్చూరు మొత్తం తిరుగుతూ, లీడర్‌గా ఎస్టాబ్లిష్‌ చేసి, వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో, తనకు ప్రత్యర్థిలాంటి రామనాథంను పార్టీలో చేర్చుకోవడమేంటని లోలోపల మండిపోతున్నారట దగ్గుబాటి.

అయితే పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జీగా దగ్గుబాటి ఉన్నప్పటికీ, రామనాథంను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి, దగ్గుబాటి తీరే కారణమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అధికారులపై అజమాయిషీ చేస్తున్నారని, తనకు తెలీకుండా నియోజకవర్గంలో ఏదీ జరగడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలు దగ్గుబాటిపై వినిపించాయి. అంతేకాదు, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దగ్గుబాటి దూరంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. దీనికితోడు, భార్య పురంధ్రీశ్వరి బీజేపీలో వుండటంతో, దగ్గుబాటికి జగన్‌ తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారన్న అభిప్రాయమూ వుంది. దగ్గుబాటి సైతం బీజేపీలో చేరతారన్న ఊహాగానాలూ గుప్పుమంటున్నాయి. ఇలా రకరకాల పరిణామాల నేపథ్యంలో, పర్చూరులో వైసీపీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని జగన్‌ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగమే రామనాథంను తిరిగి పార్టీలో చేర్చుకోవడమన్న చర్చ జరుగుతోంది.

మొత్తానికి రామనాథం వైసీపీలోకి రీఎంట్రీతో, దగ్గుబాటికి పొగపెట్టినట్టయ్యిందన్న వాదన వినిపిస్తోంది. మరి రామనాథంతో పాటు ఒకే పార్టీలో దగ్గుబాటి జర్నీ చేస్తారా, లేదంటే తనయుడి కోసం మరో పార్టీలోకి వెళతారా, అదీ లేదంటే కొంతకాలం సైలెన్స్ స్ట్రాటజీ ఫాలో అవుతారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories